పోలింగ్‌ జరిగిన 11 రోజులకు…

పోలింగ్‌ జరిగిన 11 రోజులకు...– తొలి దశ వివరాలు అందించిన ఈసీ
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.71 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. పోలింగ్‌ జరిగిన 11 రోజుల తర్వాత తొలి దశ వివరాలను వెల్లడించడం గమనార్హం. తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న, రెండో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 26న జరిగిన విషయం తెలిసిందే. తొలి దశలో బీహార్‌లో అత్యల్పంగా 49.26 శాతం ఓటింగ్‌ నమోదు కాగా లక్షద్వీప్‌ లో అత్యధికంగా 84.16 శాతం నమో దైంది. రెండో దశలో ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 55.19 శాతం, మణిపూర్‌ లో అత్యధికంగా 84.85 శాతం పోలింగ్‌ జరిగింది.
ప్రతి నియోజకవర్గంలోనూ పురుషులు, మహిళల ఓటింగ్‌ వివరాలను కూడా ఈసీ విడుదల చేసింది. అయితే నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు ఎంత మంది, వారిలో ఎంత మంది ఓటేశారు అనే వివరాలను మాత్రం తెలపలేదు. 2019లో ఎన్నికల కమిషన్‌ ఈ సమాచారాన్ని కూడా అందించింది. కమిషన్‌ వెబ్‌సైటులో ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ ఎంత మంది ఓటర్లు ఉన్నారన్న వివరాలు లేవు. కానీ పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల సంఖ్య మాత్రం ఉంది. బీహార్‌, ఢిల్లీ, ఒడిషా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఈ సమాచారం కూడా ఇవ్వలేదు.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్‌ నమోదైంది, ప్రస్తుతం ఎంత పోలింగ్‌ జరిగింది అనే సమాచారం కూడా ఈసీ వెబ్‌సైటులో కన్పించలేదు. తొలి దశ పోలింగ్‌ ముగిసిన 11 రోజుల తర్వాత ఓటింగ్‌ శాతాన్ని వెల్లడించడం అసాధారణమని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
అయితే ఈ జాప్యానికి కారణమేమిటో ఈసీ వివరించలేదు. రెండో దశ పోలింగ్‌లో 66.71 శాతం ఓటింగ్‌ జరిగిందని ఈసీ ప్రకటించి నప్పటికీ ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం ఏడు గంటలకు 60.96 శాతం పోలింగ్‌ జరిగిందని పత్రికా ప్రకటనలో తెలిపారు. ఓటింగ్‌లో ఆరు శాతం పెరుగుదల ఎందుకు వచ్చిందన్న దానిపై స్పష్టత లేదు. సుమారు ఆరు శాతం పెరుగుదల అంటే చిన్న విషయమేమీ కాదని, దీనిపై ఈసీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పాత్రికేయుడు ఎంఎన్‌ పార్థ్‌ అభిప్రాయపడ్డారు.
రెండో దశ పోలింగ్‌ రోజు రాత్రి 8 గంటలకు పీటీఐ వార్తా సంస్థ ఈసీని ఉటంకిస్తూ ఓ వార్తను అందించింది. 63.5 శాతం పోలింగ్‌ జరిగిందని తెలిపింది. వాస్తవానికి ఈసీకి ఓ యాప్‌ ఉంది. ప్రతి నియోజక వర్గంలోనూ ఎంతమేర పోలింగ్‌ జరిగిందో ఎప్పటికప్పుడు ఈ యాప్‌ ద్వారా సమాచారం అందుతుంది. అయినప్పటికీ ఓటింగ్‌ వివరాలు అందించడంలో ఎందుకింత జాప్యం జరిగిందో తెలియడం లేదు.

Spread the love