ముగిసిన రెండో దశ

The second phase is over– 13 రాష్ట్రాలు, యూటీలలో పూర్తైన పోలింగ్‌
– 64 శాతానికి పైగా ఓటింగ్‌
– యూపీలో ఓటింగ్‌ శాతం తగ్గింది.. త్రిపురలో మళ్లీ పెరిగింది
– త్రిపురలో ఓటింగ్‌బహిష్కరించిన ఓ గ్రామప్రజలు
– కేరళలో వడదెబ్బకు నలుగురు ఓటర్లు మృతి
– ఈవీఎంలలో రాహుల్‌ సహా పలువురి నేతల భవితవ్యం
– జూన్‌ 4న తుది ఫలితాలు
న్యూఢిల్లీ : భారత్‌లో రెండో దఫా లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం పూర్తయ్యాయి. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం(యూటీలు)లోని 88 లోక్‌సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 64 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. త్రిపురలో గరిష్టంగా 76.23 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే తుది ఫలితాలు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. యూపీలో ఓటింగ్‌ శాతం తగ్గగా..త్రిపురలో మళ్లీ పోలింగ్‌ శాతం పెరిగింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కనిష్టంగా 52.64 శాతం నమోదైంది. ఎన్నికల కమిషన్‌ సమాచారం ప్రకారం, అసోంలో 70.66 శాతం పోలింగ్‌ నమోదు కాగా, బీహార్‌లో 53.05 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 72.13 శాతం, జమ్మూకాశ్మీర్‌లో 67.22 శాతం, కర్నాటకలో 63.90 శాతం, కేరళలో 63.97 శాతం, మధ్యప్రదేశ్‌లో 54.42 శాతం, మహారాష్ట్రలో 53.51, మణిపూర్‌లో 76.06 శాతం, పశ్చిమబెంగాల్‌లో 71.84 శాతం పోలింగ్‌ నమోదైంది.
త్రిపురలోని ఓ గ్రామస్తులు రోడ్ల నిర్మాణం చేయకపోవటంతో..పోలింగ్‌ను బహిష్కరించారు. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్నాటకలో ఎండ దెబ్బకు ఓటర్లు అవస్థలు పడ్డారు. కేరళలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి.. నలుగురు ఓటర్లు కన్నుమూశారు. ఓటింగ్‌ సరళిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈవీఎంలలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ సహా పలువురు కీలక నాయకుల భవితవ్యం నిక్షిప్తమైంది. తుది ఫలితాలు జూన్‌ 4న విడుదల కానున్నాయి. ఎన్నికల అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్‌ మిషన్‌లను భద్రపరిచారు. 88 స్థానాల్లో దాదాపు 1202 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాహుల్‌ గాంధీ, శశి థరూర్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ నాయకురాలు హేమ మాలిని వంటి నేతలు ఉన్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై కేసు
రెండో దశ ఎన్నికలు చక్కగా ముగిశాయనీ, ఎన్డీయేకు వస్తున్న మద్దతు ప్రతిపక్షాన్ని మరింతగా నిరాశకు గురి చేస్తుందని మోడీ అన్నారు. ఓటర్లు ఎన్డీయే గుడ్‌ గవర్నెన్స్‌ను కోరుకుంటున్నారని ఆయన ట్వీట్‌ చేశారు. యువత, మహిళలు బలమైన ఎన్డీయేకు శక్తినిస్తున్నారని వివరించారు. మతం ఆధారంగా ఓట్లు అడిగాడన్న ఆరోపణలపై బీజేపీ బెంగళూరు సౌత్‌ అభ్యర్థి, ఆ పార్టీ బీజేవైఎం జాతీయాధ్యక్షుడు తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. ఓటర్లను అభ్యర్థిస్తూ సోషల్‌ మీడియాలో ఆయన ఒక వీడియోను పోస్ట్‌ చేశాడని ఈసీ వెల్లడించింది.

Spread the love