అంతరిక్షంలో అణ్వాయుధాలపై రగడ

The fight against nuclear weapons in space– ఐరాసలో అమెరికా, దాని మిత్రదేశాలు తీర్మానం
– వీటో చేసిన రష్యా , ఓటింగ్‌కు దూరంగా చైనా
– అమెరికా మోసపూరిత వైఖరిని ఎండగట్టిన రష్యా
న్యూయార్క్‌: అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపును నిషేధిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ బుధవారం రాత్రి ప్రవేశపెట్టిన వివాదాస్పద తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. ఓటింగ్‌కు చైనా దూరంగా ఉంది. ఈ తీర్మానానికి అనుకూలంగా భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలకు గాను 13 దేశాలు ఓటు వేశాయి. ఒక్క అణ్వాయుధాలనే ఎందుకు, అన్ని రకాల ఆయుధాలపైన నిషేధం ఎందుకు విధించకూడదని రష్యా ప్రశ్నిస్తే అటు నుంచి సమాధానం లేదు. ఇందుకు సంబంధించి రష్యా ప్రతిపాదించిన సవరణను భద్రతా మండలిలో అమెరికాతో సహా ఏడు దేశాలు వ్యతిరేకించాయి. ఒక దేశం గైర్హాజరైంది. దీంతో ఆ సవరణ వీగిపోయింది. మామాలూగా ఏదైనా సవరణ ఆమోదం పొందాలంటే భద్రతా మండలిలో తొమ్మిది దేశాలు ఆమోదం అవసరం. ఈ స్థితిలో రష్యా ఆ తీర్మానాన్ని వీటో చేసింది. అమెరికా, దాని మిత్ర దేశాలు ముందుకు తెచ్చిన ఈ తీర్మానం ‘ అణ్వాయుధాలు తయారు చేయడం గానీ, అంతరిక్షంలో వాటిని మోహరించడం గానీ ఏ దేశమూ చేయరాదు.” అని పేర్కొంటోంది.
అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డు ఈ సందర్భంగా 1967 అంతర్జాతీయ ఒప్పందాన్ని గుర్తు చేశారు. ఈ ఒప్పందంలో అమెరికా, రష్యా రెండూ భాగస్వాములుగా ఉన్నాయని అన్నారు. అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశమేదీ తన ప్రభుత్వానికి లేదని వీటో అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రకటనను ఆమె ఉదహరిస్తూ, మీరు రూల్స్‌ పాటించేవారే అయితే ఈ తీర్మానాన్ని ఎందుకు సమర్ధించరు? మీరు ఏదో దాస్తున్నారు. అయోమయం సృష్టిస్తున్నారు. ఇది సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. పుతిన్‌ యాంటీ శాటిలైట్‌ ఆయుధ సామర్థ్యాన్ని పుతిన్‌ కలిగి ఉన్నాడని, అయితే అది ఇంతవరకు ఆపరేట్‌ చేయలేదని ఫిబ్రవరిలో వైట్‌ హౌస్‌ పేర్కొన్న విషయాన్ని లిండా థామస్‌ గుర్తు చేశారు. ఐరాసలో రష్యా రాయబారి వాసిలీ నెంబంజియన్‌ స్పందిస్తూ అమెరికా తీసుకొచ్చిన తీర్మానం మురికి ఉద్దేశంతోను, రాజకీయంతోనూ కూడినదని విమర్శించారు. అంతరిక్షంలో అన్ని రకాల ఆయుధాలను నిషేధించాలని అమెరికా ఎందుకు కోరడం లేదు అని ఆయన ప్రశ్నించారు. మీరు అడిగిన ప్రశ్నే మీకు తిరిగి వేస్తున్నాను అని ఆయన అన్నారు. ఈ తీర్మానం తేవడం వెనుక అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ ఉద్దేశాలేమిటో స్పష్టమవుతూనే ఉ,న్నాయని రష్యా ప్రతినిధి అన్నారు. అంతరిక్షంలో ఏ రకమైన ఆయుధాలు మోహరించకుండా చూసేలా ఒక ఒప్పందం తేవడం కోసం రష్యా, చైనా చేస్తున్న యత్నాలను 2008 నుంచి అమెరికా అడ్డుకుంటూ వస్తోందని నెబంజియన్‌ ఆరోపించారు.

Spread the love