వడగాడ్పులు తీవ్రం

Filters are intense– ఉక్కపోతతో కూలీల ఉక్కిరి బిక్కిరి
– ఉపాధి పనుల్లో కానరాని వసతులు

– గతంలో పంపిణీ చేసిన టెంట్లు మాయం!
– తాగునీటి వసతి లేక కూలీల అవస్థలు
నవతెలంగాణ-గూడూరు/మల్హర్‌రావు
భానుడి ప్రతాపానికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండలు మండుతుండటంతో బయట అడుగు పెట్టలేక పోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే మాడిపోతున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ మాసంలోనే ఎండ తీవ్రత 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మరోవైపు వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఉపాధి పని ప్రదేశాల్లో కనీస వసతుల్లేక కూలీలు బేజారవుతున్నారు. వడదెబ్బకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండంలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో ఎండకు తట్టుకోలేక ఉదయం ఐదు గంటలకే ఏమైనా పనులు ఉంటే చేసుకుని వస్తున్నారు. 11 గంటల వరకు ఇండ్లకు చేరుతున్నారు. మళ్లీ సాయంకాలం తర్వాత బయటకు వెళ్తున్నారు. ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక ఇండ్లల్లో ఉక్కపోతకు ఉండలేక.. గ్రామాల్లో చెట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించింది. తీగలవేణి, అయోధ్యపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు ఎండదెబ్బ నివారణకు పలు సూచనలు అందిస్తోంది.
ఉపాధి ప్రదేశాల్లో కనిపించని వసతులు
భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలో 15 గ్రామపంచాయతీలు ఉండగా, 8,736 జాబ్‌ కార్డులు.. 20,701 నమోదు చేసుకోగా.. 2,982 మంది పనులకు హాజరవుతున్నారు. ఉపాధి హామీలో పనిచేసే కూలీలు ఎండలకు అలసిపోతే కాసేపు సేద తీరేందుకు, భోజన సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం గతంలో టెంట్‌లను సరఫరా చేసింది. వాటిని ఫీల్డ్‌ అసిస్టెంట్లు పని చేసే ప్రాంతాల్లో నీడ కోసం వేసేవారు. అయితే గత ప్రభుత్వం 2020 మార్చి 20న ఫీిల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించి 2021 ఆగస్టులో మళ్లీ విధుల్లోకి తీసుకుంది. కానీ, గతంలో వారికి అందజేసిన టెంట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. సంబంధించిన అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడంతో ఉపాధి పని ప్రదేశాల్లో కూలీలు నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, పనిచేసే చోట కూలీలు గాయపడితే వారికి ప్రథమ చికిత్స సంధించేలా మెడికల్‌ కిట్లు సైతం అందించారు. 2016 వరకు వీటిని అందించిన ప్రభుత్వం ఆ తరువాత విస్మరించింది. తాగునీటి సదుపాయం కూడా లేక కూలీలే ఇండ్ల నుంచి తీసుకెళ్తున్నారు.
పత్తాలేని పరికరాలు..
ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు అవసరమైన పరికరాలను గతంలో ప్రభుత్వమే సరఫరా చేసేది. గడ్డపారలు, పారలు, ఇనుప తట్టలు, చెట్లను నరికివేసేందుకు గొడ్డళ్లు, కొడవళ్లు అందించేది. క్రమంగా వాటి సరఫరా సైతం నిలిపివేసింది. దీంతో కూలీలు వాటిని సొంతగా కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన దుస్థితి. తాగునీటి కోసం కూలీలకు గతంలో రూ.5 చెల్లించేవారు. అలాగే ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల్లో పనిచేసే కూలీలకు 20 శాతం అదనపు వేసవి భత్యం చెల్లించేవారు. కేంద్రం కూలీలకు అందాల్సిన ఈ రెండు ప్రయోజనాలను నిలిపివేసింది. పరికరాల మాట అటుంచితే కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో పనులకు హాజరయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
ఎండ తీవ్రత తట్టుకోలేకపోతున్నా
భూసాని శంకర్‌, పండ్ల వ్యాపారి, మహబూబాబాద్‌
ఎండ తీవ్రత తట్టుకోలేకపోతున్నాం. పొట్టకూటికోసం ఎండను కూడా లెక్క చేయకుండా పండ్ల వ్యాపారం చేస్తున్నాం. పండ్లు సాయంకాలానికే పాడవుతున్నాయి. వేడి తీవ్రత వల్ల ప్రజలు సాయంకాలమే సంతకు వస్తున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతలో ఉండాలంటే వడగాల్పులకు తట్టుకోలేకపోతున్నాం.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
యమున, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, అయోధ్యపురం, మహబూబాబాద్‌
ఏప్రిల్‌, మేలో తీవ్ర ఎండలు ఉంటాయి. ప్రజలు జాగ్రత్తలు వహించాలి. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. ఉదయం నుంచి 10 గంటలలోపే బయట పనులు చూసుకుని రావాలి. మళ్లీ ఏమైనా పనులుంటే సాయంకాలం చేసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తలపాగ ధరించాలి. వీలైతే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వెంట తీసుకెళ్లాలి. ఎండ దెబ్బకు గురైనట్లయితే వెంటనే స్థానిక వైద్య సిబ్బందిని సంప్రదించాలి
కనీస సౌకర్యాలు లేవు
పోచంపల్లి ఐలక్క, ఉపాధి కూలీ (మల్హర్‌రావు మండలం)
పని ప్రదేశంలో నీళ్లు, నీడ, మెడికల్‌ కిట్లు తదితర సౌకర్యాలు అధికారులు కల్పించడం లేదు. అసలే ఎండలు మండుతున్నాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎండకు తట్టుకోలేకపోతున్నాం. చాలా మంది పనికి రావడానికి ముందుకు రావడం లేదు.
ఉపాధి హామీపై నిర్లక్ష్యం
అక్కల బాపుయాదవ్‌, ప్రజాసంఘాల నాయకుడు, మల్హర్‌రావు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కూలీలకు వేసవి భత్యం, పరికరాలు అందించడం, పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యాయి. నిబంధనల పేరిట కూలీలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. రెండు మూడు వారాలుగా కూలీల వేతనాలు అందడం లేదు. రోజుకు కనీసం కూలి రూ.400 ఇవ్వాలి.

Spread the love