నమ్మక ద్రోహి కడియం శ్రీహరి..

Kadiam Srihari, traitor of trust..– తన పదవికి రాజీనామా చేయాలి
– బ్లాక్‌ మెయిల్‌ చేసి పదవులు పొందుతారు
– దళిత నాయకులను ఎదగనీయని కుట్రదారు : బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు దాస్యం, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-హన్మకొండ/ధర్మసాగర్‌
కుట్రలు, కుతంత్రాలు చేసి అధిష్టానానికి తప్పుడు సమాచారం అందిస్తూ నీచమైన రాజకీయాలు చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని, కనీస నైతికత, వయస్సుపై గౌరవం ఉంటే ముందుగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత ఏ పార్టీలోనైనా చేరాలని కడియం శ్రీహరికి బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినరు భాస్కర్‌, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్‌ఎస్‌ వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కూతురు కడియం కావ్య బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి తదితర నాయకులతో హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా వినరుభాస్కర్‌ మాట్లాడుతూ.. గతంలో టీడీపీలో పనిచేసినపుడు ఆ పార్టీ నేత చంద్రబాబును బ్లాక్‌ మెయిల్‌ చేసి అనేక పదవులు అనుభవించారని గుర్తుచేశారు. ఎదుగుతున్న దళిత నాయకులపై కుట్రలు చేసి, చాడీలు చెప్పిన నీచమైన చరిత్ర శ్రీహరిదంటూ విమర్శించారు. గత అహంకార పూరిత చర్యలు మరిచి తెలంగాణ కోసం తాను, కేటీఆర్‌, పెద్ది నిస్వార్ధంతో పార్టీలోకి ఆహ్వనించామన్నారు. బీఆర్‌ఎస్‌లోకి రాగానే నీ స్వార్ధానికి విజయరామారావు, రాగమళ్ళ పరమేశ్వర్‌, దొమ్మాటి సాంబయ్య, పసునూరి దయాకర్‌, అరూరి రమేష్‌.. తదితరులు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావ్య అభ్యర్ధిత్వాన్ని అనేక మంది ఉద్యమకారులు, దళిత సంఘాలు వ్యతిరేకించినా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని కానీ, రాత్రికి రాత్రే కాంగ్రెస్‌ పార్టీతో ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసుకుని నువ్వూ, నీ బిడ్డ ఓ లేఖను విడుదల చేయడం సిగ్గుచేటన్నారు.
పదవులన్నీ అనుభవించిన కడియం : పెద్ది
పార్జీలోకి వచ్చిన కొద్ది కాలానికే ఎన్ని పదవులు ఉంటే అన్నింటిని అనుభవించిన చరిత్ర కడియం శ్రీహరిదంటూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా శ్రీహరి రాజకీయ విలువలు, నిజాయితీ అంటూ నీతులు చెప్పడం మానుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీగా ఉంటూ స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజకీయం చేస్తే అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని శ్రీహరికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. తాజాగా నీ బిడ్డకు ఎంపీ టికెట్‌ సైతం ఇచ్చారని చెప్పారు. కడియం లాంటి వ్యక్తుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, మీడియా సమావేశానికి హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. కడియం శ్రీహరి ఘటనపై ముందుగా ఆయనే మాట్లాడుతారని అందరూ భావించారు. కానీ ఆయన మీడియా సమావేశంలో ముభావంగా, నిశ్శబ్దంగా ఉండి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. దాంతో కడియం శ్రీహరి తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్ళే వంతు ఎర్రబెల్లిదే అని అక్కడ గుసగుసలు వినిపించాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్‌, హనుమకొండ జడ్పీ చైర్‌పర్సన్‌ సుధీర్‌ కుమార్‌, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, సుదందర్‌ రాజు యాదవ్‌, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు తగిన బుద్ధి చెబుతారు : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి
బీఆర్‌ఎస్‌ పార్టీకి, మాజీ సీఎం కేసీఆర్‌కు ద్రోహం చేసిన కడియం శ్రీహరికి, ఆయన కుమార్తె కడియం కావ్యకు బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. ధర్మసాగర్‌ మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన పదవి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా అత్యున్నతమైన స్థానాలు ఇచ్చి కడియం శ్రీహరిని ఆదుకున్నారని గుర్తు చేశారు. కానీ నేడు తన కుటుంబ స్వలాభం కోసం కాంగ్రెస్‌లో చేరడం దారుణమన్నారు. తన స్వార్థం కోసం మాదిగ సామాజిక తరగతికి చెందిన స్థానిక నాయకులైన తాటికొండ రాజయ్య, ఎంపీ పసునూరి దయాకర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను తన కుట్రపూరితమైన ఆలోచనలతో పార్టీకి దూరం చేసిన ద్రోహి కడియం శ్రీహరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కో-ఆప్షన్‌ సభ్యులు జుబేదా లాల్‌ మహమ్మద్‌, వేలేరు జెడ్పీటీసీ చాడ సరితారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మునిగేల రాజు, ఎంపీటీసీ బొడ్డు శోభ, కర్ర సోమిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love