కాజీపేట రైల్వే లోకో డిపో నిర్వీర్యం

Kazipet railway loco depot decommissioned– మూడు లింకుల తరలింపు
– కార్మికుల అభ్యంతరాలతో తాత్కాలిక నిలుపుదల
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
కాజీపేట రైల్వే జంక్షన్‌లోని క్రూ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)ను నిర్వీర్యం చేయడానికి రైల్వే ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుండే కాజీపేట జంక్షన్‌లోని సీసీసీ నుంచి మూడు రైల్వే లింకులను సికింద్రాబాద్‌కు తరలించారు. మరో మూడింటినీ తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. దాంతో స్పందించిన లోకోపైలట్లు, రైల్వే సంఘాలు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. రైల్వే ఉన్నతాధికారులతో చర్చించిన నేపథ్యంలో తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. మంగళవారం సికింద్రాబాద్‌లో రైల్వే సంఘాల ప్రతినిధులతో రైల్వే ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కాజీపేట రైల్వే జంక్షన్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే కూడలి కాజీపేట రైల్వే జంక్షన్‌ కావడం గమనార్హం. దాంతో కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని నెలకొల్పాలని, రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ దశాబ్ధాలుగా ఉంది. గతంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన దాన్ని పంజాబ్‌కు తరలించి అన్యాయం చేశారు. అనంతరం పలు యూనిట్‌లను కాజీపేటకు ప్రకటించినా ఏర్పాటు చేయలేదు. తాజాగా స్థానికంగా ఉన్న యూనిట్‌లను సైతం ఇతర ప్రాంతాలకు తరలించి కాజీపేట జంక్షన్‌ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చేలా రైల్వే అధికారులు కుట్రలు చేయడం నిత్యకృత్యమైంది. ఈ క్రమంలోనే తాజాగా క్రూ లింక్‌లను సికింద్రాబాద్‌కు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతో లోకోపైలట్లు, రైల్వే యూనియన్‌ ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులను నిలదీశారు.
మసకబారుతున్న కాజీపేట జంక్షన్‌
కాజీపేట జంక్షన్‌ నుంచి 6 రైళ్ల లింకులు మణుగూరు-కాజీపేట, కాజీపేట-మణుగూరుకు వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్‌, కాజీపేట-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, కాగజ్‌నగర్‌-కాజీపేట కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, బల్లార్షా-కాజీపేట, కాజీపేట-బల్లార్షా భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రూట్ల లింక్‌ను సికింద్రాబాద్‌కు తరలించి అక్కడి నుంచి ఆపరేటింగ్‌ చేయాలని ఆదేశించారు. కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు తరలిస్తున్న క్రూ లింక్‌ల వల్ల తమపై పనిభారం పడుతుందని, రైల్వే శాఖకు లాభం ఉండదని లోకో పైలట్లు వాపోతున్నారు.
మరో డోర్నకల్‌గా కాజీపేట..
డోర్నకల్‌ జంక్షన్‌, బెల్లంపల్లిలోని రైల్వే లోకో పైలట్లు డిపోను దఫాలవారీగా ఈవిధంగానే గతంలో తరలించడంతో లోకోపైలెట్ల డిపోలను నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలోనే కాజీపేట జంక్షన్‌లోనూ ఉన్నతాధికారులు వ్యవహరించడంపై లోకో పైలట్లు మండిపడుతున్నారు. గతంలోనూ కాజీపేట జంక్షన్‌ నుంచి పలు క్రూలను విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో రైల్వే యూనియన్‌ నేతలు, ప్రజాప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో సికింద్రాబాద్‌ నుంచి పలు క్రూ లింక్‌లను కాజీపేటకు కేటాయించారు. తాజాగా రెండ్రోజుల క్రితం రైల్వే ఉన్నతాధికారులు మూడు క్రూ లింక్‌లను సికింద్రాబాద్‌కు తరలించి క్రమక్రమంగా ఇతర క్రూ లింక్‌లను కూడా తరలించడానికి రంగం సిద్ధం చేశారు. దీనిపై రైల్వే సంఘాల ప్రతినిధులు, లోకో పైలట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో తరలింపును తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు.. మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్‌లో రైల్వే సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దీనిపై పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Spread the love