ఓపెనర్లే ఉతికారేశారు

The openers washed out– ఛేదనలో హెడ్‌, అభిషేక్‌ ఊచకోత
– 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ గెలుపు
– లక్నో 165/4, హైదరాబాద్‌ 167/0
ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ ఉప్పెన. తొలుత బంతితో భువనేశ్వర్‌ కుమార్‌ (2/12) విజృంభించగా.. ఛేదనలో బ్యాట్‌తో ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (69 నాటౌట్‌) ఊచకోత ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9,4 ఓవర్లలోనే ఊదేసింది. మరో 62 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌ తొలుత 165/4 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్‌ 9.4 ఓవర్లలోనే 167/0 పరుగులు చేసింది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓ అడుగు ముందుకేసింది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో కీలక మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-3లోకి చేరుకుంది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఉతికారేసిన హైదరాబాద్‌ కీలక నెట్‌రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకుంది. సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89 నాటౌట్‌, 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (69 నాటౌట్‌, 27 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీలతో విశ్వరూపం చూపించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆయుశ్‌ బడోని (55 నాటౌట్‌, 30 బంతుల్లో 9 ఫోర్లు), నికోలస్‌ పూరన్‌ (48 నాటౌట్‌, 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (2/12) దెబ్బకు లక్నో సూపర్‌జెయింట్స్‌ 13 ఓవర్లలో 73/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకోగా.. చివరి ఏడు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 92 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏడో విజయం కాగా.. లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఇది ఆరో పరాజయం.
ఓపెనర్లే ఊదేశారు : లక్ష్యం 166 పరుగులు. సన్‌రైజర్స్‌కు విజయంతో పాటు నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవటం అవసరం. విధ్వంసం, ఊచకోతకు సరికొత్త నిర్వచనం చెప్పిన సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (75 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి రెండు ఓవర్లలో సాధారణంగా సాగిన ఇన్నింగ్స్‌.. మూడో ఓవర్‌ నుంచి మలుపు తిరిగింది. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన ఓవర్లో ట్రావిశ్‌ హెడ్‌ విరుచుకుపడ్డాడు. మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 22 పరుగులుపిండుకున్నాడు. ఆ తర్వాత రవి బిష్ణోరుకి అభిషేక్‌, హెడ్‌లు కలిసి పంచ్‌ ఇచ్చారు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 17 పరుగులు పిండుకున్నారు. ఇక నవీన్‌ ఉల్‌ హాక్‌కు ట్రావిశ్‌ హెడ్‌ చుక్కలు చూపించాడు. అతడు వేసిన ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఏకంగా 23 పరుగులు సాధించాడు. ట్రావిశ్‌ హెడ్‌ ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 16 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఇందులో బౌండరీలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇక అభిషేక్‌ శర్మ సైతం ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 19 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. పవర్‌ప్లేలోనే 107 పరుగులు సాధించిన సన్‌రైజర్స్‌ ఏకపక్ష విజయం లాంఛనం చేసుకుంది. 9.4 ఓవర్లలో 167 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Spread the love