మత్తులో 2.92 కోట్లమంది

మత్తులో 2.92 కోట్లమంది– 10 ఏండ్లు.. 20 శాతం పెరిగిన వ్యవనపరులు
– భయపెడుతోన్న మాదకద్రవ్యాల వినియోగం : ఐక్యరాజ్యసమితి రిపోర్టు
న్యూఢిల్లీ : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మత్తులో మునిగి తేలుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిషేధిత పదార్థమైన డ్రగ్స్‌ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఓ వైపు మానవ సమాజ బలహీనతల్ని ఆసరాగా చేసుకుని భారీ స్థాయిలో అక్రమంగా విక్రయిస్తున్నా.. పాలకులు మాత్రం అరికట్టలేక పోతున్నారు. ఇప్పటివరకు మత్తులో సుమారు మూడు కోట్ల మంది మునిగితేలుతుంటే.. దశాబ కాలంలో 20 శాతం వ్యసనపరులు పెరిగారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.
గుల్లవుతున్న జీవితాలు..
డ్రగ్స్‌… దీనికి అనేక రూపాలు.. గంజాయి.. కొకెయిన్‌.. హెరాయిన్‌.. ఓపియాయిడ్స్‌.. ఇలా ఏ పేరుతో పిలిచినా వీటి పర్యావసనాలు మాత్రం జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. గతంలో పాన్‌మసాలాలు గుట్కాల వరకే పరిమితమైన ఈ మత్తు.. ఇపుడు హద్దులు దాటుతోంది. మాదకద్రవ్యాల నిరోధక శాఖాధికారులు డ్రగ్స్‌ సరఫరా చేసే అక్రమార్కులను పట్టుకోవటానికి ఎంత ప్రయత్నించినా, ఎన్ని సార్లు తనిఖీలు చేసినా సరఫరా మాత్రం ఆగటంలేదు. గుట్టుగా దందా కొనసాగుతోంది. యువత బలహీనతల్ని బానిసల్ని చేసుకుంటూ.. దేశ, ప్రపంచ భవిష్యత్‌ను అంధకారంలో పడేసే ఈ మత్తు పదార్థ వినియోగం గురించి ఐక్యరాజ్యసమితి డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ ఆఫీస్‌ (యూఎన్‌ఓడీసీ) వరల్డ్‌ డ్రగ్‌ రిపోర్ట్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికి 29.2 కోట్ల మంది మాదకద్రవ్యాల వినియోగదారులున్నారు. ఒక దశాబ్దంలో దాదాపు 20 శాతం పెరిగినట్టు వారు అంచనా వేశారు. వీటిలో కొత్త సింథటిక్‌ ఓపియాయిడ్లు ఆవిర్భవిస్తూనే ఉన్నాయని నివేదిక తెలిపింది. వీటి వల్ల ఆరోగ్యంతో పాటు సామాజిక, పర్యావరణాలపై ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని వెల్లడించింది. గతంలో 2.28 కోట్ల మంది గంజాయి అత్యధికులు వినియోగిస్తుండగా, తర్వాతి స్థానాల్లో ఓపియాయిడ్లు (6 కోట్లు), యాంఫేటమిన్లు (3 కోట్లు), కొకెయిన్‌ (2.3 కోట్ల మంది) ఉన్నాయి. డ్రగ్స్‌ ఉత్పత్తి, అక్రమ రవాణా వల్ల పౌరసమాజంతో పాటు.. పర్యావరణంపై కలిగే ప్రభావాన్ని కూడా ఈ నివేదిక నొక్కి చెబుతోంది. అందువల్ల భావితరాలపై పేరెంట్స్‌ కన్నేసి ఉంచటంతో పాటు.. మత్తు విక్రయదారులను గుర్తించితే.. సమాజంలో మాదకద్రవ్యాలను కొంతమేర అయినా అరికట్టవచ్చని ప్రజాసంఘాలు అంటున్నాయి.

Spread the love