ఉత్తర్‌ప్రదేశ్‌ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 87కి చేరిన మృతుల సంఖ్య

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాటలో జరిగింది. ఈ ఘటనలో దాదాపు 87 మంది మృత్యువాత పడ్డారు. రతిభాన్‌పుర్‌లో శివారాధన కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరగడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనలో 100మందికి పైగా గాయపడ్డారు. వారిలో మహిళలు చిన్నారులు సైతం అధికంగా ఉన్నారు. వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఈ దుర్ఘటనపై హాథ్రస్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ ఆశీష్‌ కుమార్‌ మాట్లాడుతూ..‘‘ జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం. 87 మంది వరకు మృతిచెందినట్టు వైద్యులు చెబుతున్నారు. ఇదో ప్రయివేటు కార్యక్రమం. సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ అనుమతి ఇచ్చారు. అధికారులే భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ, మిగతా ఏర్పాట్లను నిర్వాహకులే చేసుకున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలపైనే దృష్టిసారించాం’’ అని తెలిపారు. ఇటా జిల్లాకు చెందిన 27మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు ధ్రువీకరించారు.
‘‘ఇప్పటివరకు పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారు. గాయపడినవారికి చికిత్స అందుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయి’’ అని ఇటా చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ ఉమేశ్‌ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.

Spread the love