పెండ్లికొడుకుని చెట్టుకు కట్టేసి చితక్కొట్టి..!

నవతెలంగాణ – ఉత్తర్​ప్రదేశ్​
కట్నం అడిగినందుకు వరుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు వధువు బంధువులు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ప్రతాప్​గఢ్​ జిల్లా మాంధాత పోలీస్​ స్టేషన్​ పరిధిలోని హరఖ్​పుర్​ గ్రామానికి చెందిన రామ్​కిషోర్​ కుమార్తెకు, జౌన్​పుర్​కు చెందిన​ ఓ యువకుడికి పెండ్లి నిశ్చయమైంది. బుధవారం రాత్రి జౌన్​పుర్​ నుంచి వరుడు ఊరేగింపుగా హరఖ్​​పుర్​కి చేరుకున్నాడు. అనంతరం వధూవరులిద్దరూ పూల దండలు వేసుకోడానికి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కారు. పూలదండలు మార్చుకోకముందే.. వరుడు కట్నం డిమాండ్​ చేశాడు. వరుడి తీరుపై వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పెండ్లికొడుకును ఎంత ఒప్పించినా మాట వినిపించుకోలేదు. కట్నం కోసం పట్టుబట్టాడు. వరుడి తీరుపై ఆగ్రహానికి గురైన వధువు బంధువులు వరుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరుడు కట్నం డిమాండ్​ చేశాడని వధువు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాలను పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

Spread the love