– కీలక శాఖలు సీఎం వద్దే
– పరమేశ్వరకు హోం
బెంగళూరు : కర్నాటక కేబినెట్‌లో శనివారం మరో 24 మంది మంత్రులుగా చేరారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చలు జరిపిన అనంతరం నూతన మంత్రుల పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. తాజా విస్తరణతో కర్నాటక కేబినెట్‌లో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరింది. నూతన మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. కేబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విడివిడిగా పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. వారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాతో కూడా సమాలోచనలు జరిపారు. కాగా సిద్ధరామయ్య కీలకమైన ఆర్థిక, కేబినెట్ వ్యవహారాలు, సిబ్బంది-పాలనా సంస్కరణలు, ఇంటెలిజెన్స్, సమాచార శాఖలను తన వద్దే ఉంచు కున్నారు. శివకుమార్‌కు నీటిపారుదల, బెంగళూరు అభివృద్ధి శాఖలు కేటాయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీ పరమేశ్వరకు హోం శాఖ, మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు ఇచ్చారు. నూతన మంత్రు లలో ఎక్కువమంది శివకుమార్ సన్నిహితులేనని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అన్ని సామాజిక వర్గాలకూ కేబినెట్‌లో స్థానం లభించిందని ఆ వర్గాలు వివరించాయి. రాష్ట్ర కేబినెట్‌లో 8 మంది లింగాయతులు, ఏడుగురు ఎస్సీలు, ఐదుగురు ఒక్కలిగులు, ఇద్దరు ముస్లింలు, ముగ్గురు ఎస్టీలు, ఆరుగురు ఓబీసీలు ఉన్నారు. నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో హెచ్‌కే పాటిల్, కృష్ణ బైరెగౌడ, ఎన్ చెలువరాయస్వామి, కే వెంకటేష్, హెచ్‌సీ మహదేవప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే, పీసీసీ మాజీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు ఉన్నారు.