కర్నాటకలో ముగిసిన ప్రచార పర్వం..

– 10న ఓటింగ్‌..13న ఫలితాలు
బెంగళూరు : పోటా పోటీ సమావేశాలు, సభలు, ర్యాలీలతో మార్మోగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడింది. ఎన్నికల హామీలు, పార్టీల మధ్య దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆద్యంతం ఆసక్తి రేపిన పార్టీల ప్రచారం ముగియడంతో కర్నాటక బోసిపోయింది. ముఖ్యంగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, జేడీ(ఎస్‌)లు ప్రచారాన్ని ఉధృతంగా సాగించాయి. తమ అభ్యర్థుల కోసం తీవ్రంగా శ్రమించాయి. కర్నాటకల షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో అధికారిక బీజేపీకి ఎదురుదెబ్బ తగలనున్నదనీ, కాంగ్రెస్‌కు ఫలితాలు ఆశాజనకంగా ఉండనున్నాయని పలు ప్రీపోల్‌ సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కర్నాటక ఎన్నికల్లో రూ.375 కోట్లకు పైగా సీజ్‌
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటక రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. గెలుపు కోసం కోట్లు ఖర్చు చేయడానికి సైతం వెనకాడటం లేదు. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులూ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నగార మోగిన తర్వాత మార్చి 29 నుంచి ఇప్పటి వరకు రూ. 375 కోట్లు పట్టుబడ్డాయి. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం.. రూ.375.6 కోట్లు సీజ్‌ చేశారు. ఇందులో నగదు రూ. 147 కోట్లుగా ఉన్నది. అలాగే, మద్యం, బంగారం మరియు వెండి రూ. 97 కోట్లు, ఉచితాలు రూ. 24 కోట్లు, డ్రగ్స్‌, నార్కొటిక్స్‌ రూ. 24 కోట్లుగా ఉన్నట్టు కర్నాటక ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. నగదు సీజ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 2,896 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు (మార్చి 9 నుంచి మార్చి 27 వరకు) మొత్తం రూ. 58 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Spread the love