పరిశోధన విద్యార్థులపై ఫీజుల మోత

– రీసెర్చ్‌ సెంటర్స్‌ కేటాయింపుపై తీవ్ర వ్యతిరేకత
– కష్టపడి తెచ్చుకున్న ఫెలోషిప్స్‌ ఫీజులుగా ఎందుకు చెల్లించాలంటున్న విద్యార్థులు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో భారీగా పెంచిన ఫీజులపై పీహెచ్‌డి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులకు వ్యతిరేకంగా వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేదాకా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాలుగు సంవత్సరాల నిరీక్షణ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫలితాలు విడుదలై, జాయిన్‌ అయిన తరువాత విద్యార్థుల ఆశలపై ఓయూ అధికారులు నీళ్లు చల్లారు. గతంలో కేవలం రూ.6,250 మాత్రమే ఉన్న పీహెచ్‌డి ఫీజు (ట్యూషన్‌ ఫీజు)ను 5 సంవత్సరాలకు కలిపి లక్షరూపాయలకు (రూ.1,00,000), మరికొన్ని కోర్సులకు లక్షా ఇరవై ఐదువేల రూపాయలకు (రూ. 1,25,000) పెంచారు. దాంతో పీహెచ్‌డీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలని ఉద్యమి స్తున్నారు. వారికి విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి. కొన్ని విభాగాల్లో పీహెచ్‌డీ అడ్మి షన్లు పొందిన విద్యార్థులకు హాస్టల్‌, మెస్‌ సౌక ర్యాలు కూడా ఇప్పటి వరకు యూనివర్సిటీ కల్పించలేదు. గతంలో అన్ని విభాగాల విద్యార్థులకు అడ్మిషన్‌, సూపర్‌ వైజర్‌ అలాట్మెంట్‌ ఓయూలోనే జరిగేది. నేడు దానికి భిన్నంగా ప్రయివేట్‌ రీసెర్చ్‌ సెంటర్స్‌కు అలాట్‌ చేశారు. ఆ సెంటర్స్‌లో అడ్మిషన్స్‌ పొందిన విద్యార్థులకు హాస్టల్‌, మెస్‌ సౌకర్యాలు కల్పించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన తాము పరిశోధన విద్యను ఎలా పూర్తి చేయగలమని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
ప్రయివేటు విద్యా సంస్థలాగా పెంచడం దారుణం సత్య నెల్లి, పొలిటికల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ స్కాలర్‌
దేశంలోని ఏ ప్రభుత్వ యూనివర్సిటీలో లేని విధంగా ప్రయివేటు విద్యా సంస్థ లాగా ఓయూలో 5 ఏండ్లకు మొత్తంగా లక్ష రూపాయల వరకు ఫీజును పెంచడం దారుణం. ముందు రీయింబర్స్‌ అవు తుంది.. విద్యా ర్థులకే అవగాహన లేదని అధికారులు అన్నారు. ఇప్పుడు అడిగితే రీయింబర్స్‌మెంట్‌ తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నా మంటున్నారు. ప్రయత్నాల దశలో ఉన్నప్పుడు విద్యార్థుల నుంచి డబ్బులు ఎలా వసూల్‌ చేస్తారు? ఫీజులు పెంచడం వల్ల కొంత మంది విద్యార్థులు అడ్మిషన్లు క్యాన్సల్‌ చేసుకున్నారు. దీని గురించి వివరణ కోరితే ’80 శాతం విద్యార్థులు ఫీజు చెల్లించారు. మిగతా 20 శాతం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది.? వాళ్ళు ఫీజు చెల్లించగలిగితే జాయిన్‌ అవుతారు లేకపోతే కారు’ అని అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఇది పేద వర్గాలకు దళిత వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర కాదా? నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజాస్వామ్య బద్దంగా మా నిరసనను తెలియ చేస్తూనే ఉంటాం.
ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది…
ఓయూలో ఒక్కో ప్రొఫెసర్‌కు ఎనిమిది మంది, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు ఆరు గురు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు నలుగురు విద్యార్థులను పరిశోధనకు కేటాయిస్తారు. ప్రొఫెసర్‌ల కొరత తీవ్రంగా ఉంది. రిక్రూట్‌ మెంట్‌ జరగక విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. దిక్కుతోచని స్థితిలో ప్రయివేటు రీసెర్చ్‌ సెంటర్‌లకు విద్యార్థులను వీసీ పంపిస్తున్నారు. అక్కడ రెక్టిఫైడ్‌ కానీ టీచర్ల వద్ద ఎలా పరిశోధనకు అనుమతిస్తారు. పీహెచ్‌డీ చదివే మా సెమినార్‌లను, పీహెచ్‌డీ విద్యార్హత లేని కొన్ని కళా శాలల ప్రిన్సి పాల్‌లు ఎలా పర్య వేక్షిస్తారు. తార డిగ్రీ కళా శాల సంగారెడ్డికి తెలుగు, బేగంపేట్‌ గౌట్‌ కళాశాలకు ఎకనామిక్స్‌, అరోరా డిగ్రీ కళాశాలకు కెమిస్ట్రీ కేటాయించారు. అక్కడ ఫీజులు మళ్ళీ కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.
– ఆజాద్‌, ఫిలాసఫీ రీసెర్చ్‌ స్కాలర్‌
సమిష్టి నిర్ణయం
పీహెచ్‌డీ ఫీజులు డీన్స్‌, స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం మేరకు పెంచాము. ఇది సమిష్టి నిర్ణయం. సైన్స్‌, ఇంజీనీరింగ్‌ విద్యార్థులకు సంవత్సరానికి రూ.25,000, ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌ విద్యార్థులకు సంవత్సరానికి రూ.20,000. ఆదాయం తక్కువ ఉన్న విద్యా ర్థులు స్కాలర్‌షిప్‌ దరఖాస్తు చేసుకోవాలి..
– ఓయూ రిజిస్ట్రార్‌, ప్రొ.పప్పుల.లక్ష్మీ నారాయణ
ఫీజుల గురించి ముందే చెప్పాల్సింది
మేము సెప్టెంబర్‌ 2022న ఓయూలో పరిశోధక విద్యార్థు లుగా అడ్మిట్‌ అయ్యాము. మాకు ఇచ్చిన జాయి నింగ్‌ ఆర్డర్‌లో 4 ఏండ్లకు రూ.4000 ఫీజుగా చూపించారు. మేము రూ. 1000 చెల్లించి అడ్మిట్‌ అయ్యాము. 9 నెలల తర్వాత ఇవ్వాళ యూనివర్సిటీ నిర్ణయంగా లక్ష రూపాయలు చెల్లించాలంటున్నారు. జాయినింగ్‌ ఆర్డ ర్‌ను కూడా వాళ్ళు గౌరవించరా. ఒకవేళ ముందే ఇంత ఫీజు అని చెప్పి ఉంటే మా నిర్ణయం వేరే విధంగా ఉండేదేమో.
– అఖిల్‌ బొడ్డుపల్లి, తెలుగు పరిశోధక విద్యార్థి
సౌకర్యాలను కల్పించాలి
పీహెచ్‌డీ విద్యార్థులకు మంచి సౌకర్యాలను అం దించవలసిన బాధ్యత ఓయూపై ఉంది. పరిశో ధన చేసే విద్యార్థికి హాస్టల్‌ వసతి లేదు. అడ్మిషన్‌ ఫీజు కట్టడానికి మూడు రోజుల వ్యవధి ఇచ్చారు. కానీ ఓయూలో జాయిన్‌ అయి 50 రోజులు అవుతున్నా తినడానికి తిండి లేక, పడుకోవడానికి చోటు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఓయూలో పరిశోధక విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించాలి.
– చేవెళ్ల యాదగిరి. పరిశోధక విద్యార్థి

Spread the love