ఎన్‌ఈపీకి కర్నాటక చెల్లుచీటీ ?

బెంగళూరు : కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) రద్దు చేయాలని కర్నాటక ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేకంగా విద్యా విధానాన్ని రూపొందించాలని భావిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకంగా విద్యా విధానాన్ని రూపొందిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ‘నాగపూర్‌ విద్యా విధానం’ తమకు అవసరం లేదని చెప్పారు. దీనిపై కూలంకషంగా చర్చిస్తామని తెలిపారు. నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం స్ఫూర్తితో కేంద్రం విద్యా విధానాన్ని రూపొందించిందని విమర్శించారు. పలు విద్యా సంస్థలు ఉన్న తనకే ఎన్‌ఈపీ అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో చర్చించానని, వారికి కూడా దాని సారాంశం బోధపడలేదని చెప్పారు. ఉన్నత విద్యలో ఎన్‌ఈపీని అమలు చేస్తామని దేశంలో తొలిసారిగా 2021లో కర్నాటక రాష్ట్రమే ప్రకటించింది. విద్యార్థుల ప్రయోజనాల కోసం బాగా ఆలోచించి ఈ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని అప్పటి బీజేపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కాగా రాష్ట్ర నూతన విద్యా విధానంలో కర్నాటక సంస్కృతి గురించి, ప్రముఖుల గురించి పాఠాలు చేరుస్తామని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్‌ఈపీని రద్దు చేయాలంటూ పలువురు మేధావులు, విద్యావేత్తలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. కన్నడ రచయితలు, మేధావుల సంఘం కూడా ఇదే విషయంపై ముఖ్యమంత్రికి లేఖ రాసింది. పాఠ్యపుస్తకాల సిలబస్‌లో బీజేపీ ప్రభుత్వం చేసిన మార్పులను పరిశీలించాలని, అవసరమైతే వాటిని తొలగించాలని డిమాండ్‌ చేసింది. కాగా ఎన్‌ఈపీ పేరిట విద్యా రంగాన్ని కలుషితం చేయడాన్ని తాము అనుమతించబోమని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఏం చేయాలన్న దానిపై సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Spread the love