గుజరాత్‌లో 25 మంది సజీవదహనం

గుజరాత్‌లో 25 మంది సజీవదహనం– గేమింగ్‌ జోన్‌లో చెలరేగిన మంటలు
– మృతుల్లో 12 మంది చిన్నారులు
రాజ్‌కోట్‌: వేసవి సెలవులు.. అందులో శనివారం వీకెండ్‌ కావటంతో తమ చిన్నారులకు ఆటవిడుపు కోసం తల్లిదండ్రులు శనివారం సాయంత్రం స్థానిక గేమింగ్‌జోన్‌కు తీసుకెళ్లారు. పిల్లలంతా సరదాగా ఆడుకుంటుండగా తల్లిదండ్రులు దూరంగా ఉండి చూస్తున్నారు.. ఇంతలోనే ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి కండ్లముందే చిన్నారుల అరుపులు, హాహాకారాలు.. అంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ ప్రాంతమంతా అరణ్య రోదనగా మారిపోయింది. పెద్దలు, చిన్నారులు సహా మొత్తం 25 మంది సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మతుల్లో 12 మంది చిన్నారులున్నారు. తమ బిడ్డలు బతికే ఉన్నారా..లేదా అని కనిపించిన వారిని అక్కడి వారు అడుగుతున్న తీరు కన్నీరును తెప్పించింది ఈ హృదయ విదారక సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో స్థానిక టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌లో చోటు చేసుకుంది.
ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున గాలి దుమారం వచ్చినప్పటికీ శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మతుల సంఖ్యను సరిగ్గా అంచనా వేయలేమని, మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ ఆర్‌ఏ జోబన్‌ తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మతదేహాలను వెలికి తీస్తున్నామని పేర్కొన్నారు. మరోపక్క ఈ ఘటనపై గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులంతా తక్షణమే ఘటనా స్థలికి చేరుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని రాజ్‌కోట్‌ పోలీస్‌ కమిషనర్‌ రాజు భార్గవ్‌ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Spread the love