31న.. ‘ఈటల’ ఇలాఖాలో ‘కేటీఆర్‌’.. పర్యటన

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ సీనియర్‌ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సొంత మండలం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఈనెల 31వ తేదీన రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. రూ.49 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సొంత మండలం కమలాపూర్‌లో మంత్రి కేటీఆర్‌ తొలిసారి పర్యటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ అభ్యర్థిగా హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ‘ఈటల’ సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం విధితమే. తాజాగా మంత్రి కేటీఆర్‌ పర్యటనలో రాజకీయ విమర్శలు తారాస్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదు.
హుజురాబాద్‌ నియోజకవర్గం ముందు నుండి బీఆర్‌ఎస్‌కు పెట్టని కోటగా ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలంగాణ ఉద్యమం నాటి నుండి కేసీఆర్‌కు వెన్నంటి ఉన్న అత్యంత సన్నిహితుడు. అలాంటిది కాలక్రమేణా విభేధాలు పొడిసూపి మంత్రి పదవికి ‘ఈటల’ రాజీనామా చేయాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఈ క్రమంలో పార్టీకి రాజీనామ చేయడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించి విజయం సాధించారు. మంత్రి పదవిని వీడిన అనంతరం సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ‘ఈటెల’ను ఓడించడానికి సీఎం ట్రబుల్‌ షూటర్‌, మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ రంగంలోకి దించినా ‘ఈటల’ విజయాన్ని ఆపలేకపోయారు. ముందు నుండి కూడా మంత్రి కేటీఆర్‌ హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నడూ పర్యటించలేదు. మొదటిసారి ఈనెల 31న హుజురాబాద్‌ నియోజకవర్గంలోని ‘ఈటెల’ సొంత మండలం కమలాపూర్‌లో పర్యటించడం రాజకీయ ప్రాధాన్యతను సందరించుకుంది. వచ్చే ఎన్నికల్లోనైనా ‘ఈటల’కు చెక్‌ పెట్టేలా బీఆర్‌ఎస్‌ నాయకత్వం మంత్రి కేటీఆర్‌ను రంగంలోకి దించిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అభివృద్ధి మంత్రం వచ్చే ఎన్నికల్లో ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జెల్లి శ్రీనివాస్‌ నియోజకవర్గంలో చురుకుగా లేకపోవడం గమనార్హం. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ‘ఈటల’పై పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌రెడ్డి ఉప ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం విధితమే. తాజాగా ‘పాడి’ నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషిస్తుండడం గమనార్హం.
శంకుస్థాపనలు… ప్రారంభోత్సవాలు
రూ.1.50 కోట్లతో జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, రూ.1.71కోట్లతో ఆర్టీసి బస్టాండ్‌, రూ.25 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాలు, రూ.25లక్షలతో అయ్యప్ప గుడి, రూ.30 లక్షలతో పెద్దమ్మ గుడి, రూ.50 లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటి హాలు, రూ.30 లక్షలతో మార్కండేయ గుడికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.69.85 లక్షలతో నిర్మించనున్న 10 కుల సంఘాల భవనాల సముదాయానికి రూ.19 కోట్లతో మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాల, రూ.20 కోట్లతో మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల, రూ. 2 కోట్లతో కస్తూర్భా పాఠశాల, రూ.2.50 కోట్లతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ భవనాలకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఏదేమైనా మంత్రి కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Spread the love