48 గంటల్లో 59 మంది మృతి మహారాష్ట్రలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణం

– ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం
ముంబయి : మహారాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లోన మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. గత 48 గంటల్లో రెండు ఆస్పత్రుల్లో మొత్తం 59 మరణాలు నమోదయ్యాయి. నాందేడ్‌లోని శంకర్‌రావ్‌ చవాన్‌ ఆస్పత్రిలో 35, ఔరంగాబాద్‌లోని ఘాటి ఆస్పత్రిలో 24 మంది మరణించారు. ఈ ఘటనలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. నాందేడ్‌, ఘాటి మరణాలను తీవ్రంగా పరిగణించారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మందుల కొరత, వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే నాందేడ్‌, ఘాటిలో మరణాలు జరిగాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ” దర్యాప్తు కమిటీ కనుగొన్న తర్వాత దోషులు శిక్షించబడతారు. మేము ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఔరంగాబాద్‌లోని నాందేడ్‌, ఘాటిలోని ఆస్పత్రులను సందర్శించి నివేదిక సమర్పించడానికి మంత్రి, కార్యదర్శి, అధికారుల బందాన్ని పంపాము”అని షిండే చెప్పారు. అయితే, మందుల కొరత, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లనే 16 మంది చిన్నారులు సహా 35 మంది మృతి చెందారని కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ ఆరోపించారు. ”మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉంది. తెలియని కారణాల వల్ల మందుల సరఫరా మరియు వైద్యుల నియామకం నిలిచిపోయి చాలా మంది ప్రాణాలను బలిగొన్నాయని మాకు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా నిర్ణయించి, వ్యవస్థను మెరుగుపరచాలి” అని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఔషధాల కొనుగోలుకు 40 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేయడంతో మందుల సరఫరా కాంట్రాక్టు నిలిచిపోయిందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే ఆరోపించారు. థానే మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని సివిక్‌ ఆస్పత్రిలో ఇంతకుముందు 17 మంది మరణించారనీ, అయితే అలాంటి విషాదాల నుంచి ఇప్పటివరకు గుణపాఠం నేర్చుకోలేదని ఆయన అన్నారు. ”రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అవినీతి వ్యాధితో బాధపడుతున్నది. మొత్తం వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో పాటు మందుల కొరత కూడా ఉన్నది. ఆస్పత్రుల్లో పరికరాలు పనిచేయక నిరుపయోగంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ఆరోగ్య సేవల పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంపై ఐపీసీ 302 కింద నేరపూరిత హత్య కేసు నమోదు చేయాలి” అని పటోల్‌ డిమాండ్‌ చేశారు. ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాకరే కూడా ట్రిపుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ప్రజారోగ్యం అందించడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love