9 నెలలు

ఆస్పత్రిలో వున్న తండ్రికింకా స్పృహ రాలేదు.
తొమ్మిదో తరగతి చదువుతున్న రాజేష్‌ బెడ్‌మీద పడుకున్న తండ్రిని కిటికీలోంచి కన్నార్పకుండా చూస్తూనే వున్నాడు. ఆ చూపులు నిర్వేదంగా వున్నాయి. చదువుతున్నది తొమ్మిదో తరగతైనా.. వాడి ఆలోచనలు సముద్రంలా ఘోషిస్తున్నాయి. వయసుకి మించిన పరిణితి చెందిన వాడి దృష్టికోణంలో.. తండ్రి కూడా అకస్మాత్తుగా అంతర్థానమవుతాడా..?? అన్నదే.
గత సంవత్సరం డిసెంబర్లోనే తాతయ్య చనిపోయాడు. ఈ ఏడాది మొదట్లో అంటే ఫిబ్రవరిలో నానమ్మ అదృశ్యమైపోయింది.
ఇద్దరూ ఒకేసారి మాయమైనట్టు… జాతరలో తప్పిపోయినట్టు… ఇప్పుడు చావు బతుకుల్లో… నాన్న…
చావు…
చావు…..
చావు…….
చావు తెలీకుండానే ఎందుకొస్తుంది..? చెప్పకుండానే ఎందుకు రావాలి..?? ముందే తెలిస్తే ఏమవుతుంది..? అది తప్పించుకునే యంత్రాలు ఏమైనా కనిపెడతాడని ఆ దేవుడు భయపడుతున్నాడా..? లేక మంత్రాలు ఏమైనా కాసి తప్పించుకుంటాడని దేవుడు భయపడుతున్నాడా..?
గుండెల్ని నులిపెట్టే బాధ.. ఎవరిమీదో తెలియని కోపం.. మాట మాటకీ దేవుడు గుర్తొస్తున్నాడు.
నాన్నకి యాక్సిడెంట్‌ అయిదంటే స్కూల్నించి ఇటే పరిగెత్తుకొచ్చాడు. తలకి బలంగా దెబ్బ తగిలింది. అమ్మ, తమ్ముడు తనకన్న ముందే హాస్పిటల్‌కి చేరుకున్నారు. అమ్మకి ఏడ్చి ఏడ్చి కళ్లు తడారిన ఎడారులయ్యాయి. ఆరేళ్ల చిట్టిచెల్లెలు అమ్మ కన్నీటి చెంపల్ని తుడుస్తోంది.
రాజేష్‌ కళ్లముందే పురుటినొప్పులు భరించలేక మెలికలు తిరుగుతూ ఏడుస్తున్న ఒకామెని స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి తీసు కెళ్తున్నారు.
రక్తంతో ఆమె చీర తడిసిపోయింది. పురుటినొప్పులు భరించలేక పిడికిళ్లు బిగపట్టి పెదాలు తెగిపోయేలా బాధని అణిచిపెట్టుకొని అరుస్తోంది. ‘ఈ సోయి అప్పుడు లేదా’ అని నవ్వుతూనే ఒక నర్సు చిన్నగా తొడ గిల్లింది. పావుగంట తర్వాత లేబర్‌ రూంలోంచి చిన్న పిల్లాడు ఏడ్చిన శబ్దం విన్పించింది.
పుట్టుక..
పుట్టుక…
పుట్టుక…..
రాజేష్‌ తన బ్యాగ్లోంచి కాగితం, పెన్ను తీసుకున్నాడు. ఏదో అక్షరాలు తనకే అర్థంకాని పదాలు పరిగెడుతున్నాయి. కోపం.. దు:ఖం… కలగలిపి వాక్యాలు సాగుతున్నాయి.
తెల్లని వస్త్రం మీద నల్లముత్యాలు ఆరబోసినట్లు…. నల్లటి మబ్బులు ఆకాశం మీద పారబోసినట్లు… ”దేవుడూ… నేనిది అజ్ఞానినై రాస్తున్నానో.. జ్ఞానిగా రాస్తున్నానో.. తెలివితో రాస్తున్నానో… తెలివితక్కువతనంతో రాస్తున్నానో.. నిస్పృహతో రాస్తున్నానో… స్పృహతోనే రాస్తున్నానో… అమాయకత్వంతో రాస్తున్నానో… అరాచకంగా రాస్తున్నానో.. మీ బ్రహ్మ వాక్యంతో నేను చెప్పే ఒక్కమాట మా తలరాతలో చేరుస్తారా..??
ఇంట్లోంచి కాలుదీసి బయటికి అడుగు పెట్టినవాడు సాయంత్రం వరకల్లా ఏమై తిరిగొస్తాడో తెలీని అభద్రత స్థితిలో మేం బతుకుతున్నాం. అర్థాంతరంగా మాయమైన వాడి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తాం.
వాడు రాడు… వాడి శవం వస్తుంది. లేదా వాడి శవపేటిక వస్తుంది.
పొద్దున్నే బుక్స్‌ తీసుకొని వెళ్లిపోయిన ఒక్క అక్క.. కాలిపోయిన కట్టెలా వస్తుంది. ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తారు.
అక్కయ్య రాదు… ఆమె శవం వస్తుంది. లేదా ఆమె శవపేటిక వస్తుంది.
గ్రౌండ్‌కి టెన్సిస్‌ ఆడుకునేందుకు పన్నెండేళ్ల పక్కింటి తమ్ముడు టెన్నిస్‌ బాల్లా ముక్కలు ముక్కలైనట్టు ఇంటికి వస్తాడు.
ఎదురింటి అంకుల్‌ మార్కెట్‌కి వెళ్లి అక్కడే కుప్పకూలిపోతాడు. భళ్లున పగిలిన గాజుముక్కల్లా ఆ కుటుంబం తల్లిడిల్లిపోతుంది. సంసారం నడిపే ఆ ఇంటిపెద్ద ఫ్రేములో బిగించబడి గోడకి చేరగిలబడతాడు. పూలదండ ఎండిపోయినాటికి… ఆ కుటుంబం చెల్లాచెదురవుతుంది. మరణం ఆకస్మాత్తుగా వస్తుంది. అనాథలా వస్తుంది.
దేవుడూ…
తొమ్మిది నెలల్లో పొత్తికడుపులో నెత్తుటి భీభత్సాన్ని సృష్టించే నువ్వు.. కనీసం చావులోనైనా మరణ సౌందర్యాన్ని సృష్టించివ్వు.
ప్రసవంలో విన్పించే అరుపులు.. హడావుడులు.. ఉద్రిక్తతలు.. ఉద్వేగాలు.. అన్నింటిలోనూ రక్తపు మడుగుతో మనిషిని బయటి ప్రపంచంలోకి విసిరేసిన నువ్వు… ఆ మనిషి మనుగడలో జీవితమనే సముద్రాన్ని ఈదుతున్నప్పటికీ.. చావు అనే ఆకస్మిక అంతర్థానాన్ని జననం లాగే.. తొమ్మిది నెలల ముందు.. ప్రకటిస్తే ఏమవుతుంది..??
నువ్వు సృష్టించి పంపుతున్న మనిషికి మరింత గుండె నిబ్బరాన్ని పెంచి పంపించు…
ఆట ప్రారంభాన్ని చూపిస్తావేగాని.. దాని ముగింపు గడువెంతో కూడా చూపించు… జన్మానికి తొమ్మిది నెలలు గడువిస్తున్నట్టే.. మరణానికి ముందు తొమ్మిది నెలలు గడువు…
తన అస్తిత్వాన్ని తాను ఆలోచన వేసుకుంటాడు. తన వ్యక్తిత్వాన్ని తనే బేరీజు వేసుకుంటాడు.
ఎందుకంటే, పేగు తెంపుకొని పుట్టిన బిడ్డలకు ప్రేమల్ని, ఆత్మీయతల్ని, అభిమానంతోపాటు.. ఆ మనిషి మనుగడ గెలుపు ఓటములు, సంబంధ బాంధవ్యాలెన్నింటినో వదిలి రావడానికి అతనికి నీ గడువుని ఏ రూపంగానైనా చెప్పు…..
అదే పుట్టుకలాగానే తొమ్మిది నెలల సమయమిచ్చి… ఆ తొమ్మిది నెలలు తన సాధించాల్సినవి ఏమున్నా, తప్పొప్పుల్ని బేరేజు వేసుకొని ఒక వేడుకలా.. ఒక పండగ వాతావరణాన్ని సృష్టించు కుంటాడు. తన జనన భీభత్సం తెలీకపోయినా.. మరణ సౌందర్యాన్ని కల్పించుకుంటాడు. తొమ్మిది నెలల్లో తన చావు తన్నుకొస్తుందంటే.. ఆ తొమ్మిది నెలల్లోనే తనంత తానే ఎలా మార్చుకుంటాడో, కుటుంబ సభ్యులు ఎలా మారుతారో కూడా నీ లీలావినోదంలో చూడొచ్చు.
చావు రోజులు దగ్గర పడుతున్నాయంటే.. మనిషి నిబ్బరమెంతో, నిగ్రహం ఎంతో కరోనాని చూసి నేర్చుకున్నాం కదా..
ప్రతీకారాలు, పగలు, అపోహలు, ఆత్మీయతలు, ఆరాటాలు, వివేకం, విచక్షణ, కన్నీళ్లు, దు:ఖం బేరీజు వేసుకునే గడువునివ్వు.
దేనికైనా తుది గడువుంటుంది. కానీ నువ్వు సృష్టించిన మనిషి మరణానికి మాత్రం ఏ గడువూ లేదు. మన మధ్య తిరుగుతున్న మనిషి ఆకస్మికంగా మాయమైపోతే… ఆ వేదన సుడులు తిరిగి కుటుంబాన్ని ఎంతటి అతలాకుతలం చేస్తుందో నువ్వు చూస్తున్నావ్‌ కదా…
అందుకే…
మనిషి మరణానికి ముందు తొమ్మిది నెలలు ఎక్స్‌పయిర్‌ తేదీనివ్వు. దాంతో పాటు.. బతికున్న వారికి కాసింత.. నిగ్రహాన్ని, నిబ్బరాన్ని ఇవ్వు….
మరణ సౌందర్యాన్ని మాకివ్వు…
తన ఉత్తరం అయిపోగానే.. తండ్రికి స్పృహ వచ్చింది.
రాజేష్‌ అడుగులో అడుగేసుకుంటూ తండ్రి సైగతో దగ్గరకు వచ్చాడు. వాడి తలని ప్రేమగా నిమిరాడు. వాడేదో రాసుకొచ్చాడని అతనికి అర్థమైంది. వాడు చిన్నతనంలోనే కవిత్వం రాస్తాడని తెలుసు.. ఆ కాగితమేంటని కళ్లతోనే ప్రశ్నించాడు.
”నాన్నా.. ఈ ఉత్తరానికి అడ్రస్‌ లేదు. ఎలా పంపాలో తెలీట్లేదు..”
”నేను తీసికెళ్తాన్రా.. నేను పోస్ట్‌మాన్నే కదా..” బాధతో కొడుకుతో అన్నాడు. ఆ మాటతో ఆ ఉత్తరాన్ని చప్పున వెనక్కి దాచుకున్నాడు.
తండ్రి నవ్వి ”ఏం రాసావ్‌ బిడ్డా..” అని అడిగాడు నొప్పితో కదులుతూ.
పక్కనే తల్లి, చెల్లి మౌనంగా ఏడుస్తున్నారు.
”నేను ఒకరికి ఒక ఉత్తరాన్ని రాసాను..” అన్నాడు.
”ఇవ్వరా.. ఏం రాసావ్‌..?” అని మళ్లీ అడిగాడు.
అతని పెదవుల మీద బలవంతంగా చిరునవ్వు తొణికిసలాడింది.
కొడుకుని దగ్గర తీసుకున్నాడు.
”నేను పోస్ట్‌ మాన్నే కదా.. చాలాసార్లు ఇలా అడ్రస్‌ లేని ఉత్తరాలొస్తాయి. అయినా నేను అడ్రస్‌ కనుక్కొని ఇచ్చేస్తాను తెల్సా.. నీ ఉత్తరం కూడా అలాగే ఇస్తాను. ఇవ్వు కన్నా….” అన్నాడు.
రాజేష్‌ తలపటాయిస్తూనే… వణుకుతున్న చేతుల్తో తండ్రి చేతుల్లో ఆ ఉత్తరాన్ని పెట్టాడు. తండ్రి కళ్లతోనే ఆ ఉత్తరాన్ని చదివాడు.
కన్నీళ్లు ఉబికి వచ్చాయి…
కొడుకుని ఆత్మీయంగా దగ్గర తీసున్నాడు.
”ఈ ఇంటి అడ్రస్‌కే వెళ్తున్నాను కదా… తప్పకుండా ఇస్తాను..” అన్నాడు తండ్రి.
తర్వాత.. అతడి చేయి వాలిపోయింది..!
ఉత్తరం కింద పడింది..!!
– కె. వి. నరేందర్‌. 9440402871

Spread the love