నవతెలంగాణ – హైదరాబాద్ : లైంగికదాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన బ్యారక్‌లో దొరికిన మొబైల్ ఫోన్‌లో భారీగా నీలి కంటెంట్ ఉన్నట్లు సమాచారం. బెంగళూరులోని అగ్రహార కేంద్ర కారాగారంలో సీసీబీ నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో ఈ ఫోన్ బయటపడింది. అందులో సుమారు 80 నుంచి 90 నీలి చిత్రాలు ఉన్నట్లు దర్యాప్తులో తెలిపారు. తక్కువ దుస్తుల్లో ఉన్న మహిళల ఫొటోలకు సంబంధించిన వార్తాపత్రిక కటింగ్స్ కూడా ఫోన్‌లో ఉన్నట్లు సమాచారం.
ఫోన్‌ను అధికారులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వీడియోలు ఎప్పుడు డౌన్‌లోడ్ అయ్యాయి? ఫోన్‌ను ఎవరు ఉపయోగించారు? అందులో మరిన్ని ఫైళ్లు ఉన్నాయా? అనే అంశాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించనున్నారు. సీసీబీ అధికారులు జైలులో నాలుగు నుంచి ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించారు. హైప్రొఫైల్ ఖైదీల బ్యారక్‌లతో పాటు హై సెక్యూరిటీ జైలులోనూ తనిఖీలు చేశారు. రేవణ్ణ బ్యారక్‌లో మొబైల్ ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్, ఛార్జర్ కూడా లభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఇతర నిషేధిత వస్తువులేవీ దొరకలేదని పేర్కొన్నారు.



