– ఇన్‌పుట్ సబ్సిడీ, ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించాలి
– రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి తొమ్మిదేండ్లయినా ఊసేత్తని కేంద్రం
– రాష్ట్రంలో రైతుబంధు ఇచ్చి.. మిగిలిన సౌకర్యాలను దూరం చేసిన వైనం
– వాస్తవ పరిస్థితుల ఆధారంగా రైతుల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలి : రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో అన్ని రకాల పంటలకు వాస్తవ పెట్టుబడి, రైతు కష్టానికి మిగలాల్సిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని వాస్తవిక ఎమ్‌ఎస్‌పీకి చట్టబద్ధత తీసుకురావాలని, ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించి ఇన్‌పుట్ సబ్సిడీని పెంచాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. ఇవేమీ చేయకుండా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్ర బీజేపీ సర్కారు తొమ్మిదేండ్లలో వ్యతిరేక చర్యలకే పూనుకుందని విమర్శించారు.
రాష్ట్రంలోనూ రైతుబంధు ఒక్కటే ఇచ్చి.. మిగిలిన రైతుల సౌకర్యాలను దూరం చేశారన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రాభవన్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ రైతుసంఘం రాష్ట్రస్థాయి శిక్షణా తరగతుల్లో బోధించేందుకు ఆదివారం నంద్యాల వచ్చారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని సాగురంగాన్ని ప్రయి వేటుపరం చేసేందుకు, వ్యవసాయ కాంట్రాక్టీకరణ తీసుకొచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. సుదీర్ఘపోరాటంతో మూడు చట్టాలను వెనక్కితీసుకునేలా రైతులు ఉద్యమించినా కేంద్ర సర్కారులో మాత్రం మార్పు రావడం లేదని ఆరోపించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులనే అమలు చేస్తామని చెప్పి.. సేంద్రియ వ్యవసాయం తీసుకొచ్చే పేరుతో ఎరువుల ధరలు పెంచుతూ.. సబ్సిడీకి కోత విధించిందన్నారు. వ్యవసాయాధారిత రంగాలను డెవలప్ చేయకుండా, పశుసంవర్థకశాఖను నిర్వీర్యం చేసి సేంద్రియ సాగు తీసుకురావాలని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు.
పైగా ఎఫ్‌సీఐ గోదాములు ప్రయివేటుపరం చేస్తున్న కేంద్రం సీసీఐకి ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించలేదని విమర్శించారు. ఈ చర్యలన్నీ చూస్తుంటే దేశంలో సాగురంగాన్ని పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకు పూనుకుంటున్న పరిస్థితికి అద్దం పడుతోందని, దేశవ్యాప్తంగా రూ.16కోట్ల రైతాంగ ఆదాయానికి గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ సర్కారు కూడా కేవలం రైతుబంధు మాత్రమే ఇచ్చి.. ఇదివరకు రైతులకు ఇచ్చిన సౌకర్యాలను ఎత్తేసిందన్నారు. ఇరిగేషన్‌ను డెవలప్ చేసి, వరి సాగు విస్తీర్ణాన్ని పెంచామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం వరి తప్ప మిగతా ఏ పంటలనూ ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో 10లక్షల టన్నుల కాయగూరలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని, కనీసం రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆ పంటల సాగును ప్రోత్సహించడం లేదన్నారు. ప్రకృతివైపరీత్యాలను గుర్తించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా రైతులను ముందుగా అలర్ట్ చేయని అసమర్థపాలన సాగిస్తున్నారని చెప్పారు.
పైగా ధనవంతులతో కలిసి పేదల ఆదాయాన్ని కలిపి లెక్కించి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.5లక్షలుగా ఉందని టెక్నికల్ అంశాలతో ప్రచారం చేసుకోవడం మానుకోవాలని, వాస్తవ పరిస్థితులను చూస్తే పేదవాని ఆదాయం రూ.10వేలు కూడా దాటదని చెప్పారు. ధరణిలో సన్న, చిన్నకారు రైతాంగానికి చెందిన 8లక్షల ఎకరాల భూసమస్యను పరిష్కరించి వారికి రైతు బంధు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 200 రైతుసంఘాలు ఐక్యంగా ఢిల్లీలో సమావేశమై ఉద్యమాలకు పిలుపునిచ్చారని, రాబోయే రోజుల్లో పోరుకు రైతాంగం సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మిల్కూరి వాసుదేవరెడ్డి, ఎమ్‌డీ గఫూర్ పాల్గొన్నారు