రైతుబంధా.. రాబంధుల పాలనా..? ఏది కావాలో ప్రజలు తేల్చుకోవాలి

Rythubandha..Rabandhu rule..? People should decide what they want– ఎల్లారెడ్డి సభలో మంత్రి కేటీఆర్‌
– వివిధ పార్టీల నాయకుల అరెస్ట్‌
–  ప్రజల కష్టాలు పట్టని బీజేపీ
నవతెలంగాణ-ఎల్లారెడ్డి
‘కాంగ్రెస్‌ వచ్చేది లేదు. వస్తే రాబంధుల రాజ్యమే.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే రైతుబంధు ప్రభు త్వం. రాబంధుల పాలన కావా లా, రైతుబంధు పాలన కావాలా’ అని మంత్రి కేటీఆర్‌ ప్రజలను ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలో ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం పర్యటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గంలో ఆర్చ్‌ను, సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభించారు. తాడ్వాయిలో స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్లారెడ్డిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ‘సాగుకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావాలా లేక 3 గంటలు ఇస్తా అన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కావాలా’ అని ప్రశ్నించారు. 50ఏండ్లలో అభివృద్ధి చేయని కాంగ్రెస్‌ ఇప్పుడు అభివృద్ధి చేస్తా అంటే ప్రజలు నమ్మరని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంట్‌ సరిగా ఉండేది కాదని, అప్పుడు పెన్షన్‌ రూ.200 ఉంటే బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.2016 చేశామని చెప్పారు. వికలాం గులకు అప్పుడు రూ.500 ఉంటే తాము రూ.4000 ఇస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కుంభకోణాల పార్టీ అని విమర్శించారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌లో ఇద్దరు పోటీ పడుతున్నారని, ఇప్పుడు మరో నాయకుడు కూడా వెళ్తున్నారని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు.
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ఖాతాలు తెలిపించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక హామీని నిలబెట్టుకోలేదు కానీ.. అధిక ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. ప్రజల కష్టాల గూర్చి బీజేపీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బ గడుపుకుంటోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ఎల్లారెడ్డిలో డిపాజిట్‌ కూడా రాదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సురేష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, జాజాల సురేందర్‌, రసమయి బాలకిషన్‌, జడ్పీ చైర్మెన్‌ శోభ, మాజీ మంత్రి నెరేళ్ళ ఆంజనేయులు, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, రాష్ట్ర గ్రంథలయ చైర్మెన్‌ శ్రీధర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు ముజీబొద్దిన్‌, ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మెన్‌ కుడుముల సత్యనారాయణ, ఎంసి చైర్మెన్‌ కాశినారాయణ, జడ్పీటీసీ ఉష గౌడ్‌, ఎంపీపీ మాధవి తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు స్వల్ప అస్వస్థత
జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా అస్వస్థతకు గురి కావడంతో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌లో విశ్రాంతి తీసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందస్తు అరెస్ట్‌
కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌తో పాటు నాయకులు రాజనర్సు, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణేశ్‌ నాయక్‌, మాలోత్‌ నౌసిల్లల్‌ నాయక్‌, కాంగ్రెస్‌ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. తాడ్వాయి నుంచి ఎల్లారెడ్డికి వెళ్తుండగా.. మంత్రి కాన్వారును కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు చెదరగొట్టారు.

Spread the love