డబ్బులు కొంచెం పెంచి..కొత్త పేర్లు పెట్టి…

Increase the money a little.. give new names...– పాత విషయాలనే కొత్తగా చెప్పిన కేసీఆర్‌
– మ్యానిఫెస్టోలో దీర్ఘకాలిక అంశాల జాడేది…?
– దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి అటకెక్కినట్టేనా..?
– ఎన్నికల ప్రణాళికపై సర్వత్రా పెదవి విరుపు
బి.వి.యన్‌.పద్మరాజు

తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో నిర్వహించిన ఎన్నికల్లో 61 సీట్లతో జయభేరీ.. ఆ తర్వాత 2018 ముందస్తు ఎలక్షన్లలో 88 స్థానాలతో విజయ భేరీ…అలా రెండు సార్లూ దూసుకుపోయిన ‘కారు’ జోరు ఈసారి ఎందుకో కాసింత తగ్గినట్టు కనబడుతున్నది. ఆ తగ్గుదల, జంకుడు ఆదివారం ఆ పార్టీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా గోచరిస్తోంది. మొదటి ఎన్నికల్లో ‘తెలంగాణ సాధించిన పార్టీ’ అనే నినాదం, రెండోసారి ‘కొత్త పథకాలు, కొత్త కార్యక్రమాల’ స్లోగన్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న గులాబీ దళానికి… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చెప్పుకోవటానికి ఏమీ లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాను గతంలో రూపొందించిన పథకాలు, కార్యక్రమాలకే కాస్త నిధులు పెంచి, కొంగొత్త పేర్లు పెట్టటమే చేశారని మ్యానిఫెస్టోలో స్పష్టంగా కనబడుతున్నది. కాంగ్రెస్‌ ఇటీవల ప్రకటించిన ‘ఆరు గ్యారెంటీ’ల ప్రభావం కూడా గులాబీ పార్టీపై బాగానే ఉంది. అందుకే హస్తం పార్టీ పేర్కొన్న హామీలు, ఆ పార్టీ ఇస్తామన్న ఆర్థిక సాయాలకే అదనంగా కొంత మొత్తాన్ని చేర్చి, కేసీఆర్‌ మ్యానిఫెస్టోను తయారు చేశారనే చర్చ కొనసాగుతున్నది.
ఈ విధంగా చూస్తే బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికను ‘కొత్త సీసాలో పాత సారా…’ అనలేం కానీ, అందులో గట్టిదనం, కొత్తదనం లేదనే మాట మాత్రం వాస్తవం. ముఖ్యంగా ఒక రాష్ట్రం, అక్కడి ప్రజలు బాగుపడాలంటే భూమి, ఉపాధి, ఉద్యోగాలు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన కీలకమనేవి మనందరికీ తెలిసిందే. ఇందులో అధికార పార్టీ దృష్టిలో విద్య అంటే కేవలం గురుకులాలే అన్నమాట. యూనివర్సిటీల్లో మెస్‌ ఛార్జీలు విడుదల కాకపోవటం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ నిధుల్లేక వెలవెలబోవటం సరేసరి. ఇక ప్రతీ జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేశామంటూ చెప్పుకునే బీఆర్‌ఎస్‌… గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ కునారిల్లుతోందనే వాస్తవాన్ని మాత్రం అంగీకరించపోవటం విస్మయకరం. భూమి విషయానికొస్తే… దళితులకు మూడెకరాల భూ పంపిణీ అనేది ఒక ప్రహసనంగా మారింది. 2014 ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా రాష్ట్రవ్యాప్తంగా 5,607 మందికి 14,282 ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. వీరు పోగా మిగతా భూమిలేని నిరుపేద దళితుల సంగతేమిటో..? గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అటకెక్కింది. దాని గురించి ఈసారి అసలు ఊసే లేకపోవటం గమనార్హం. ఉద్యోగాలు, ఉపాధి సంగతి గురించి చెప్పనక్కర్లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయటం, వాటిని రద్దు చేయటం లేదంటే వాయిదా వేయటం ప్రతీయేటా ఆనవాయితీగా మారింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న తీరును మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ప్రజలకు దీర్ఘకాలంలో ఉపయోగపడే అంశాలపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారించలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలతో…గులాబీ పార్టీ మ్యానిఫెస్టోను పోలుస్తూ పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుండటం గమనార్హం. హస్తం పార్టీ ఇచ్చిన గ్యారెంటీలకు కొంత డబ్బును పెంచి, వేరే పేర్లతో వాటిని బీఆర్‌ఎస్‌ ప్రకటించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love