
ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డను, మీ ప్రాంతవాడిని, మీ సమస్యలపై అవగాహన ఉన్నవాడిని, మీ బిడ్డగా ఒక్కసారి నన్ను సూర్యాపేట ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం చివ్వెంల మండలంలోని దురాజ్ పల్లి గ్రామంలో బీఆర్ఎస్, బిజెపి పార్టీ నుండి 150 కుటుంబాలకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గం నుండి మన ప్రాంతాన్ని పాలిస్తున్న నాయకులకు ఇక్కడి ప్రజలు బై బై చెప్పాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఉపాధి, ఇండ్లు, కాలువల ద్వారా వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా నీరు లభించాయని తెలిపారు. ఎమ్మెల్యే గా దామోదర్ రెడ్డి ఉన్నపుడు కాంగ్రెస్ హయాంలోనే సూర్యాపేట నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు, సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రస్తుతం బీ ఆర్ ఎస్ అవినీతి కుంభకోణంలో మునిగిపోయి ఉందని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమం వైపు ఉందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అన్ని మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు, బీ ఆర్ ఎస్ నాయకులకు మాత్రమే అందుతున్నాయని విమర్శించారు. రెండెకరాల భూమి ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి 5 వేల కోట్లు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్న మంత్రి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగడానికి సిగ్గు ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.