– స్క్రీనింగ్ కమిటీలో నేతల నిర్ణయం
– వామపక్షాల పొత్తు, అభ్యర్థుల ఎంపికపై చర్చ
– 26న సీఈసీ భేటీ…అదే రోజు తుది జాబితా విడుదల..!
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం కనిపిస్తోందని, అందువల్ల మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వొద్దని కాంగ్రెస్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 55 స్థానాలకు ఈనెల 15న విడుదల చేసిన మొదటి జాబితాలో సిట్టింగ్ లు, మాజీలు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, అయితే పార్టీ అధికారంలోకి రావాలంటే మిగిలిన 64 సీట్లు కూడా కీలకమని గుర్తించారు. ఈ నేపథ్యంలో రెండో జాబితా విడుదలయ్యే స్థానాలపై క్షేత్ర స్థాయి నుంచి పరిశీలించి ఫైనల్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆదివారం ఢిల్లీలోని రకాబ్ గంజ్ గురుద్వారా రోడ్ లోని కాంగ్రెస్ వార్ రూంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సభ్యులు జిగేశ్ మేవాని, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎన్నికల ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటిలో వామపక్షాలతో పొత్తు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక, మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై చర్చించారు. వామపక్షాలకు కేటాయించే స్థానాలతో కూడిన జాబితాను కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) కి పంపాలని నిర్ణయానికి వచ్చారు.
26న సీఈసీ భేటీ…
అభ్యర్థుల తుది జాబితా కోసం మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఆ రోజే వామపక్ష పార్టీలతో పొత్తుపై స్పష్టత, వారికి సీట్ల కేటాయింపు, మిగిలిన స్థానాలకు అభ్యర్థులతో జాబితాను రూపొందించనున్నారు. అనంతరం కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ)కి ఆ జాబితాను పంపనున్నారు. కాగా ఈ నెల 26న సీఈసీ భేటీ కానుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ భేటి తరువాత మిగిలిన స్థానాలకు సంబంధించిన జాబితా విడుదల కానుంది.
తెలంగాణ లో ప్రభుత్వం మారుతుంది
త్వరలో తెలంగాణలో ప్రభుత్వం మారనుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తో కలిసి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా దర్గాకు చాదర్ సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఒక లౌకికవాదిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతా లను నమ్మినవాడిగా దర్గాకు వచ్చానన్నారు. దేశంలోనే నిజాముద్దీన్ దర్గాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ఏది కోరుకుంటే అది జరుగుతుందని ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల్లో లౌకిక ప్రభుత్వాలు ఏర్పాటు కావాలని దర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా అందరికీ సంక్షేమం, అభివృద్ధి అందాలని కోరుకు న్నట్లు వెల్లడించారు. హిందువులు-ముస్లింలు కలిసి ఉంటూ మతసామరస్యాన్ని కాపాడే విధంగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. దేశ గొప్పతనాన్ని కాపాడే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశారని, ఈ దిశలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.