– ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది
– త్వరలో బయటకు వస్తా
– తరువాత పూర్తిస్థాయి మ్యానిఫెస్టో : టీడీపీ అధినేత చంద్రబాబు
– జైలు నుంచి ప్రజలకు బహిరంగ లేఖ
అమరావతి : ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు తనను దూరం చేశామనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. తాను ప్రస్తుతం ప్రజల మధ్యలో లేకపోవచ్చునని, అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా, సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి తన పేరే తలుస్తారని పేర్కొన్నారు. తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని తెలిపారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నానని, విధ్వంస పాలనను అంతం చేయాలనే ప్రజా సంకల్పంలో ఉన్నానని పేర్కొన్నారు. తెలుగు ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు రాసిన లేఖను ములాఖత్‌లో తన కుటుంబ సభ్యులకు అందించారు. ఈ లేఖను టిడిపి ఆదివారం ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది. ప్రజలే తన కుటుంబం అని చంద్రబాబు లేఖలో తెలిపారు. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏండ్ల ప్రజా జీవితం తన కండ్ల ముందు కదలాడుతోందని పేర్కొన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానమంతా సాగిందని తెలిపారు. దీనికి మీరే సాక్ష్యమని తెలిపారు. మీ నుంచి ఒక్క రోజు కాదు కదా ఒక్క క్షణం కూడా దూరం చేయలేరని పేర్కొన్నారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను నమ్మిన విలువలు, విశ్వసనీయతను ఎన్నడూ చెరిపేయలేరని తెలిపారు. ఈ చీకట్లు తాత్కాలికమేనని, సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయని పేర్కొన్నారు. సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవని, జైలు గోడలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని తెలిపారు. జైలు ఊచలు తనను ప్రజల నుంచి దూరం చేయలేవని పేర్కొన్నారు. తాను తప్పుడు చేయనని, చేయనివ్వనని వివరించారు. దసరాకు పూర్తిస్థాయిలో మ్యానిఫెస్టో విడుదల చేస్తానని ప్రకటించిన రాజమహేంద్రవరంలోనే ఖైదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో బయటకు వచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని చెప్పారు.ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఎప్పుడూ బయటకు రాని తన భార్య భువనేశ్వరిని ప్రజల తరపున పోరాడాలని కోరారని, అందుకు ఆమె ఒప్పుకున్నారనివివరించారు. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతిచెందిన కుటుంబాలను పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టేందుకు ‘నిజం గెలవాలి’ అంటూ భువనేశ్వరి ప్రజల ముందుకు వస్తోందని తెలిపారు. జనమే తన బలం దైర్యమని పేర్కొన్నారు. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కానీ అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమేనని తెలిపారు. మీ అభిమానం ఆశీస్సులతో త్వరలోనే బయటకు వస్తానని పేర్కొన్నారు. అప్పటివరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించాలని కోరారు. చెడు గెలిచినా నిలవదని, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాల పరీక్షలో గెలిచి తీరుతుందని తెలిపారు.