నాయకుల చుట్టే రాజకీయాలు

– ఓటర్ల చెంతకు చేరని పార్టీలు
– కండువాలు మారుస్తున్న నాయకుల ప్రభావం ఎంత
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓ పక్క ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి అధికార పార్టీ తీసుకు వెళ్తుంటే అధికారం ఇస్తే ఆరు గ్యారెంటీల పేరుతో ప్రతిపక్షం ప్రజల వద్దకు వెళుతుంది. కానీ భద్రాచలం నియోజవర్గంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీల వ్యవహార శైలి కనిపిస్తుంది. ఓటర్‌ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవలసిన రాజకీయ పార్టీల అభ్యర్థులు కేవలం నాయకుల చుట్టూ ప్రదర్శనతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. పక్క పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే గెలుపు తద్యమని అంచనాకు వచ్చి, ఇతర పార్టీ నాయకుల చుట్టూ ప్రధక్షనలు చేస్తున్నారు. ఎన్నికలకు పట్టుమని 30 రోజులకు కూడా లేకపోయినప్పటికీ ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి కూడా ప్రజల వద్దకు వెళ్లిన దాకాలే కనిపించడం లేదు. కేవలం నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ ప్రాంత గ్రామ ఓట్లను బుట్టలో వేసుకోవచ్చునన్న ఆలోచనలలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. తనను గెలిపిస్తే ఆ ఊరికి ఆ వాడకి ఆ ప్రజలకు తానేం చేస్తానో చెప్పాల్సిన అభ్యర్థులు కనీసం ప్రజలకు వద్దకు వెళ్లకుండా కేవలం సోషల్‌ మీడియా పైనే ఆధారపడుతూ తమ దృష్టి అంతా ప్రత్యేకంగా ఆ ప్రాంత నాయకులపైనే పెడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇంతకాలం నమ్ముకున్న పార్టీని వీడి ఎన్నికల వేళలో జెండాలు మార్చే నాయకులను ఆ ప్రాంత ఓటర్లు నమ్ముతారో లేదో అన్నది 1000 డాలర్ల ప్రశ్నే. ఈ నేపథ్యంలో ప్రజల్ని మరిచి ఓటరు దేవుళ్ళను విస్మరించి నాయకులను పట్టుకొని నడవచ్చన్న అభ్యర్థుల అంచనాలు ఏం మేరకు నెరవేర్థాయో వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనాప్పటికీ రాజకీయ నాయకులు అంటే ఇప్పటిదాకా గెలిచాకనే ప్రజలను విస్మరిస్తారనే వాదన బలంగా ఉండేది. దానికి భిన్నంగా గెలవకముందే ప్రజలతో పనేమి లేనట్టుగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయిన్న చర్చ ప్రజల్లో జోరుగా వినబడుతుంది. ప్రజలను మరచి నాయకులను తలచి ఎన్నికల్లో బరిలో నిలిచే ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఏ విధమైన తీర్పిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.

Spread the love