– రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్‌లకు..
– రాజేందర్ ఎవరినీ ఎదగనివ్వలేదు
– బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
నవతెలంగాణ-మర్కుక్
”ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారు. ముదిరాజ్‌లకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు వస్తాయి.. ఈటల ముదిరాజ్‌లలో ఎవరినీ ఎదగనివ్వలేదు..” అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో శుక్రవారం టీటీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సీఎం కేసీఆర్ సమయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, జెడ్పీ, మున్సిపల్ చైర్మెన్, స్థానిక సంస్థల పదవుల్లో ముదిరాజ్‌లకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. బండ ప్రకాష్‌ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మెన్ పదవులు ఇచ్చామన్నారు. ఎన్నికల తరువాత కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కుల పెద్దలను కూర్చోబెట్టుకొని ప్రధాన సమస్యల పరిష్కారంపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముప్పిడి గోపాల్, టీటీడీపీ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ప్రకాష్ ముదిరాజ్, భిక్షపతి ముదిరాజ్, పుట్టిరాజు ముదిరాజ్, జగదీష్ యాదవ్, మన్నే రాజు, సపన్ దేవ్ ముదిరాజ్, మహేశ్వరం ఇన్చార్జి ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కనకయ్య ముదిరాజ్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కరాటే రాజు ముదిరాజ్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రహాస్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి దూసరి వెంకటేష్ బీఆర్ఎస్లో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.