Monday, April 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.500 కోట్లు ఎప్పుడిస్తరు..?

రూ.500 కోట్లు ఎప్పుడిస్తరు..?

- Advertisement -

‘ఎంఎంసీ’కి ప్రత్యేకాధికారి ప్రకటన
మూడు నెలలుగా చిల్లిగవ్వ ఇవ్వని సర్కార్‌
ఆర్థిక సంక్షోభం.. కాసుల్లేక విలవిలా
జీతాల చెల్లింపునకు పొంచి ఉన్న సమస్య
టౌన్‌ ప్లానింగ్‌, ఎర్లీబర్డ్‌ ఆదాయమే దిక్కు
నవతెలంగాణ-సిటీబ్యూరో

పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన సర్కార్‌.. అభివృద్ధికి ఆశించిన స్థాయిలో సహకారం అందించకపోవడంతో కాసుల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సర్కార్‌ నుంచి ఆశించిన స్థాయిలో నిధులు అందకపోవడంతో కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. రూ.500 కోట్లు కేటాయిస్తామని ఫిబ్రవరిలో స్పెషల్‌ ఆఫీసర్‌ జయేశ్‌రంజన్‌ ప్రకటించినా, ఇంత వరకు నయా పైసా విడుదల కాలేదు. గత ఆర్థిక సంవత్సరం చివరలో ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలను జీహెచ్‌ఎంసీ ఖాతా నుంచే చెల్లించి సర్దిపెట్టుకున్నా.. ప్రస్తుతం కార్పొరేషన్‌ వద్ద సరిపడా నిధుల్లేకపోడంతో అంతా గందరగోళంగా మారడంతోపాటు పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది.

జీతాల చెల్లింపునకు..
నగరంలో కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు ప్రత్యేక నిధులిస్తామని, ఒక్కో కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు స్పెషల్‌ ఆఫీసర్‌ జయేశ్‌ రంజన్‌ ప్రకటించి దాదాపు మూడు నెలలైంది. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక శాఖ నుంచి స్పందన కరువైంది. ‘ఎంఎంసీ’కి రావాల్సిన రూ.500 కోట్ల మాట ప్రకటనలకే పరిమితమైంది తప్పితే.. ఎప్పుడు, ఎలా కేటాయిస్తారో స్పష్టత లేదు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ‘ఎంఎంసీ’లో రిటైర్డ్‌ ఉద్యోగులకు బెనిఫిట్స్‌తోపాటు వచ్చే నెల ఉద్యోగుల జీతాలు ఎలా చెల్లించాలో తెలియని పరిస్థితి. నిర్వహణ భారంగా మారడంతోపాటు, ఎర్లీబర్డ్‌ ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో అధికారులకు నెలవారీ నిర్వహణ, ఉద్యోగుల జీతాల చెల్లింపు సవాల్‌గా మారింది. విభజన వల్ల కొత్త పోస్టులు, కొత్త కార్యాలయాల ఖర్చు పెరిగింది తప్పితే ఆదాయంలో పెద్దగా మార్పేమీ రాలేదు. ప్రస్తుతం రోజువారీగా వసూలయ్యే ప్రాపర్టీ ట్యాక్స్‌ ద్వారానే కార్పొరేషన్‌ రొటీన్‌ మెయింటెనెన్స్‌ ఖర్చులను నెట్టుకొస్తోంది. ఏప్రిల్‌ జీతాలను ఎర్లీబర్డ్‌ స్కీమ్‌ ద్వారా వచ్చే 5 శాతం రాయితీ పన్ను వసూళ్లతో ఎలాగోలా సర్దుబాటు చేసినా, మే నుంచి పరిస్థితి మరింతగా దిగజారేలా కనిపిస్తోంది. ఇక నుంచి ప్రతి నెలాఖరులో జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి అధికారులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొనేలా కనిపిస్తోంది.

ఆస్తిపన్ను.. ప్లానింగ్‌ ఆదాయమే దిక్కు
ఎర్లీబర్డ్‌ స్కీంతో వచ్చే ఆస్తిపన్ను వసూలు, టౌన్‌ప్లానింగ్‌ విభాగం వసూలు చేసే భవన నిర్మాణాల ఆదాయంపైనే మల్కాజిగిరి కార్పొరేషన్‌ ఆధారపడి ఉంది. ఇలా వచ్చే ఆదాయంతో కార్పొరేషన్‌ ఉద్యోగుల జీతభత్యాలను అందిస్తున్నది. ఈ రెండు విభాగాల నుంచి ఆదాయం వస్తేనే ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు చెల్లిస్తారు.. లేదంటే జాప్యమే. గతేడాది ఆస్తి పన్ను ద్వారా కార్పొరేషన్‌కు రూ.962.62 కోట్లు వసూలైనట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. మార్చిలో ‘ఎంఎంసీ’లో రూ.107.09 కోట్లు వసూలైంది. 2025-26 టౌన్‌ప్లానింగ్‌ విభాగం ద్వారా రూ.198.24 కోట్లు ఆదాయంగా వచ్చింది. ఈనెల (ఏప్రిల్‌)లో ఎర్లీబర్డ్‌ స్కీం అమలులో ఉన్నందున ఆస్తిపన్ను కొంతమేర ఖజానాకు చేరే అవకాశాలున్నాయి. దీనికి టౌన్‌ప్లానింగ్‌ నుంచి వచ్చే ఆదాయం కూడా తోడైనా.. కాసుల కష్టాలు తప్పేలా లేదు.

జీహెచ్‌ఎంసీకి ‘ఎంఎంసీ’ లేఖ
ఆదాయంలో తమ వాటా ఇవ్వాలంటూ మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీకి లేఖ రాసింది. నిధుల్లేక అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని, పన్ను, నిర్మాణ అనుమతుల రుసుం రూపంలో వచ్చిన ఆదాయాన్ని పంచుకోవాల్సిన అవసరమున్నట్టు కార్పొరేషన్‌ గుర్తు చేసింది. మూడు కార్పొరేషన్లుగా విడిపోయినప్పటికీ, పాత 150 డివిజన్ల ఆస్తి పన్ను మార్చి 31వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ ఖాతాకే చేరింది. పునర్వి భజనలో భాగంగా నూతన కార్పొరేషన్లకు రూ.500 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిం చినప్పటికీ.. ‘ఎంఎంసీ’కి నిధులు అందలేదు. దీంతో నూతన కార్పొరేషన్‌ ప్రతి అవసరానికీ జీహెచ్‌ఎంసీపై ఆధారపడుతూ వస్తోంది. కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు తేదీ నుంచి తమ పరిధిలో వసూలైన ఆస్తి పన్ను విలువను లెక్కిం చి, ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయాలని తాజాగా ‘ఎంఎంసీ’ కమిషనర్‌ జీహెచ్‌ఎంసీని కోరారు. రూ.150 కోట్లు ఇవ్వాలని మల్కాజిగిరి కార్పొరేషన్‌ అధికారులు కోరగా.. జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -