రూ.3,034 కోట్ల ఆస్తుల జప్తు చేసిన ఈడీ
కొత్తగా ముంబయి ఫ్లాట్,ఖండాలా ఫామ్‌హౌస్ అటాచ్
మొత్తం రూ.19వేల కోట్లు పైనే సీజ్..
ముంబయి : బ్యాంక్‌లకు వేల కోట్లకు మోసం చేసిన కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కేసులో అనిల్ అంబానీకి చెందిన మరిన్ని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. తాజాగా రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ (ఆర్‌ఏఏజీ)పై ఇడి కొరడా ఝుళిపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం రూ.3,034.90 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. దీనితో ఈ గ్రూపునకు సంబంధించి ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ.19,344 కోట్లకు చేరుకుంది. అనిల్ అంబానీ కంపెనీలు దాదాపు రూ.73వేల కోట్ల మేర బ్యాంక్‌లను మోసం చేశాయనేది సీబీఐ అంచనా.
విలాసవంతమైన ఆస్తుల సీజ్
తాజా జప్తులో భాగంగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ఉషా కిరణ్ బిల్డింగ్‌లోని విలాసవంతమైన ఫ్లాట్, పూణె సమీపంలోని ఖండాలాలో ఉన్న భారీ ఫామ్‌హౌస్‌తో పాటు అహ్మదాబాద్‌లోని సానంద్‌లో ఉన్న భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అంబానీ కుటుంబ సభ్యుల ప్రయివేటు ట్రస్ట్ అయిన ‘రైజ్-ఇ’ ఆధ్వర్యంలోని రూ.7.71 కోట్ల విలువైన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లను కూడా అటాచ్ చేసినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. జప్తు చేసిన ఆస్తులలో కొన్ని అనిల్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ పేరిట ఉన్నట్టు అధికారులు తెలిపారు.
నిధుల మళ్లింపుపై ఆరోపణలు
బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు అనిల్ అంబానీ వ్యక్తిగత గ్యారెంటీలు ఇచ్చినప్పటికీ ఆ బాధ్యతల నుండి ఆస్తులను తప్పించేందుకే ఈ ఫ్యామిలీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని ఈడీ ఆరోపిం చింది. ప్రభుత్వ బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు మొండి బాకీలుగా మారుతున్నా, ఆ నిధులను బ్యాంకులకు చెల్లించకుండా కుటుంబ ప్రయోజనాల కోసం మళ్లించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బందం (ఎస్‌ఐటీ) ప్రస్తుతం ఈ నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్‌ఐసి వంటి సంస్థలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిబిఐ నమోదు చేసిన కేసుల నేపథ్యంలో ఇడి ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు స్వదేశీ, విదేశీ బ్యాంకులకి సుమారు రూ.40,185 కోట్లు బకాయిపడ్డాయి. ఈ ఆస్తుల జప్తుపై అంబానీ కంపెనీల నుండి అధికారిక స్పందన రావాల్సి ఉంది
అనిల్ అంబానీకి బిగుస్తోన్న ఉచ్చు
- Advertisement -
- Advertisement -



