నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజిపేట గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి డాక్టరేట్ చిలుకు స్వామి ప్రతిష్టాత్మకమైన “శ్రమ శక్తి అవార్డు”ను మేడే సందర్భంగా అందుకోనున్నారు. గత 14 సంవత్సరాలుగా రైల్వే కార్మిక సంఘం ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తూ, ఎస్సీ విభాగ కార్యదర్శి స్థాయి నుంచి డివిజన్ స్థాయి ఉప కార్యదర్శిగా ఎదిగి కార్మికులకు అంకిత భావంతో సేవలందిస్తున్నారు. అలాగే గత రెండు సంవత్సరాలుగా సహకార క్రెడిట్ సంఘ ప్రతినిధిగా సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.
సంక్షోభ కాలంలో కూడా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, రైల్వే ఉద్యోగుల కోసం పలు ముఖ్య కార్యక్రమాలు నిర్వహించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ చేతుల మీదుగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా చిలుకు స్వామి మాట్లాడుతూ తాను సాధించిన ఈ గౌరవానికి శారాజిపేట గ్రామ ప్రజల ఆశీర్వాదాలు, సహకారం కారణమని తెలిపారు. తన ఎదుగుదలలో గ్రామానికి ఎంతో రుణపడి ఉన్నానని పేర్కొన్నారు. రైల్వే రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రముఖులు, సహచరులు, స్నేహితులు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.



