Friday, May 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండీజీపీ శివధర్‌రెడ్డి పదవీ విరమణ

డీజీపీ శివధర్‌రెడ్డి పదవీ విరమణ

- Advertisement -

ఘనంగా వీడ్కోలు కార్యక్రమం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

తెలంగాణ డీజీపీ బి.శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖ ఆయనకు పోలీసు అకాడమీలో పదవీ విరమణ కార్యమాన్ని ఘనంగా నిర్వహించింది. ముందుగా ఆయన పోలీసుల నుంచి వీడ్కోలు సూచికగా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. అందుకు తామంతా ప్రత్యక్ష సాక్షులమని తెలిపారు. ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పీపుల్స్‌ పోలీసింగ్‌ అనేది ఓ నినాదంగా తీసుకువచ్చాం. దీనికి ఓ కారణం ఉంది. అంతకుముందు సాగిన తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు అప్పటి వ్యవస్థలకు పోలీసులు సహకరించారనే అపప్రద తెలంగాణ పోలీసులపై ఉండేది. దాంతో ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయింది” అని ఆయన అన్నారు. ఈ దూరాన్ని తగ్గించేందుకు ప్రజలే పోలీసులు, పోలీసులే ప్రజలు అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం తీసుకువచ్చారని తెలిపారు. తాను డీజీపీగా బాధ్యతలు తీసుకున్నాక సిటిజన్‌ సెంట్రిక్‌ పోలీసింగ్‌ విధానానికి శ్రీకారం చుట్టామన్నారు.
నూతన డీజీపీ బాధ్యతలు చేపట్టబోతున్న సి.వి ఆనంద్‌ మాట్లాడుతూ… శివధర్‌రెడ్డి ఒక కఠినమైన అధికారిగా మాత్రమే కాకుండా, సిబ్బందికి మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని, సంస్థకు గౌరవాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యను సమూలంగా అరికట్టడంలో ఆయన ప్రత్యేక చొరవ తీసుకోవడం గమనార్హం అని అన్నారు. అకాడమీ డైరెక్టర్‌ అభిలాషబిస్త్‌ మాట్లాడుతూ… తెలంగాణ పోలీస్‌ అకాడమీ అభివృద్ధికి శివధర్‌రెడ్డి విశేష కృషి చేశారన్నారు. శిక్షణలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి, యువ పోలీసులకు నూతన దిశను చూపించారని తెలిపారు. ఈ రోజు ఆయనకు వీడ్కోలు చెప్పడం బాధాకరం కానీ, ఆయన వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుందని అభిలాషబిస్త్‌ చెప్పారు.
డీజీపీ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు..

పదవీ విరమణ పొందిన శివధర్‌రెడ్డికి లక్డీకాఫూల్‌లోని డీజీపీ కార్యాలయంలో సాంప్రదాయ పద్దతుల్లో అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శకఠంపై ఆయన ఉండగా వాహనాన్ని తాళ్లతో అధికారులు లాగి సాగనంపారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనపై పూల వర్షం కురిపించారు. తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి ఏడు నెలలు పూర్తయ్యాయనీ, ఈ కాలంలో తనకు తెలంగాణ ప్రజల నుంచి, అలాగే హోంగార్డుల నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకు పోలీస్‌ విభాగంలోని ప్రతి ఒక్కరి నుంచీ అపారమైన మద్దతు సహకారం లభించిందని శివధర్‌రెడ్డి ఎమోషనల్‌ ట్వీట్‌ పోస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -