కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు ఫలితం
హోటళ్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్లకు దెబ్బ
రాష్ట్రంపై రోజుకు రూ.2.28 కోట్ల భారం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు నిర్ణయం ఇటు వినియోగదారులను, అటు హోటళ్ల యాజమాన్యాలను బెంబేలెత్తిస్తోంది. ఓ కప్పు కాఫీ తాగటానికి సామాన్యుడు వెనుకాముందూ ఆడుతుంటే.. రూ.20 ఉన్న అదే కప్పు కాఫీని రూ.30కి అమ్మలేక టీ విక్రయిం చేవాడు… హోటల్ యాజమాన్యాలు దిగాలు పడుతున్నాయి. వెరసి.. ఏం తినలేని పరిస్థితి.. ఏదీ అమ్మలేని దుస్థితి నెలకొంది. యుద్ధం వల్ల సిలిండర్ల కొరత ఏర్పడటంతో కమర్షియల్ గ్యాస్ ధరను ఇప్పటికే రెండుసార్లు పెంచిన కేంద్రం.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రూ.993 వడ్డించింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పరిస్థితి తయారైంది. పెరిగిన ధరల వల్ల చిన్న పరిశ్రమలు, ప్రయివేటు హాస్టల్స్, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆయా సంస్థల్లో నడుస్తున్న క్యాంటీన్ల నిర్వహణ మరింత భారం కానుంది.
ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ చాలా హోటళ్లు మూతపడ్డాయి. అంతేకాకుండా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచడం వల్ల టిఫిన్, భోజనం ఖర్చులు భారీగా పెరిగే అవకాశముంది. వాస్తవానికి అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై యుద్ధానికి కొద్ది రోజుల ముందే ఈ ఏడాది మార్చిలో మోడీ సర్కార్ వాణిజ్య సిలిండర్ ధరపై రూ.115, ఏప్రిల్‌లో రూ.195 వడ్డించింది. ఇప్పుడు మూడోసారి ఏకంగా రూ.993 పెంచి మరింత షాక్ ఇచ్చింది. ఇలా రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.1,303 పెంచటంతో ఇటు వినియోగదారులు, అటు చిన్న వ్యాపారులు లబోదిబోమం టున్నారు. తాజా పెంపుదలతో హైదరాబాద్‌లో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ. 3,315కు ఎగబాకింది. యుద్ధం పేరిట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది, ఏజెన్సీలు, అధికారులు కలిసి రూ. 2,100 ధర ఉన్న సిలిండర్‌ను ఏకంగా రూ.3500, రూ4500, రూ. 5వేల వరకు బ్లాక్‌లో అమ్ముకుంటూ వచ్చారు. ఫలితంగా టిఫిన్స్, భోజనం, చారు ధరలు పెరగడంతో వినియోగదారులపై తీవ్ర భారాలు పడ్డాయి. రూ.10 ఉన్న కప్పు టీ ధర రూ.15, రూ.20కి పెరిగింది.
రూ.30 ఉన్న ప్లేట్ టిఫిన్ ధర రూ.40 నుంచి రూ.50కి పెరిగి, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. భోజనం ధర ప్లేటుకు రూ.70 నుంచి రూ.100కు చేరుకునే అవకాశం ఉన్నది. అదే రెస్టారెంట్లలో అయితే రూ.100 నుంచి రూ. 150 వరకు పెరగనున్నాయి. మొన్నటి వరకు ప్రయివేట్ వర్కింగ్ హాస్టళ్లలో భోజనం, వసతి కలిపి నెలకు రూ. 5 వేల నుంచి రూ.5,500 వరకు వసూలు చేస్తే ఇప్పుడు రూ.6 వేల నుంచి రూ.6,500కు పెరిగే అవకాశముంది. గ్యాస్ ధరల పెంపుతో బేకరీలు, స్వీట్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఉత్పత్తి వ్యయం పెరిగిపోయి అవి మూత పడే అవకాశం ఉన్నది. కొన్ని యూనిట్లు ఉత్పత్తి తగ్గిస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా వాటిలో పని చేసే కార్మికులు ఉపాధి కోల్పేయే ప్రమాదముంది. గ్యాస్ ధరలు ఇలాగే పెరుగుతూ పోతూ ఉంటే వ్యాపారాలు కొనసాగించడం కష్టమని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపుల్లో కలిపి రోజుకు సగటున 23,000 కమర్షియల్ సిలిండర్లను వినియోగి స్తున్నారు. శుక్రవారం ఒక్కో సిలిండర్ ధర రూ.2,100గా ఉంది. ఇప్పుడు పెంచిన రూ.993తో కలిపి అది రూ.3,093కు చేరింది. ఈ చొప్పున రోజుకు 23,000 సిలిండర్లకు కలిపి రూ.2.23 కోట్లు అదనంగా భారం పడనుంది.
పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కమర్షియల్ గ్యాస్ ధర పెంపుదల నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇది సామాన్యులపై పెనుభారం మోపనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్ ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై ఇప్పుడు రూ.వెయ్యి అదనంగా పెంచట మేంటని ప్రశ్నించారు. పెంచిన ధరలతో 19 కేజీల గ్యాస్ ధర మూడు వేలకు మించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు ఒక్కసారిగా 30 నుంచి 35 శాతం పెరగడంతో హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లతో సహా చిన్న తరహా వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఈ పెంపుతో సామాన్యుల జీవన ప్రమాణాలపై కోలుకోలేని దెబ్బ పడనుందని పేర్కొన్నారు.



