ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు..యాజమాన్యంపై కలెక్టర్ ఆగ్రహం
పూర్తిస్థాయి నివేదిక అందే వరకు కంపెనీని మూసివేయాలని ఆదేశం
నోష్ ఫార్మా ల్యాబ్ మూడో బ్లాక్‌లో పేలిన రియాక్టర్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో నోష్ ఫార్మా కంపెనీలో శుక్రవారం మరోసారి రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. 8మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నోష్ ఫార్మా కంపెనీలోని మూడో బ్లాక్‌లో 9మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రియాక్టర్ పేలడంతో అందులో పనిచేస్తున్న 9మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ డీఆర్‌డీఏ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణ (32) మృతిచెందాడు. నెల రోజుల క్రితమే ఇదే పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం ఇంకా మర్చిపోకముందే మరో ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అక్కడి కార్మికులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
కార్మిక దినోత్సవం మే డే రోజున ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల కార్మికులు, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు పరిశ్రమ ఎదుట ధర్నా చేశారు. పరిశ్రమను మూసివేయాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఉందని కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని, కార్మికుల భద్రతకు హామీ ఇవ్వాలని కోరారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
సంఘటనా స్థలాన్ని కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్రపవార్.శుక్రవారం సందర్శించి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, చేపడుతున్న సహాయక చర్యలపై ఆరా. తీశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితిపై అందుతున్న వైద్యంపై కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇదే కంపెనీలో తరచూ ప్రమాదాలు జరగడంపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణ పై ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నారని కంపెనీ జీఎంపై మండిపడ్డారు. ప్రమాద సమయంలో అదే బ్లాక్లో పనిచేస్తూ గాయాల పాలైన ఎంప్లాయిస్‌ని కలెక్టర్, ఎస్పీ పరామర్శించారు.
నివేదిక అందే వరకు కంపెనీ మూసివేయాలని ఆదేశాలు
గత నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడి చికిత్స పొందుతున్న సంఘటన మర్చిపోకముందే మరొక సంఘటన జరిగి ఒకరు చనిపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేంతవరకు కంపెనీని మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నోష్ ఫార్మా ల్యాబ్ మూడో బ్లాక్‌లో పేలిన రియాక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



