Saturday, May 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసమగ్ర కార్యాచరణతో రండి

సమగ్ర కార్యాచరణతో రండి

- Advertisement -

గుర్తింపు ఎన్నికలు, విలీనంపై చర్చించుకోండి పీఆర్సీ అంశాన్ని పరిష్కరిస్తాం
గాజులరామారంలో 100, బహదూర్‌గూడలో 150 ఎకరాల్లో బస్‌ టెర్మినళ్లు
ఒక్క డ్రైవర్‌నూ ఉద్యోగం నుంచి తొలగించం ఉద్యోగులు, యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి : ఆర్టీసీ కార్మిక సంఘాలతో
సీఎం రేవంత్‌రెడ్డి సమ్మె కాలంలో వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతకు ఆదేశం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆర్టీసీ మనుగడ, గౌరవాన్ని పెంపొందిచి ప్రయాణికులకు మెరుగైన సేవలందిం చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గుర్తింపు సంఘం ఎన్నికలు, విలీనంపై అన్ని సంఘాల నాయకులు సమావేశమై సమగ్ర కార్యాచర ణ రూపొందించాలని సీఎం సూచించారు. పీఆర్సీ అంశాన్ని తాము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇతర ఉన్నతాధికారులతో ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు, విలీనంపై ఏవిధంగా ముందుకు పోవాలనే దానిపై సంఘాల నాయకులు సమావేశమై ప్రభుత్వం ఎదుట ఆప్షన్లు ఉంచాలని సూచించారు.

ఒకవేళ యూనియన్ల మధ్య ఏకాబిప్రాయం కుదరకపోతే ఏ యూనియన్‌కు ఆ యూనియన్‌ తమ ఆప్షన్లు ఇస్తే కామన్‌గా ఉన్న వాటికి ఆమోదం తెలిపి, భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిపై చర్చిద్దామని సీఎం తెలిపారు. ఆర్టీసీ బకాయిలు తమ హయాంలోనివి కావనీ, అయినా వాటిని చెల్లించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నా మని అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల నిధులను వాడుకుందనే విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఆర్టీసీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి అంతా కలిసిరావాలని, భావోద్వేగాలు, రాజకీయాల ప్రభావాలకు లోనైతే సంస్థకు నష్టం వాటిల్లుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, ప్రభుత్వం వేర్వేరనే భావన తమకెప్పుడూ లేదన్నారు. 2006లో జడ్పీటీసీ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అధ్యక్షునిగా ఉన్న సమయలో ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటాల్లో పాలుపంచుకున్నానని సీఎం గుర్తు చేశారు. సింగరేణి, విద్యుత్‌ కార్మికులతో పాటు ఆర్టీసీ కార్మికులు బలంగా కోరుకున్నందునే తాము అధికారంలోకి వచ్చామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో నియా మకాలు చేపట్టడంతో పాటు బస్సుల సంఖ్యను పెంచామనీ, కారుణ్య నియామకాలూ చేపట్టామని అన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయా ణికుల సంఖ్య పెరగడంతో పాటు, నెల నెలా చెల్లింపులతో ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగిందని సీఎం చెప్పారు. పని భారం పెరిగినా క్షేత్ర స్థాయి సిబ్బంది సహనంతో పని చేస్తుండడంతో తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సమున్నత లక్ష్యంతోనే టెర్మినళ్ల నిర్మాణం
ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యం కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల తో బస్‌ టెర్మినళ్లు నిర్మించడానికి ఆర్టీసీకి గాజులరామారంలో వంద ఎకరాలు కేటాయించామని సీఎం చెప్పారు. బహదూర్‌గూడ (శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో)లో 150 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు. ఆర్టీసీని సమున్నత స్థానంలో నిలపాలనే లక్ష్యంతోనే ఈ టెర్మినళ్లు నిర్మించాలని నిర్ణయించా మన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల నుంచి డిమాండ్‌ లేకపోయినా తామే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ఆర్టీసీలో డీజిల్‌కు ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనీ, ఆ వ్యయం తగ్గింపునకే తాము ఈవీల వైపు మొగ్గుచూపుతున్నామని అన్నారు. ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించు కోవాలనీ, దీనికి పక్కా ప్రణాళిక అవసరమని చెప్పారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రో, ఎంఎంటీఎస్‌తో అనుసంధానం చేసి లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీకి కషి చేస్తామని సీఎం తెలిపారు.

అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను రీకన్‌స్ట్రక్షన్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. సంస్థ బలోపేతానికి కార్మికులు సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్‌నూ తొలగించ బోమని హామీనిచ్చారు. ఆర్టీసీ కార్మికులు, యాజ మాన్యం మధ్య గ్యాప్‌ రాకుండా చూసుకోవాలని సూచిం చారు. డిపో మేనేజర్లు, ఈడీ, ఎండీ స్థాయి అధి కారులు తరచూ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై సుహద్భావ వాతావరణంలో మాట్లా డుకుంటే సగం సమస్యలు పరిష్కారమ వుతాయని అన్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో మూడు నెలలకోసారి సమావేశం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎండీ నాగిరెడ్డికి సీఎం సూచించారు. అనేక ఇబ్బందులున్నా ఉద్యోగులు, కార్మికులు సమస్యల పరిష్కారానికి తాము పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. విశ్రాంత ఉద్యోగుల చెల్లింపులను రూ.700 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

కార్మికులకు అండగా ప్రభుత్వం
ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామనీ, కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చిన్న చిన్న స్పర్థలతో సంస్థకు నష్టం వాటిల్లే పనులు చేయకూడదనీ, సంస్థ మనుగడ సాగిస్తేనే అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలనీ, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కార్మిక సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ వికాస్‌ రాజ్‌, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు ఏ.ఆర్‌.రెడ్డి, థామస్‌రెడ్డి (తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌) , అశ్వత్థామ రెడ్డి, శంకర్‌ (తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (రి)), వీరాంజనేయులు, వి.ఎస్‌.రావు (స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌), ఎస్‌.బాబు, ఈ.వెంకన్న (ఎంప్లాయీస్‌ యూనియన్‌), పి.కమల్‌ రెడ్డి, ఎండీ మౌలానా (నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌), ఎంకే బోస్‌, బి.యాదగిరి (కార్మిక పరిషత్‌), జి.అబ్రహం, మొగుళ్ల రాజిరెడ్డి (స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌), రాజిరెడ్డి, బి.యాదయ్య (స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (రి)), బి.మునిరాములు, కె.యాదయ్య (బహుజన కార్మిక యూనియన్‌), కె.సత్యనారాయణ, ఎండీ అక్బర్‌ అలీ (ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌), కె.మనోహర్‌రావు, ఈ.స్వామి కుమార్‌ (కార్మిక సంఫ్‌), పున్న హరికిషన్‌, గోవింద్‌ (సామాజిక తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌), డి.వి.కె.రావు, కె.హనుమంతు ముదిరాజ్‌ (తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌), దువ్వాసీ యాదయ్య, సుద్దాల సురేష్‌ (బహుజన్‌ వర్కర్స్‌ యూనియన్‌) తదితరులు పాల్గొన్నారు. .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -