Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందోచుకున్నోడికి దోచుకున్నంత

దోచుకున్నోడికి దోచుకున్నంత

- Advertisement -

సర్కారుది ఒక దారి.. జీహెచ్ఎంసీది మరో దారి
ప్రభుత్వానిది పొదుపు మంత్రం.. వీరిది దుబారా
ఉన్నది 40 వాహనాలు.. సిబ్బంది 345 మందికిపైగా..
జీహెచ్‌ఎంసీలో పెద్ద మొత్తంలో నిధుల గోల్‌‌మాల్‌
ఒక్క చోటనే ఇలా ఉంటే.. మిగతా చోట్ల అక్రమాలపై ఆరా..
అక్రమార్కుల జేబుల్లోకి కోట్లాది రూపాయల నిధులు
పలు విభాగాల్లో సంచలనం రేపిన ‘నవతెలంగాణ’ వరుస కథనాలు
ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్

ఇ. రత్నాకర్
రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ఆలోచనతో ఖర్చులను సైతం తగ్గించుకుంటున్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారు. వారికి కేటాయించిన సెక్యురిటీ సిబ్బందితోపాటు, వాహనాలను సైతం సాధ్యమైనంత మేరకు తగ్గించుకున్నారు. పెట్రోల్, డిజిల్ వినియోగాన్ని ఆదా చేయడం మొదలు పెట్టారు. సర్కారుది ఒక దారి అయితే.. జీహెచ్ఎంసీది మరో దారిగా కనిపిస్తోంది. 2006 వరకు వంద వాహనాలుంటే నేడు 40 వరకు వాహనాలున్నాయి. అయినా సిబ్బంది సంఖ్య మారలేదు. ఇందులోనూ కొన్ని అద్దె వాహనాలు. వేతనాలు, ఖర్చు సేమ్ టూ సేమ్. ఇప్పటికీ పాత లెక్కతోనే 345 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారంటే జీహెచ్ఎంసీలో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో ఇట్టే అర్థమవుతోంది. ఒక్క జోన్ లోనే ఇలావుంటే మిగిలిన జోన్ల పరిస్థితి ఏంటని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆరా తీస్తున్నట్టు తెలిసింది.మల్కాజిగిరి సర్కిల్‌లో దోమల ఫాగింగ్ కోసం కేటాయించిన డీజీల్ దుర్వినియోగంపై ఎంటమాలజీ సిబ్బంది చేసిన వ్యవహారం మర్చిపోకముందే జీహెచ్ఎంసీ (చార్మినార్ జోన్) మలక్‌‌పేట్‌ పార్కింగ్ యార్డులో రోజుకో కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అవినీతి అక్రమార్కులకు అడ్డాగా మారిన మలక్‌‌పేట్‌ ట్రాన్స్‌‌పోర్టు విభాగంలో మూలన పడిన వాహనాలకు డ్రైవర్ల ప్రమేయం లేకుండానే స్పేర్‌‌పార్ట్స్‌ వేసినట్టు (ఇండెంట్లు పెట్టి) బిల్లులు స్వాహా చేయడమే కాకుండా డీజిల్ కూపన్ల జారీ విషయంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. 40 వాహనాలకుగాను దాదాపు 345మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారంటే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

​గుర్తించని అధికారులు
చార్మినార్ జోన్‌లో ఐదు సర్కిళ్లున్నాయి. గతంలో ఉన్న 6,7,8, 9,10 ఓల్డ్ సర్కిల్స్ స్థానంలో 25, 26, 27, 28, 29 కొత్త సర్కిల్స్‌ ఏర్పాటు చేశారు. దాంతో చార్మినార్ జోన్‌ ‌పరిధిలో సంతోష్‌‌నగర్‌, చార్మినార్, యాకుత్‌‌పురా, మలక్‌‌పేట్‌, ముషారాంబాగ్‌లున్నాయి. ఇదిలావుండగా మలక్‌‌పేట్‌ పార్కింగ్ యార్డ్ కార్యాలయంలో డీసీటీవో (డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్)తోపాటు ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్) ఒక ఫోర్మెన్ లేదా అసిస్టెంట్ ఫోర్‌‌మెన్‌‌తోపాటు మెకానిక్ లు (దాదాపు 40మంది ఉద్యోగులు) పర్మినెంట్ ఉద్యోగులు, 300మందికి పైగా ఔట్ సోర్సింగ్‌లో డ్రైవర్లు, కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 193 మంది ఔట్‌‌సోర్సింగ్‌ లేబర్స్, 114 మంది ఔట్‌‌సోర్సింగ్‌ డ్రైవర్లున్నారు. కేవలం 40 వాహనాలకే దాదాపు 345మందికిపైగా పనిచేస్తున్నారంటే ఆందోళన కల్గిస్తోంది. ఈ వ్యవహారాన్ని ఇన్నేండ్లు సంబంధిత అధికారులు సైతం గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

​అప్పట్లో 100 వాహనాలు
మలక్‌‌పేట్‌ పార్కింగ్ యార్డ్‌‌లో 2006 వరకు 100 వాహనాలుండేవి. ఐబీటీ (ఇంమ్లీబన్‌ ట్రాన్స్‌‌ఫర్‌ స్టేషన్)లో కాలక్రమంలో కొన్ని వాహనాలు కండంకాగా, మరికొన్ని వాహనాలు రిపేర్‌‌లో ఉన్నాయి. ప్రస్తుతం 36 వాహనాలు మాత్రమే రన్నింగ్ కండీషన్‌లో ఉన్నాయి. అందులో కూడా 30 వాహనాలు జీహెచ్‌ఎంసీకి చెందినవి కాగా, 6 వాహనాలు మాత్రం ఆర్ఎఫ్‌‌సీ వాహ నాలున్నాయి. ఇందులో ఓపెన్ టిప్పర్లు, మరికొన్ని టాటా ఏసీఇలతోపాటు బకెట్‌ ‌లాడర్స్‌, యానిమల్ క్యాచింగ్‌ వాహనాలున్నాయి. ఇదిలావుండగా చార్మినార్ ‌సర్కిళ్ల నుంచి ఐబీటీ(ఇంమ్లీబన్‌ ట్రాన్స్ ఫర్ స్టేషన్) వరకు టిప్పర్లతో చెత్తను తరలిస్తారు. అక్కడి నుంచి 25 టన్నల్స్ వాహనాలపై జవహర్‌‌నగర్‌ ‌డంపింగ్‌‌యార్డుకు తరలిస్తారు.

ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్
మలక్‌‌పేట్‌ పార్కింగ్ యార్డులో రోజుకో కుంభకోణం ‘నవతెలంగాణ’ దినపత్రిక వెలుగులోకి తెస్తుండటంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది. స్పేర్‌‌పార్టు వేసినట్టు (ఇండెంట్లు పెట్టి) బిల్లులు స్వాహా చేయడంతోపాటు డీజిల్ కూపన్ల జారీ విషయంలో అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు పూర్తి నివేదికను కమిషనర్ కు అప్పగించినట్టు సమాచారం. నివేదిక మేరకు దాదాపు ఆరుగురిపై బదిలీవేటు వేయగా, మరికొందరిపై సస్పెషన్ లేదా మెమోలు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలావుండగా మలక్ పేట్‌ పార్కింగ్ యార్డులో మరో కుంభకోణం కమిషనర్ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. అయితే ఇన్నేండ్లు ఇంతమంది పనిచేస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారీ గుర్తించలేదు, వారి జీతభత్యాలు, ఖర్చులు, నిర్వహణ ఎలా జీహెచ్ఎంసీ భరించింది, వేళ్లపై లెక్కపెట్టే వాహనాలకు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారంటే ఏంటీ అర్థం? ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత వుందో అనే కోణంతోపాటు వివిధ అంశాలపై దృష్టి సారించిన కమిషనర్, అంతర్గతంగా విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఒక్క జోన్ లోనే ఇలావుంటే మిగిలిన జోన్ల పరిస్థితి ఏంటని? అవినీతి అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులకు కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా చార్మినార్ జోన్ లో రోజుకో కుంభకోణం వెలుగులోకి రావడంతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు తలలు పట్టుకుంటు‌నట్టు తెలిసింది. వారు ఇక్కడ పనిచేయడానికి విముఖత చూపడం లేదని సమాచారం. మిగతా జోన్లలోనూ లెక్కల వివరాలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

బల్దియాకు భారంగా జీతభత్యాలు
చార్మినార్ జోన్ లో వాహనాల రిపేయిర్స్ తోపాటు ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వాహణ, డిజిల్ పెట్రోల్‌ కేటాయింపు‌లకు జీహెచ్ఎంసీ భారీగా ఖర్చు చేస్తోంది. 2025 – 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా నిధులు గోల్‌‌మాల్‌ అయినట్టు తెలిసింది. ఇక్కడ జోనల్ సీటీఓ, డీఇకి ఓనర్‌ ‌కం డ్రైవర్ (అద్దె వాహనం) వాహనాలు కేటాయిస్తారు. ఏఈ వాహనానికి నెలకు 40లీటర్ల పెట్రోల్‌కు కూపన్ల రూపంలో జీహెచ్ఎంసీ జారీచేస్తోంది. రిపేయిర్ అయితే వాహనం యజమానే భరిస్తాడు. జోనల్ సీటీఓకు కేటాయించిన అద్దె వాహనానికి సుమారు రూ.34 వేలు చెల్లిస్తారు. వాహనం రిపేయిర్ సదరు యజమానిదే బాధ్యత.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -