మోదుంపెల్లి శంకరమ్మ… పేరు సాధారణమే అయినా ఆమె జీవితం అసాధారణం. అలుగునూర్ అనే చిన్న గ్రామంలో రాజమ్మ, హన్మంతు దంపతులకు 10 మార్చి 1965న జన్మించారు. నిజానికి ఈమెను జీవితాన్ని గెలవడానికి పుట్టిన యోధురాలిగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే జ్వరం కారణంగా వికలాంగురాలిగా మారింది. ”కాళ్లు బలహీన పడ్డాయి… కానీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోలేదు. తండ్రి దూరమయ్యాడు… తల్లి ఒంటరిగా పోరాడింది… పేదరికం చుట్టుముట్టింది.
తల్లి చేతుల్లో పెరిగిన ఆ చిన్నారి మనసులో మాత్రం ఒకే లక్ష్యం … చదివి నిలబడాలి… వాన పడితే గుడిసె తడిసేది… కానీ ఆ గుడిసెలో వెలిగిన దీపం … ఆమె ఆశలు. కరెంట్ లేదు… సౌకర్యాలు లేవు. కుండపై పెట్టిన దీపం కాంతిలో చదువుకున్న రోజులు…
పగలు కూలి పని రాత్రి చదువు… చెల్లెళ్ల బాధ్యత కూడా భుజాన వేసుకున్న చిన్న వయసు…
విద్యా ప్రయాణం
అలుగునూర్ నుంచి కరీంనగర్ వరకు ఆమె అడుగులు జ్ఞాన మార్గంలో ముందుకు సాగాయి. అలుగునూర్ ఖూూ లో 1వ తరగతి నుంచి 7వ తరగతి, గవర్నమెంట్ స్కూల్ లో 8వ నుంచి 10వ తరగతి, గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, కరీంనగర్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తర్వాత గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసి షార్ట్‌హ్యాండ్, టైపింగ్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ శిక్షణ తీసుకొని నవభారతి కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీలో బీఎడ్ పూర్తి చేశారు. తర్వాత శాతవాహన యూనివర్సిటీలో ఎమ్మే చేశారు. ఇలా ఆమె ప్రతి కష్టం ఒక పాఠంగా మారింది. ప్రతి బాధ ఒక పుస్తకంగా మారింది.
ఆశల నుంచి ఆవేదన వరకు 1991లో ఆమె వివాహం జరిగింది.
మొదట ప్రేమగా కనిపించిన జీవితం, తర్వాత నరకంగా మారింది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అవమానాలు, బాధలు ఎన్ని ఎదురైనా తలవంచలేదు. వాటన్నింటినీ మైలురాయిగా మలుచుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకు బలం ఇచ్చిన రూపం ఆమె కొడుకు శరణ్ తేజ. కొడుకే ఆమె శ్వాస, కొడుకే ఆమె ధైర్యం. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన అతడు అమ్మను ఆదర్శంగా తీసుకుని తన కాళ్లపై తాను నిలబడాలి అనే ఆలోచనతో ఎంటెక్ పూర్తి చేసి సివిల్ ఇంజనీర్‌గా, ఏఈ ఉద్యోగం సాధించాడు. ఆ తల్లి జీవితంలో గర్వంగా నిలిచిన క్షణమది.
ఉద్యోగ జీవితం – సేవే ధర్మం
1987లో 398 రూపాయల జీతంతో స్పెషల్ టీచర్‌గా ప్రారంభమైన ఆమె ప్రయాణం నేటికీ కొనసాగుతూనే వుంది. తర్వాత సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందారు. ప్రస్తుతం జెడ్.పి.హెచ్.ఎస్.వెల్ది పాఠశాలలో పని చేస్తున్నారు. పిల్లలను చదివించడం ఆమెకు ఉద్యోగం కాదు అది ఆమె జీవన ధర్మం. మనసున్న గురువుగా
పేద పిల్లలకు చేయూతనందిస్తూ ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తున్నారు. అలాగే వికలాంగులు, అనాథలకు చేతనైన సహాయం సహాయం అందిస్తున్నారు. వద్ధాశ్రమాలకు సేవ చేస్తున్నారు. ఇలా తన బాధలను సమాజానికి వెలుగుగా మార్చారు.
సాహితీ ప్రస్థానం
ఆమె హదయ భావనలు కవితలుగా, పాటలుగా మారాయి. సిరిసిల్ల సాహితీ సమితి, ఉదయ సాహితీ సమితి, రవీంద్రభారతిలో ఆమె కవితలకు మంచి గుర్తింపు లభించింది. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి సాహిత్య గౌరవం అందుకున్నారు. అలాగే తన పాటలు, కవితలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారు. అలాగే ఆమె కృషికి గుర్తుగా
సావిత్రిబాయి ఫూలే అవార్డు రెండు సార్లు అందుకున్నారు. ఇంకా ప్రోగ్రామ్‌లో ఎంపికై, ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. అలాగే మండలం, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఆమెకు వరించాయి. దినోత్సవ సన్మానాలు ప్రతి సంవత్సరం వికలాంగుల దినోత్సవం సందర్భంగా అనేక పురస్కారాలు అందుకుంటున్నారు. అలాగే ఉత్తమ మహిళా అవార్డులు కూడా పొందారు.
ఎందరికో ప్రేరణ
31 మార్చి 2026న ఆమె తన ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందారు. కానీ ఆమె సేవలు ఎప్పటికీ ఆగవు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాలు ఆమెను కూల్చలేకపోయాయి అవే ఆమెను మరింత గట్టిగా తీర్చిదిద్దాయి. ”పరిస్థితులు ఎలా ఉన్నా… మనసు బలంగా ఉంటే గెలవొచ్చు”, ”బాధలు వచ్చినా… లక్ష్యం వదలకూడదు”,
”మనం ఎదిగితే… సమాజాన్ని కూడా తీసుకెళ్లాలి”, చీకటి ఎంత గాఢంగా ఉన్నా… ఒక చిన్న దీపం చాలు దాన్ని చీల్చడానికి. ఇది శంకరమ్మ జీవితం. చిన్న సమస్యలకు భయపడి జీవితాన్ని వదిలేయాలనుకునే ప్రతి ఒక్కరికీ…
ఆమె జీవితం ఒక గొప్ప ప్రేరణ.
– బోనాసి రేణుక



