Sunday, May 3, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పెండ్లికెందుకు తొందరా

పెండ్లికెందుకు తొందరా

- Advertisement -

చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లకి పెండ్లి చేస్తే తమ భారం తీరిపోతుందనుకుంటారు. ఇలాంటి ఆలోచనలతో అభం శుభం తెలియని మైనార్టీ తీరని అమ్మాయిలకు పెండ్లి చేసి మూడు ముళ్ల బంధంలో బంధిస్తున్నారు. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వారికి చదువుకునే స్వేచ్ఛను ఇచ్చి, ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తే వాళ్ల కాళ్లపై వారు నిలబడతారు. ఆ తర్వాత పెండ్లి చేస్తే ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకునే ధైర్యం వాళ్లకు ఉంటుంది. అలా కాకుండా చిన్న వయసులోనే పెండ్లి చేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే అలాంటి సమస్యతోనే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌) మీ ముందుకు వచ్చింది.

రాజయ్యకు 50 ఏండ్లు ఉంటాయి. అతని భార్య మంగమ్మకు 45 ఏండ్లు. వీరికి ఇద్దరు పిల్లలు. పాప శిరీషకు 16 ఏండ్లు. బాబు నిఖిల్‌కు 14 ఏండ్లు. వారు చిన్న పల్లెటూరులో వుంటారు. అక్కడ ఉపాధి లేకపోవడంతో మూడేండ్ల కిందట ఊరు వదిలి బెంగుళూరు వెళ్లి అక్కడ పని చేసుకుంటున్నారు. వున్నంతలో ఆ కుటుంబం సంతోషంగానే ఉంది. శిరీష 10వ తరగతి వరకు చదువుతుంది. ఆ తర్వాత మానేసింది. నిఖిల్‌ చదువుకుంటున్నాడు. మంగమ్మ అన్న కొడుకు దీపక్‌కు 28 ఏండ్లు ఉంటాయి. అతనికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ అతనికి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే అతను ఏ పనీ చేయడు. పైగా ఎప్పుడూ ఎవరితో ఒకరితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటాడు. ఇప్పటికే అతనిపై రెండు పోలీస్‌ కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీపక్‌ తల్లిదండ్రులు రాజయ్య కుటుంబాన్ని ఒప్పించి శిరీషకు ఇచ్చి పెండ్లి చేశారు. వాళ్ల పెండ్లి జరిగి నాలుగు నెలలు అవుతుంది. పెండ్లయిన మూడో రోజు నుండే శిరీషకు కష్టాలు మొదలయ్యాయి. ఆమె తల్లిదండ్రులను ఇంటికి రానిచ్చేవారు కాదు. కనీసం మాట్లాడనిచ్చేవారు కాదు. శిరీషను మానసికంగా, శరీరకంగా హింసించడం మొదలుపెట్టారు.

‘నీకు ఏ పనీ రాదు, కనీసం వంట చేయడం కూడా రాదు. మేమే నీకు చేసి పెట్టాలి. నిన్ను పెండ్లి చేసుకుంది ఎందుకు? ఇంటిపని, వంటపని చెయ్యడానికే. పెండ్లిలో బంగారం తక్కువ ఇచ్చారు. కట్నం కూడా పెద్దగా ఇవ్వలేదు. ఏ పనీ రాని ఆడదాన్ని పెండ్లి చేసుకొని కుటుంబం మొత్తం బాధపడుతున్నాం’ అంటూ ప్రతి రోజూ శిరీషను మానసికంగా హింసించేవాళ్లు. కూతురు కష్టాలు చూడలేక ‘మా అమ్మాయిని నాలుగు రోజులు మా ఇంటికి పంపించండి’ అంటే కూడా పంపించే వాళ్లు కాదు. ‘ఒకసారి పెండ్లి చేసి పంపించారంటే, ఇక అమ్మాయితో మీకు ఎలాంటి సంబంధం లేదు. మేమెందుకు పంపిస్తాం, ఫోన్‌ చేయడానికి కూడా వీల్లేదు. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’ అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాజయ్య ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి ‘మా అమ్మాయి వద్దంటున్నా కూడా వినకుండా పెండ్లి చేశాము. తెలియని వాళ్లకిచ్చి పెండ్లి చేసే తన జీవితం ఎలా ఉంటుందో అని తెలిసిన సంబంధం, పైగా నా భార్య అన్న కొడుకే కదా అని చేసుకున్నాం. ఇప్పుడు వాళ్లు ‘మీ అమ్మాయికి ఏ పనీ రాదు’ అంటూ సూటిపోటి మాటలతో హింసిస్తున్నారు. మా దగ్గరకు పంపమంటే పంపించరు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదు. ఎప్పుడో మా పెండ్లి అయిన కొత్తలో అంటే దీపక్‌ పుట్టినప్పుడు మా రెండు కుటుంబాలకు గొడవ జరిగింది. అప్పటి నుండి నా భార్య వాళ్ల ఇంటికి వెళ్లడం లేదు. వాళ్లూ మా ఇంటికి రావడం లేదు. మా అత్తయ్య చనిపోయినప్పటి నుండే మేము మాట్లాడుకుంటున్నాం. దీపక్‌ తల్లిదండ్రులు అప్పటి గొడవ మనసులో పెట్టుకొని నా కూతురిని హింసిస్తున్నారని నాకు అనిపిస్తుంది. అక్కడే వుంటే నా కూతురు నాకు దక్కదు. మీరే ఎలాగైనా మాకు సాయం చేయండి’ అన్నాడు.

అసలు అంత చిన్న వయసులో పెండ్లెందుకు చేశారు. శిరీష మైనర్‌ కదా అప్పుడే పెండ్లి చేయాల్సిన అవసరం ఏంటీ? మీ అమ్మాయికి మంచి జీవితం ఇవ్వాల్సిన మీరే ఆమె జీవితం నాశనం చేశారు అని, దీపక్‌ నెంబర్‌ తీసుకొని ఫోన్‌ చేస్తామని చెప్పాము. ‘మేము ఉండేది బెంగుళూరు, వాళ్లు ఉండేది ఆంధ్రప్రదేశ్‌ మేడం. మీరు ఫోన్‌ చేసినా లెటర్‌ పంపించినా నా కూతురిని ఇంకా హింసిస్తారేమో అని భయంగా ఉంది. మేము ఇక్కడి నుండి అక్కడకు వెళ్లడానికి కనీసం 10, 12 గంటలు పడుతుంది’ అన్నాడు రాజయ్య.

అతని భయాన్ని అర్థం చేసుకొని ‘అయితే మీరూ మీ భార్య కలిసి శిరీష వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడండి. మీరు అక్కడికి వెళితే అసలు విషయాలు ఏంటో మీకూ తెలుస్తాయి. ముందు మీ అమ్మాయితో మాట్లాడి తర్వాత దీపక్‌తో, అతని తల్లిదండ్రులతో కూడా మాట్లాడండి. పెండ్లి చేసినంత మాత్రానా మీ అమ్మాయి మీకు కాకుండా పోతుందా? వాళ్లు వినకపోతే అప్పుడు పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేయండి. పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తారు. మేము కూడా పోలీసులతో మాట్లాడతాము. శిరీష తనకు అక్కడ ఇబ్బందిగా ఉందని, ఉండలేక పోతున్నానంటే పోలీసులే మీతో పంపిస్తారు’ అని చెప్పి పంపించాము. హాయిగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులో అమ్మాయికి పెండ్లి చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. అరదుకే ఆడపిల్లకు పెండ్లి చేసే ముందు వందసార్లు ఆలోచించాలి. తన కాళ్లపై తాను నిలబడి ఏది మంచీ ఏది చెడు అనేది అర్థం చేసుకొనే మానసిక స్థితి వచ్చిందా లేదా అనేది చూడకుండా పెండ్లి చేసే ప్రతి తల్లిదండ్రులు శిరీష జీవితం గురించి ఒక్కసారి ఆలోచించాలి.

‘మీ అమ్మాయికి ఏ పనీ రాదు’ అంటూ సూటిపోటి మాటలతో హింసిస్తున్నారు. మా దగ్గరకు పంపమంటే పంపించరు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదు. ఎప్పుడో మా పెండ్లి అయిన కొత్తలో అంటే దీపక్‌ పుట్టినప్పుడు మా రెండు కుటుంబాలకు గొడవ జరిగింది.

అతను ఏ పనీ చేయడు. పైగా ఎప్పుడూ ఎవరితో ఒకరితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటాడు. ఇప్పటికే అతనిపై రెండు పోలీస్‌ కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీపక్‌ తల్లిదండ్రులు రాజయ్య కుటుంబాన్ని ఒప్పించి శిరీషకు ఇచ్చి పెండ్లి చేశారు. వాళ్ల పెండ్లి జరిగి నాలుగు నెలలు అవుతుంది. పెండ్లయిన మూడో రోజు నుండే శిరీషకు కష్టాలు మొదలయ్యాయి.

వై వరలక్ష్మి, 9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -