Monday, May 25, 2026
E-PAPER
Homeమానవిప్రసవానంతరం

ప్రసవానంతరం

- Advertisement -

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో రకాల మార్పులు కనిపిస్తుంటాయి. బరువు తగ్గడం లేదా పెరగడం, మూడ్​స్వింగ్స్ వంటివి చాలామందిలో కనిపించడం సహజం. అయితే, కొంతమంది వీటి మాదిరిగానే కొన్ని ఇతర లక్షణాలు, సమస్యల్ని సర్వసాధారణమే అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే బాలింతల్లో ఈ సమస్యలు, లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయవద్దని, వెంటనే డాక్టర్​ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటో..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు మానవిలో తెలుసుకుందాం…

బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో శరీరం శక్తిని కోల్పోయి నీరసించి పోతుంది. ఆ తర్వాత ఐదారు వారాల పాటు ఈ నీరసం, అలసట అలాగే ఉంటుంది. ప్రసవానంతరం తీసుకునే ఆహారం, విశ్రాంతితో ఈ సమస్య క్రమంగా దూరమవుతుంది. కానీ, కొంతమందిలో ఈ లక్షణాలు వారాల తరబడి అలాగే వేధిస్తుంటాయి. అయితే, ప్రసవం తర్వాత ఆరువారాలు దాటినా, చక్కగా విశ్రాంతి తీసుకున్నా, శరీరంలో అలసట, నీరసం కనిపిస్తే అది ఎనీమియా, థైరాయిడ్, విటమిన్ లోపం వల్ల అయి ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్​ని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే, ఇటు తల్లికి, అటు బిడ్డకూ మంచిదని సూచిస్తున్నారు. అకస్మాత్తుగా చాలా అలసిపోయి, నీరసంగా ఉండటం, ఇది దీర్ఘకాలిక అలసట లాంటిది కాదని నిపుణులు చెబుతున్నారు.

రక్త స్రావం ఆగట్లేదా
నార్మల్ లేదా సిజేరియన్ డెలివరీ అయినా తర్వాత కూడా బ్లీడింగ్ సహజమే. అయితే క్రమంగా తగ్గుతూ కొన్ని వారాల తర్వాత ఆగిపోతుంది. అయితే, కొందరిలో ఇది వారాల తరబడి కొనసాగుతూనే ఉంటుందట. ఇంకొంతమందిలో గడ్డల మాదిరిగా రక్తస్రావం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయద్దంటున్నారు. ముఖ్యంగా, ఆరు వారాల తర్వాత కూడా బ్లీడింగ్, స్పాటింగ్ కనిపిస్తే అది ఇన్ఫెక్షన్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలకు సూచన కావచ్చు. కాబట్టి డాక్టర్​ని సంప్రదించి అసలు సమస్య ఏంటో తెలుసుకొని త్వరితగతిన చికిత్స తీసుకోవడం మంచిది. అధిక రక్తస్రావం, రక్తపోటు, గుండె వైఫల్యం, రక్తపు గడ్డలు, డిప్రెషన్ ప్రసవానంతర సమస్యలు తీవ్రమైన అనారోగ్యానికి లేదా మరణానికి కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు.

మూత్రం మంటగా…
డెలివరీ తర్వాత కొంతమందిలో మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంట రావడం, మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లు మాములే. అయితే, కోలుకునే కొద్దీ ఇవి తగ్గిపోవడానికి బదులు తీవ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ ప్రసవం, ఈ సమయంలో ఉపయోగించే క్యాథెటర్ వల్ల మూత్రాశయానికి గాయమవడం వంటివీ మూత్ర విసర్జన సమయంలో మంట తగ్గకపోవడానికి కారణాలుగా పేర్కొంటున్నారు. కాబట్టి, రోజులు గడిచే కొద్దీ మంట తీవ్రమైతే డాక్టర్​ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కొంతమందిలో ప్రసవం తర్వాత తుమ్మినా, దగ్గినా మూత్రం పడుతుంటుంది. డెలివరీ టైంలో కటి వలయపు కండరాలు బలహీన పడడం వల్ల ఇలా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే, కటి వలయపు కండరాల్ని తిరిగి దృఢంగా చేసుకోవడం ముఖ్యమంటున్నారు. ఇందుకోసం డాక్టర్ సమక్షంలో ఫిజియోథెరపీ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

నొప్పులు తగ్గకపోతే
ప్రసవం తర్వాత ఒంటి నొప్పులూ సర్వ సాధారణమే! అయితే, కోలుకునే కొద్దీ ఇవి తగ్గిపోతాయి. అలాకాకుండా నెలల తరబడి నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, కటి భాగంలో నొప్పి కొనసాగితే నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రసవం వల్ల కోర్ కండరాలు బలహీనపడడం, కటి భాగంపై పడే ఒత్తిడి, బిడ్డకు పాలిచ్చే సమయంలో సరైన భంగిమలో కూర్చోకపోవడం వంటివి ఈ నొప్పులు దీర్ఘకాలం పాటు కొనసాగడానికి కారణమవుతాయని చెబుతున్నారు. అందుకే, ఆలస్యం చేయకుండా డాక్టర్​ని సంప్రదించి ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు తీసుకోవడం మంచిదంటున్నారు.

ఒత్తిడి కొనసాగితే…
డెలివరీ తర్వాత హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గుల వల్ల మూడ్​స్వింగ్స్ వస్తుంటాయి. ఫలితంగా డల్​గా కనిపించడం, కోపం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే రోజులు గడిచే కొద్ది ఇవి క్రమంగా దూరమవుతుంటాయి. అలాకాకుండా ఈ ఒత్తిడి దీర్ఘకాలం పాటు కొనసాగితే అది పోస్ట్​పార్టమ్ డిప్రెషన్​గా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి దీనివల్ల తల్లిపైనే కాదు, బిడ్డ ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, డాక్టర్లు సహాయం తీసుకుంటూ, ఈ సమస్య నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని సూచిస్తున్నారు.
ఇలా ఈ సమస్యలు, లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకుండా చక్కటి పోషకాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే, కొన్ని వారాలు గడిచాక డాక్టర్ సలహా మేరకు చిన్నపాటి వ్యాయామాల్ని రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకుంటే, ప్రసవానంతర సమయాన్ని పూర్తిగా ఆస్వాదించచ్చని సలహా ఇస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -