గత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వివాదాలు, విద్వేష దూషణలూ పరాకాష్టకు చేరాయి. అధికారంలో వున్న, కోల్పోయిన పాలక పార్టీల కీలక నేతలు, మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రులే గాక కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వ మంత్రులు కూడా ఈ వివాదాలకు ప్రత్యక్ష, పరోక్ష కారకులు కావడం విశేషం. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌లో సభకు హాజరై ఏపీ ముఖ్యమంత్రినీ, ఉప ముఖ్య మంత్రినీ కలిసి వెళ్లిన వెనువెంటనే ఈ పరిస్థితి రావడం యాదృచ్చికం కాదు. ఈ వివాదాలలో బయటి పరిణామాలు మాత్రమే గాక పాలకపార్టీలు అంతర్గతంగానూ మల్లగుల్లాలు పడవలసిన పరిస్థితి మరింత ప్రాధాన్యత కలిగింది.ఈ క్రమంలో పదవులు,ఉద్వాసనలూ, పొత్తులూ, ఎత్తులూ అన్నిటిపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రూ.వేలకోట్ల విలువైన ప్రజాధనంతో నడిచే నిర్మాణాలూ, ప్రాజెక్టులూ, కేటాయింపులు కూడా సందేహాలకు గురవుతువున్నాయి. ప్రస్తుత మీడియా స్వభావరీత్యానే ఈ విధమైన మౌలిక సమస్యలు వదిలేసి పరస్పర వివాదాలు పార్టీల తగాదాలకు పెద్దపీట వేస్తుంటే నిజమైన సమస్యలపై కేంద్రీకరణ, ప్రజల ఆస్తుల రక్షణ, ప్రజాస్వామ్య లౌకిక విలువల పరిరక్షణ వంటి అంశాలు వెనక్కుపోతున్నాయి.
బీజేపీ ఇరకాటం, బీఆర్‌ఎస్ దాడి
ప్రధానమంత్రి సభ నాటికే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసుపై తెలంగాణ రగిలిపోతున్నది. చాలాకాలం కిందటే తలిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు త్వరీతంగా రంగంలోకి దిగలేదు. పైగా సదరు మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని సభలోనే పాల్గొనగలిగారు. ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీ సభలోనైతే సంజయ్ మాట్లాడుతూ తన కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయని ఎదురుదాడి కూడా చేశారు.అప్పటికే పోక్సో కేసుపై అలజడి పెరగడంతో రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలిచ్చినట్టు వార్త ప్రసారమైంది. ప్రధాని పర్యటన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైన కారణంగా ఈ కేసుపై దృష్టి పెట్టలేకపోయామని డిజిపి వివరణ ఇచ్చారు. అయితే తర్వాత కూడా రెండు మూడు రోజుల దాకా ఏ చర్య లేదు సరికదా కేంద్రమంత్రి ఏక్తాయాత్ర అంటూ జరిపి అక్కడ జైశ్రీరాం నినాదాల మధ్య తనను తాను సమర్థించుకుంటూ విమర్శకులకు హెచ్చరికలు చేశారు. భక్తి పేరిట జరిపిన యాత్రలో పోక్సో కేసు సమర్థనలతో మాట్లాడటం బీజేపీ అభిమానులే జీర్ణించు కోలేకపోయిన పరిస్థితి. ఇదే సమయంలో అతన్ని ముఖ్యమంత్రి ఇంట్లోనే దాచి వుంచారని బీఆర్‌ఎస్ నాయకులొకరు ఆందోళన చేయబోయి అరెస్టయ్యారు. ఈ ఘటనలో బాధితురాలు మైనర్ కాదంటూ విపరీతంగా పోస్టులు ట్రోల్స్ గుప్పించారు.
కొందరు మహిళా యూట్యూబర్లతో సహా సోషల్‌మీడియా, కొన్ని ఛానళ్లు బండిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాయి. కేసీఆర్ కుటుంబానికి బండి సంజయ్‌కి కూడా స్వంత జిల్లా అయిన కరీంనగర్‌లో దీనిపై రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు హైకోర్టు బెయిల్ నిరాకరించాక గానీ భగీరథ్ అరెస్టు కాలేదు. భగీరథ్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెబుతుంటే తానే అప్పగించానని సంజయ్ చెప్పుకున్నారు. చివరకు ముఖ్యమంత్రి కూడా దీన్ని ఖండించవలసి వచ్చింది. అయితే మైనర్ బాలికకు సంబంధించిన విషయంలో తాము జాగ్రత్త తీసుకుంటే బీఆర్‌ఎస్ మాత్రం ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిం చినట్టు రాజకీయ స్వార్థంతో దాడి చేస్తున్నదని కూడా ముఖ్యమంత్రి విమర్శించారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌కే సంబంధాలున్నాయని, అందుకే కాళేశ్వరం తప్పులపై ఎలాంటి చర్యకు సిద్ధం కాలేదని కాంగ్రెస్ ఆరోపణ. కాంగ్రెస్ కావాలనే కేసీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలను పక్కనపెట్టి వేరే వాటిపై విచారణ తతంగాలు జరుపుతున్నదని బీజేపీ ఎదురుదాడి. ప్రధాని పర్యటనలో ముఖ్యమంత్రిని మాతో కలవండని పిలుపునివ్వడంపైనా చాలా చర్చలు నడిచాయి. బీఆర్‌ఎస్ తీవ్రమైన కుమ్మక్కు ఆరోపణలు చేస్తుంటే ముఖ్యమంత్రి తేలిగ్గా తోసిపుచ్చారు. మొన్నటి దఫా ఎన్నికల తర్వాత తెలంగాణ తమ టార్గెట్ అంటూ హడావుడి చేస్తున్న బీజేపీకి బండి సంజయ్ వివాదం నష్టదాయకమని, ఆయన్ను పదవినుంచి తప్పించాలని ఆ పార్టీలోనే ముసలం పుట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు తప్ప ప్రముఖ నేతలెవరూ దీనిపై పెద్దగా స్పందించడం లేదు. ఆయన్ను ఢిల్లీ పిలిపించి మరీ చర్చలు జరపడంతో తొలగింపు కథనాలకు బలమొచ్చింది.
రేవంత్ వ్యూహాలు
బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గతంలో చేసినట్టు రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతలతో టచ్‌లో వుండొచ్చని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెలవిచ్చారు. బీఆర్‌ఎస్ ఏపీలో వైసీపీ నేత జగన్‌తో కలసి పనిచేస్తున్నదని ఒకవైపు, రేవంత్ రెడ్డి గత సంబంధాలను బట్టి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరోవైపు కథనాలు సాగుతూనే వున్నాయి. బీజేపీ- ఆరెస్సెస్‌ల మత రాజకీయాలు, ఇటీవల మళ్లీ కాంగ్రెస్‌కు చేరువైన మజ్లిస్ నేతల మత పాచికలు తరచూ ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నిటి మధ్యనా కార్మికుల పోరాటాలు, విద్యా వైద్య సమస్యలు పేరుకుపోయిన బకాయిలు వంటివి తెరమరుగై పోతున్నాయి. రాజధాని శివార్లలో మంచిరేవుల, మహేశ్వరం వంటి చోట్ల భూమి స్కాములు జరిగాయనే పోటాపోటీ కథనాల మధ్య తాజాగా ఈ.డి కూడా ఒక విచారణ చేపట్టింది. అధికార పార్టీలో విభేదాల కథలు షరామామూలే. అడపాదడపా ప్రకటనలు మినహాయిస్తే కాంగ్రెస్ తన ప్రధాన జాతీయ ప్రత్యర్థి అయిన బీజేపీ మత రాజకీయాలపై,కేంద్రం పెత్తనంపై గట్టిగా కార్యక్రమాలు తీసుకున్నది నామమాత్రమే. 2034 వరకూ అంటే వచ్చే ఎన్నికల తర్వాత మరో దఫా తనే అధికారం చేపట్టి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి పోతానన్నది రేవంత్ మాట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు మకాం మార్చి మళ్లీ లోటస్‌పాండ్‌కు రానున్నారనే వార్తలు కూడా దీంతో పాటే వినిపిస్తున్నాయి. సన్నిహితులుగా పేరున్న కొంతమంది మంత్రులతో సంబంధాలు నెరపడమే గాక సమీకరణలకు తోడవుతున్నారనేది ఆయనపై పరిశీలకుల వ్యాఖ్య.
అమరావతిపై అదే దాడి
కూటమి పాలనలోని ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల భారం, నిధుల కొరత వెన్నాడుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో కొంత కదలిక వున్నా సమస్యలు సవాళ్లు చాలానే వుంటున్నాయి. ఏదో ఒక విధంగా ఈసారి దాన్ని పూర్తి చేయకపోతే ప్రజలు సహించరనే ఒత్తిడి ప్రభుత్వంపై బాగా పనిచేస్తున్నా బయటనుంచి స్పందన పరిమితమే. స్యయం పోషిత రాజధాని అంటున్నా ఇప్పటి వరకూ సర్కారు చేసిన కేటాయింపుల తప్ప భారీగా పెట్టుబడులు వచ్చిందేమీ లేదు. ఇటీవలి కాలంలో వరుసగా సింగపూర్ పర్యటనలు జరుపుతుండటం కూడా మరోసారి వారి జోక్యం పెరిగిన సూచనలిస్తున్నది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తమ పార్టీ సమావేశంలో ‘జై అమరావతి బడులు జై ఆంధ్ర’ అనాలని పిలుపునివ్వడం చర్చకు దారితీసింది. మొత్తం దృష్టి ఒకచోటనే పెట్టకుండా వికేంద్రీకరణ జరగాలనే వాదనకు దీనివల్ల బలం చేకూరినట్టయింది.కేంద్రం తరపున ఎలాటి ఆర్థిక సహాయం చేయని బీజేపీ కూడా రాజధానిపై పెద్ద ఆసక్తి చూపడం లేదు. కూటమిలో మిగిలిన పార్టీలు ఈ విషయంలో ఎడంగా వుండటం టీడీపీకి సమస్యగా వుందని హిందూ పత్రిక వ్యాఖ్యానించింది.అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ తాడూ బొంగరం లేని మావిగాన్ ప్రతిపాదనను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. గత తప్పిదాన్ని సవరించుకుని వాస్తవికంగా అమరావతి సంపూర్తి చేయడానికి నిర్మాణాత్మక సూచనలు చేసే బదులు జగన్ అధికబిల్లులు చెల్లింపు, అనవసర వ్యయం వంటి ఆరోపణలపైనే నిరతరం మాట్లాడుతున్నారు. మొన్నటి మీడియా గోష్టిలో మరో అడుగు ముందు కేసి మావిగన్ అంటే ముఖ్యమంత్రికి గుండెపోటు వస్తుందని అనవసర ప్రస్తావనలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా ఇందుకు సంబంధించిన సంఖ్యా వివరాలు, పదేళ్ల పరిణామాలు సమగ్రంగా సమీక్షా పూర్వకంగా చెబుతున్నారా అంటే అదీ లేదు.
కొత్త వివాదాలు, కేసులు
ఏపీలో ప్రాంతాల సమతుల్యత,పాలనా వికేంద్రీకరణ, సామాజిక న్యాయం తప్పనిసరి అవసరమే గానీ కులాల వారీ సమీకరణలు పెరగడం మాత్రం సరైంది కాదు. తమది గన్ కల్చర్ అంటున్న టీడీపీకి సమాధానంగా తన కుటుంబ సభ్యుల హత్యలను మరణాలను జగన్ ప్రస్తావించడం కొత్త చర్చకు దారితీసింది. తాత రాజారెడ్డి హత్య,వైఎస్ ప్రమాద మరణం, బాబాయి వివేకానందరెడ్డి హత్యలను అధికారంలో వున్నప్పుడు సమగ్రంగా విచారించకుండా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు ముందుకు తెచ్చారనే ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తున్నది. నిజానికిది జగన్ సెల్ప్‌గోల్ అనే మాట వినిపిస్తున్నది. దీనికి తగినట్టే టీడీపీ అనుకూల మీడియా ఆనాడు రాజారెడ్డి హత్యలో శిక్షలు పడిన దాడికి గురైన వారిని ముందుకుతెచ్చింది. జగన్ నరరూప రాక్షసు లంటూ, రక్తం తాగుతారంటూ తీవ్రభాషలో కథనాలు ఫోకస్ చేయడం అభద్రత పెంచడానికే దారితీస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కూటమిలో ఇక్కడ జూనియర్ భాగస్వామి అయినా దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి వీటిని అవకాశంగా తీసుకుని మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం తీవ్రం చేస్తున్నది. రఘురామకృష్ణం రాజు వంటివారి వల్ల చిచ్చు రాజుకున్న ఆకివీడులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ దాని ఆధారంగా ప్రశాంతత తీసుకొచ్చే చొరవ ప్రభుత్వం చూపడం లేదు. తాము పదిహేనేళ్లు కూటమిగా వుంటామని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ బీజేపీ నుంచి ఆ విధమైన వ్యాఖ్యలేమీ లేవు. వైసీపీ, టీడీపీ, జనసేనలతో సంబంధాల గురించి కేంద్ర బీజేపీ నేతలు వ్యాఖ్యల పేరిట తాజాగా కొత్త దుమారం చెలరేగింది. చివరకు ఆ విషయం చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ వాటిని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించినా ఆయనపై కేసులు కొనసాగడమే గాక అరెస్టు చేస్తారనే ఊహగానాలు కూడా వినిపిస్తు న్నాయి. ప్రాంతీయ పార్టీలతో బీజేపీ చదరంగం చెలగాటం తెలిసిందే. నిజానికి మాజీ, ప్రస్తుత వైసీపీ నేతలపై ఈ కాలంలో ఈడీ దాడులు కూడా జరిగాయి. గనక ఈ విషయంలో ఎవరూ తుదిమాట చెప్పలేరు. ఏమైనా మీడియా వ్యాఖ్యలపై ఖండనలు, ప్రకటనలు చేయొచ్చుగాని అరెస్టులు కేసులు మాత్రం అవాంచనీయం. ఎవరి రాజకీయాలేమైనప్పటికీ వ్యర్థ వివాదాలను విడనాడి ప్రజా ప్రయోజనాల కోసం ఉమ్మడిగా దృష్టి పెట్టడమే శ్రేయస్కరం.
తెలకపల్లి రవి



