Saturday, May 2, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సెలవుకి వచ్చిన జవాన్‌కే ‘మంకీ వార్’…

సెలవుకి వచ్చిన జవాన్‌కే ‘మంకీ వార్’…

- Advertisement -

బొప్పరం గ్రామంలో కోతుల రాజ్యం!
దిన దినం భయం భయంతో బతుకుతున్న గ్రామ ప్రజలు..
సర్పంచ్ హామీలు గాలి మాటలేనా…?

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పరం గ్రామం… పేరు వినగానే శాంతి, పల్లె వాతావరణం గుర్తొస్తుంది. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం “వన్యప్రాణి సఫారి”లా మారిపోయింది. గ్రామంలో కోతుల ‘స్వతంత్ర రాజ్యం’ నడుస్తుండగా, ప్రజలు మాత్రం దిన దినం భయం భయంగా రోజులు గడుపుతున్నారు.
ఇటీవల సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఓ జవాన్‌పైనే కోతుల గ్యాంగ్ దాడి చేయడం గ్రామంలో హాట్ టాపిక్ అయింది. దేశ సరిహద్దుల్లో శత్రువులను ఎదుర్కొనే జవాన్… స్వగ్రామానికి రాగానే “మంకీ బ్యాటాలియన్”ను ఎదుర్కోవాల్సి రావడం పరిస్థితి ఎంత దయనీయమో చెప్పకనే చెబుతోంది.

గ్రామస్తుల మాటల్లో చెప్పాలంటే…
“ఇక్కడ మేము మనుషులమేనా? లేక కోతుల గెస్ట్‌లమా?” అన్న సందేహం మొదలైంది. ఉదయం లేవగానే అన్నం పెట్టుకోవడం కాదు… ముందుగా కోతుల దాడి నుంచి ఇంటిని రక్షించుకోవడం ప్రధాన పని అయిపోయింది. కూరగాయల బుట్టల నుంచి బట్టల దాకా ఏదీ సేఫ్ కాదు. పిల్లలు స్కూల్‌కు వెళ్లడం కూడా ‘మిషన్ ఇంపాజిబుల్’గా మారింది.

సర్పంచ్ మాటలు గాలి మాటలేనా…?
ఇక ఎన్నికల సమయంలో “కోతుల బెడతకు చెక్ పెడతాం” అని గట్టిగా హామీ ఇచ్చిన సర్పంచ్ గారి మాటలు ఇప్పుడు గ్రామంలో గాలి మాటలేనా అని ప్రజలు అనుకుంటున్నారు . “అప్పుడు కోతులు పారిపోతాయన్నారు… ఇప్పుడు మేమే పారిపోవాలా?” అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
కొంతమంది యువకులు అయితే కోతుల్ని తరిమేందుకు కొత్త కొత్త ఐడియాలు కూడా ట్రై చేస్తున్నారు—డప్పులు కొట్టడం, ప్లాస్టిక్ బాటిల్స్ ఊపడం, మొబైల్‌లో సింహం గర్జన సౌండ్స్ పెట్టడం… కానీ కోతులు మాత్రం “ఇది మా ఏరియా బాస్!” అన్నట్లుగా కదలిక కూడా చూపడం లేదు.
గ్రామ పెద్దలు చెబుతున్నది ఒక్కటే— “ఇంకా ఆలస్యం చేస్తే బొప్పరం పేరు ‘కోతులపురం’గా మారిపోతుంది!”
ప్రస్తుతం గ్రామస్తుల డిమాండ్ స్పష్టంగా ఉంది: పంచాయతీ పాలక వర్గం వెంటనే స్పందించి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. లేకపోతే… వచ్చే ఎన్నికల్లో “కోతులే ఓటు వేస్తాయి, కోతులే గెలుస్తాయి” అనే పరిస్థితి దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -