Thursday, April 30, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మేడే స్ఫూర్తితో

మేడే స్ఫూర్తితో

- Advertisement -

ప్రపంచ కార్మికోద్యమానికి ప్రతీకగా ప్రతి ఏడాది మే 1న కార్మిక దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. 1886 మే 4న చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం సమ్మె చేస్తుండగా, పోలీసుల కాల్పుల్లో నలుగురు కార్మికులు మరణించారు. 1904లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు సభల్లో 8 గంటల పనిదినం కోసం మే 1న పని నిలిపివేసి నిరసన ప్రదర్శనలు జరపాలని తీర్మానించారు. అలా వివిధ దేశాల్లో మే1న కార్మికులు తమ సమస్యలపై స్పందిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అటువంటి గొప్ప పోరాటంలో మహిళల పాత్ర కూడా కీలకమైనది. ఆనాడు జరిగిన ప్రతి పోరాటంలో మహిళలు కూడా ప్రాధాన పాత్ర పోషించారు. ఎన్నో హక్కులు సాధించుకున్నారు.

ప్రపంచాన్ని బతికించడానికి సూర్య చంద్రులు కార్మికుల్లా పనిచేస్తుంటే, ప్రపంచాన్ని నడిపించడానికి కోట్లాదిమంది కార్మికులు సూర్యచంద్రుల్లా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితాన్ని ఆశించడం ప్రతి ఒక్కరి హక్కు. ఒకప్పుడు మాత్రం అది నేరం. ఎవరైనా ప్రశ్నిస్తే విప్లవకారుడన్న ముద్ర వేసి జైల్లో తోసేవారు. 19వ శతాబ్దం చివరి వరకూ పరిస్థితులు అలానే కొనసాగాయి. ఆరోగ్యాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ పణంగా పెట్టి రోజుకు పన్నెండు గంటలకు పైగా కార్మికులు పని చేసేవారు. ఇక మహిళా కార్మికులకైతే వారి పిల్లలకు పాలిచ్చేందుకు కూడా అనుమతి ఇచ్చేవారు కాదు. అంత దారుణంగా శ్రమ దోపిడీకి గురయ్యేవారు. దశాబ్దాల తరబడి అదే విధానానికి అలవాటు పడ్డ శ్రామికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల అండతో మొదట రష్యాలో ‘ఎనిమిది గంటలు పని’ నినాదాన్ని అందుకున్నారు. అది ఇతర దేశాలకూ పాకింది.

చికాగోలో కార్మికులు మే నెల మొదట్లో యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అప్పుడు జరిగిన గొడవల్లో కొందరు కార్మికులు చనిపోయారు. వారిని స్మరిస్తూ మరుసటి రోజు ఇంకొందరు కవాతు నిర్వహించారు. ఆ సమయంలో ఎవరో ఆగంతకుడు డైనమైట్‌ విసరడంతో కొందరు పోలీసులూ, సామాన్యులూ చనిపోయారు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. పోరాటాలు ఉదృతమయ్యాయి. ఈ పోరాటాల్లో మహిళలు కూడా తమ వంతు పాత్ర పోషించారు. చివరకు ప్రభుత్వాలు దిగొచ్చాయి.

పనివేళలను కుదిస్తూ అమెరికా చట్టాన్ని తీసుకొచ్చింది. తర్వాత మరికొన్ని దేశాలూ అదే బాట పట్టాయి. మేలో జరిగిన చికాగో దుర్ఘటన గొడ్డు చాకిరీ నుంచి విముక్తికి పునాది వేసింది కాబట్టి, మే 1ని ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’గా జరుపుకోవాలని, ఆ రోజు శ్రామికులంతా పనికి విరామమిచ్చి వీధుల్లోకి వచ్చి తమ గొంతు వినిపించాలనీ ప్యారిస్‌లో జరిగిన సోషలిస్టు లేబర్‌ పార్టీల ‘సెకండ్‌ ఇంటర్నేషనల్‌’ సమావేశం నిర్ణయించింది. అదే భారత్‌ సహా అనేక దేశాల్లో ‘మే డే’గా మారింది. మన దేశంలో మేడే సంబరాలు చెన్నై నగరంలో 1923లో జరిగాయి. లేబర్‌ కిసాన్‌ పార్టీ ఆఫ్‌ హిందూస్తాన్‌ ఆధ్వర్యంలో 1923, మే1న సింగరవేలు చెట్టియార్‌ నాయకత్వంలో దేశంలోనే తొలిసారి ఎర్రజెండా ఎగురవేశారు. చాలా దేశాల్లో ప్రజా ఉద్యమాలకు అదే రోజు శ్రీకారం చుడతారు. ఏదేమైనా కార్మికుల శ్రమను గౌరవించినందుకు జరుపుకునే వేడుకే మేడే. అది నేడే.

పనిగంటలపై ఆనాడు జరిగిన పోరాటంలో మహిళలు సైతం పసిపిల్లలను చేతబట్టి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తర్వాత కాలంలో కొన్ని హక్కులు సాధించుకున్నారు. మహిళల హక్కులు మానవ హక్కులలో అంతర్భాగం. ఇవి స్త్రీలకు విద్య, సమాన వేతనం, ఆస్తి హక్కు, హింస లేని గౌరవప్రదమైన జీవితాన్ని కల్పిస్తాయి. భారత రాజ్యాంగం లింగ సమానత్వాన్ని (ఆర్టికల్‌ 14-16) హామీ ఇస్తుండగా, పని ప్రదేశంలో వేధింపుల నిరోధం, ఆస్తి హక్కు, చట్టపరమైన రక్షణలు ప్రధానమైనవి.

మమ్మల్ని పర్మినెంట్‌ చేయండి
నా పేరు రేణుక. నేను సికింద్రాబాద్‌లో ఉంటాను. కాంట్రాక్ట్‌ పద్దతిలో పారిశుధ్య కార్మికురాలిగా గత 11 ఏండ్లుగా చేస్తున్నాను. మాకు జీతాలు పెంచి చాలా ఏండ్లు అయింది. ఏదైనా అవసరం ఉండి డ్యూటీకి రాకపోతే ఆ రోజు జీతం 500 కట్‌ చేస్తారు. పండగ రోజులైనా తప్పక రావాల్సిందే. మాకూ పండగ చేసుకోవాలని ఉంటుంది కదా. మధ్యాహ్నం 1.30 వరకు డ్యూటీ చేసి అప్పుడు ఇంటికి వెళ్లి పండగ చేసుకోవాలంటే ఎట్లా కుదురుతుంది. అప్పటికే సగం రోజు అయిపోతుంది. నేను ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతం ఐదు వేలు. ఇప్పుడు 18 వేలు. ఇఎస్‌ఐ, పీఎఫ్‌ పోను చేతికి 15 వేలు వస్తాయి. పదవ తరగతి వరకు చదువుకున్నాను. గత్యంతరం లేక పిల్లల కోసం ఈ పని చేస్తున్న. నాకు ఒక బాబు డిగ్రీ అయింది, పాప డిగ్రీ చదువుతోంది. నా భర్త వడ్రంగి పనులు చేస్తాడు. కానీ ఒక్క రూపాయి ఇంటి ఖర్చులకు ఇవ్వడు. మాకు కనీసం సి.ఎల్‌ లాంటిది ఉన్న కొంచం వెసులుబాటు ఉండేది. అనారోగ్య సమస్యతో బాధపడుతూ అస్సలు రాలేని స్థితిలో ఉంటేంటే అప్పుడు సిక్‌ లీవ్‌ ఇస్తారు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, మా సమస్యలకు పరిష్కారం చూపండి. మమ్మల్ని పెర్మనెంట్‌ ఉద్యోగస్థులను చేయండి.

సెలవులే వుండవు
నా పేరు ఈ .రాజ్యలక్ష్మి. 30 ఏళ్ల బట్టి జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా కాంట్రాక్ట్‌ బేసిస్‌ మీదనే చేస్తున్నాను. నేను చేరినప్పుడు నా జీతం 900 వందల రూపాయలు. ప్రస్తుతం ఇఎస్‌ఐ, పీఎఫ్‌ పోను చేతికి 14 వేలు వస్తాయి. పండుగలకు సెలవులు ఉండవు, ఒక్క వారాంతపు సెలవు తప్ప. నేను మొదట్లో రాత్రిళ్ళు డ్యూటీ చేసేదాన్ని. రాత్రి పూట డ్యూటీ చేయాలంటే కొంచం భయంగానే ఉండేది, తాగుబోతులు తిరుగుతూ ఉండేవారు. కాకపోతే పోలీసులు గస్తీ తిరుగుతూ ఉండేవారు. కొన్నాళ్ళకు పగటి పూట డ్యూటీ వేశారు. నా ఉద్యోగం పర్మినెంట్‌ అయితే కనీసం పెన్షన్‌ అన్నా వస్తుంది కదా. అదే కనుక ఉంటే వృధాప్యంలో నాకు ఆసరాగా ఉంటుంది. నా భర్త కూడా జీహెచ్‌ఎంసీలోనే చేసేవాడు. ఎనిమిదేండ్ల కిందట చనిపోయాడు. నాకు నలుగురు కొడుకులు, ఒక బిడ్డ. నా పెద్ద కొడుకు ఎమ్మె వరకు చదువుకున్నాడు. అనారోగ్యంతో చనిపోయాడు. పిల్లలు లేనందు వల్ల అతని భార్య మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆడపిల్లకు పెళ్లి చేసాను. మిగతా ముగ్గురు కొడుకులు ఎక్కువ చదవ లేదు, పనులకు వెళ్తే వెళ్తారు, లేకుంటే లేదు. నేను పెద్ద దాన్ని అవుతున్నాను. ఈ వయసులో వాళ్ళను పోషించడం కూడా నాకు కష్టమే. కానీ కన్న బిడ్డలను చూస్తూ వదులుకోలేను కదా! మా ఉద్యోగాలు పర్మనెంట్‌ అవ్వాలని ధర్నాలు కూడా చేసాము. ధర్నాలు చేసిన వాళ్ళను అప్పుడు కొన్నాళ్ళు ఇళ్లల్లో కూర్చోబెట్టారు, మళ్ళీ కొన్నాళ్ళకు తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మా గురించి ఆలోచించి, న్యాయం చేయాలని కోరుకుంటున్న.

మహిళలు సాధించుకున్న హక్కులు
సమానత్వ హక్కు: పురుషులతో సమానంగా రాజ్యాంగపరమైన హక్కులు, అవకాశాలు పొందడం.
ఆస్తి హక్కు: హిందూ వారసత్వ చట్టం ప్రకారం, తండ్రి ఆస్తిలో కుమార్తెలకు కుమారులతో సమాన వాటా ఉంటుంది.
హింస నుండి రక్షణ: గృహ హింస నిరోధక చట్టం (2005), వరకట్న నిషేధ చట్టాల ద్వారా రక్షణ.
పని ప్రదేశంలో రక్షణ: కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం రక్షణ.
జీరో ఎఫ్‌ఐఆర్‌ : నేరం ఎక్కడ జరిగినా, ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసే హక్కు.
గర్భస్రావం చేసుకునే హక్కు: వైద్యపరమైన గర్భస్రావం చట్టం ప్రకారం మహిళలకు తమ శరీరాలపై హక్కు ఉంటుంది.
ఓటు హక్కు – రాజకీయ ప్రాతినిధ్యం: ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు.
ఇలా ఎన్నో హక్కులు సాధించుకున్న మహిళలు నేడు వాటి అమలు కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శ్రామిక మహిళల హక్కులన్నింటినీ నేటి కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తుంది. లేబర్‌ కోట్ల రూపంలో శ్రామికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. అందుకే శ్రామికులంతా మేడే స్ఫూర్తితో తమ హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధం కావాల్సిన అవసరం నేడు ఉంది.

మేడే కేక
చికాగో వీధుల్లో చిందిన నెత్తురు సాక్షిగా
ఎనిమిది గంటల హక్కే ఎర్రజెండా శ్వాసగా
నాడు వెలిగిన స్ఫూర్తి నేడు నీడన పడుతుంటే
నినదించక తప్పదు శ్రమైక జీవి పోరాటమై!
పెట్టుబడి కోరల్లో చిక్కిన చట్టాల సంకెళ్లు
కోడ్ల పేరుతో కుంచించుకుపోయిన బతుకులు
కాంట్రాక్టు గొలుసుల మధ్య నలిగే శ్రమశక్తి
దోపిడీని ఎదిరించే సమరశంఖం పూరించాలి!
మతాల మత్తులో, రాజకీయాల మాయలో
విభజించు పాలించు సూత్రాలకు బలి కావద్దు
కుల ప్రాంత భేదాల ముసుగును చీల్చుకొని
కార్మిక వర్గమంతా ఏకమై అడుగు వేయాలి!
అది కేవలం సెలవు దినం కానే కాదు
చెమట చుక్కలు చిందించిన హక్కుల పండుగ
స్వార్థపు గోడలు దాటి, ఐక్యతే ఆయుధంగా
రేపటి తరాల విముక్తికై కదలి రావాలి!
– పూర్ణిమా యర్రంశెట్టి


– పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -