మాత దేవోభవ, పితదేవోభవ ఆచార్య దేవోభవ.. అన్నారు. తల్లిది ఎన్నటికీ పథమ స్థానమే! అమ్మని ఎంత మంది ఎన్ని రకాలుగా చూపినా ఈ అమ్మ చాలా ప్రత్యేకం! ఆ మాధుర్యానికి అక్షరాలతో అభిషేకించిన పాటలలో నేడు కొత్తగా ప్రత్యేకంగా వినపడుతున్న పాట.. ”బొమ్మరా ఇది బొమ్మరా అమ్మచెక్కిన బొమ్మరా..”. ఈ పాట మనల్ని అమ్మ ప్రేమలో ముంచెత్తుతుంది. శ్రీనిధి వీనులవిందుగా పాడిన ఈ పాట అమ్మ చెక్కిన బొమ్మ నాటికలోనిది. మొదలు పెట్టిన కొద్దికాలంలోనే పలువురి ప్రశంసలతో పలు ప్రదర్శనల వైపుకి విస్తరించి ప్రదర్శించిన ప్రతి చోటా అభినందనలు, అవార్డుల వెల్లువతో కొనసాగుతున్న నాటిక అమ్మచెక్కిన బొమ్మ. రచన శ్రీమతి జ్యోతిరాజ్బీశెట్టి. దర్శకుడు డా. వెంకట గోవాడ.
ఆ నాటకం వివరాలలోకి వెళితే ప్రముఖ నాటకరంగ దర్శకుడు, నటుడు అయిన డా.వెంకట్ గోవాడ తన తల్లిపేరు మీద నిర్వహించిన అమ్మ కథాంశంగా నిర్వహించిన నాటికల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నాటికని జ్యోతి రాజ్ బీశెట్టి రచించారు. ఈ నాటికలో ప్రధాన పాత్ర అయిన తల్లి అనసూయ పాత్రలో జీవించారు జ్యోతి. నాటికను తనే రచించి నటించడం ఈ నాటిక ప్రత్యేకత. జ్యోతి పదకొండేళ్ళ వయసులో ‘రేపేంది’ నాటికలో తొలిప్రదర్శన చేసింది. తిరిగి 2017 లో ‘బావా ఎప్పుడు వచ్చితివీవు’ నాటికతో మొదలుపెట్టి, ‘మూల్యం’ లో జయతిగా, ‘అందిన ఆకాశం’లో ఆమెగా, ‘కన్నీటి కథ’ ముసలి పాత్రలో ‘యాదాద్రి’ లక్ష్మీదేవిగా నేటి వరకు నిరంతరాయంగా పలు నాటకాలలో నటించారు. అవన్నీ ఒకెత్తు, అనసూయ పాత్ర ఒకెత్తు అన్న రీతిలో నటించి పలువురి ప్రశంసలందుకున్నారు. శిష్లా చంద్రశేఖర్ గారి రచనల మీద ప్రస్తుతం పిహెచ్ డి చేస్తున్నారు. మంచి ఇతివత్తం, సామాజిక అంశాన్ని ఎంచుకోవడం జ్యోతి రచనకు, నటనకు వన్నె తెచ్చాయి.
దర్శకత్వం, నటన: డా. వెంకట్ గోవాడ తెలుగు నాటక రంగంలో యువ నాటక దర్శకుడు, నటుడు, నిర్మాత. ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి పూర్తిస్థాయిలో నాటక రంగానికి తమ సేవలను అందిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్‌లో పీజీ డిప్లొమా చేసిన డాక్టర్ వెంకట్ గోవాడ పలు నాటకాలలో వేంకటేశ్వర స్వామిగా, అంబేద్కర్‌గా, పోలీస్ అధికారిగా విభిన్న పాత్రలను పోషించి అందర్నీ మెప్పించారు. 2013లో గోవాడ క్రియేషన్స్ ప్రారంభించి పలు నాటకాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. సినిమాలు సీరియల్స్‌లో పాత్రలు పోషిస్తున్నారు. మూల్యం నాటికలో నటనతో పాటు దర్శకత్వం వహించి పలువురి ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం వీరి దర్శకత్వంలో ‘అమ్మ చెక్కిన బొమ్మ’ రెండు తెలుగు రాష్ట్రాలలోను అందరి ప్రశంసలను అందుకుంటుంది. పరిషత్తులలో పలు అవార్డులను సొంతం చేసుకుంది.
కథాంశం: అమ్మ చేతిలో అల్లారుముద్దుగా పెరుగుతున్న అబ్బాయి ఎదుగుతున్న క్రమంలో కొన్ని మార్పులు గ్రహిస్తుంది తల్లి. మొదట పొరపడుతున్నాననుకుంది. తర్వాత గమనించింది. అబ్బాయిగా ఉన్న కొడుకు అమ్మాయిగా ఉండటానికి ఇష్టపడటం అతనిలో జరుగుతున్న మార్పుల పట్ల సంఘర్షణ… ఈ విషయమై తల్లి పాట్లు, భర్త విముఖత, సమాజానికి భర్తకు ఎదురీది తల్లి తీసుకునే నిర్ణయం దాని ఫలితం … వీటన్నింటి మధ్య రూపుదిద్దుకున్నదీ నాటిక.
పాత్రలు: వెన్నెలగా రూపుదిద్దుకునే ముందు చిన్న బాబుగా దినేష్, కాస్త పెద్దయ్యాక భానుప్రకాష్, వెన్నెలగా మారిన ట్రాన్స్ జెండర్ పాత్రలో ట్రాన్స్ జెండర్ హర్షిణి మేకల పాత్రలకు జీవం పోసారు. తండ్రిగా డా.వెంకట్ గోవాడ, తల్లిగా జ్యోతి పరిణితి చెందిన కళాకారులుగా నాటకాన్ని తల్లితండ్రుల మానసిక స్థితిని భావోద్వేగ నాటకంగా మలిచి పాత్రలలో లీనమై నటించారు. ”బొమ్మరా ఇది బొమ్మరా” పాటతో శ్రీనిధి, సంగీతం సమకూర్చిన నాగరాజ్, ఫణీంద్ర రోహిత్ సెట్డిజైన్, ఇతర సిబ్బంది సహకారంతో తయారైనదీ ‘అమ్మ చెక్కిన బొమ్మ’.
ప్రత్యేకత :విన్నూత్న కథాంశం. ఎదురు దెబ్బలకు తట్టుకున్న ధీరగా తల్లి పాత్ర, భర్తా బిడ్డా మధ్య బిడ్డవైవు మొగ్గు చూపిన సంఘటనలు సంభాషణలు.. ట్రాన్స్ జెండర్ల దుస్థితి, వారి భవితను ఎంచుకొనే విషయంలో లేని సహకారం, ఎదుర్కొన్న వివక్ష, అవమానం చివరకు కన్న తండ్రి నిరాదరణ.. అన్నింటిని అధిగమించి చేరుకున్న లక్ష్యం ఐ.ఏ.ఎస్ వెన్నెలగా రూపాంతరం.. అనేక విషయాల కలబోత ఈ బొమ్మ. తను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఏది? తను మాత్రం తన సాధనతో సమాధానమై నిలిచింది.
ప్రత్యేక ప్రశంస : ఈ నాటికలో ప్రత్యేక ప్రశంస అందించ వలసిన అమ్మ చెక్కిన బొమ్మ వెన్నెల పాత్రలో నటించిన హర్షిణి మేకల. హర్షిణి మేకల ఒక ట్రాన్స్ వుమన్. మోడల్‌గా ఆమె అందాల పోటీలలో, నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చిన్నతనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె 2024 లో జరిగిన మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలలో ఐదవస్థానంలో నిలిచారు. మూడు టైటిల్స్ గెలుచుకున్నారు. తన జీవితం లాంటి ఈ నాటికలో తను నటించడం ఈ పాత్రకు న్యాయం చేసినట్లైంది. హర్షిణి నటన అందరి ప్రశంసలకు నోచుకుంది.
మరొక ప్రత్యేక నటన భాను ప్రకాష్ బాల నటుడిది. 60కి పైగా సినిమాలలో నటించిన భాను ఈ పాత్రలో పలికించిన హావ భావాలు అందరినీ కదిలించాయి. పలు మార్లు ఉత్తమ బాల నటుని అవార్డు ఈ నాటికకి పలు పరిషత్తులలో అందుకున్నారు. అద్భుతమైన కథను రచించిన జ్యోతిరాజ్, విలక్షణంగా నటింపజేసి, దర్శకత్వం వహించిన డా వెంకట్ గోవాడ, ట్రాన్స్ జెండర్ ఆత్మకథ అనిపించిన రీతిలో స్వయంగా ఆ పాత్రకు న్యాయం చేసిన హర్షిణి, తన స్వరంలో అమ్మ చెక్కిన బొమ్మను చూపిన శ్రీనిధి .. నాటకంలోని భావాలలోకి సంగీతం జోడించిన నాగరాజ్, వెన్నంటి ఉన్న రాధ, స్వరాజ్ తదితర బందం మొత్తం అభినందనీయులే! ఈ మహత్తర నాటకంలో అవార్డులతో పాటు ప్రశంసల జల్లుకు పాత్రులు. మరిన్ని విజయాలను అందుకుంటూ సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల మన దారుణమైన ప్రవర్తన మార్చుకునేందుకు దోహదం చేస్తుందీ నాటిక.
ప్రదర్శనల ప్రభంజనం :
మొదటి ప్రదర్శన తేదీ: 28/03/2025న రంగభూమి స్పేసెస్, హైదరాబాద్‌లో ప్రదర్శించి ఆ రోజు నుంచి యాభైయవ ప్రదర్శన 02/05/2026 కొంతేరులో పూర్తయింది. విజయోత్సవ ప్రదర్శనగా 51 వ ప్రదర్శన తిరిగి 5-5-2026 న రంగభూమి స్పేసెస్, హైదరాబాద్‌లో సాయంత్రం ప్రదర్శిస్తున్నారు. అతి తక్కువ సమయంలో అనేక ప్రదర్శనలు, అనేక బహుమతులు అందుకున్న ఘనత అమ్మ చెక్కిన బొమ్మదే! రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వడోదర వెళ్ళి సభ యావత్తు స్టాండింగ్ ఒవేషన్ అందుకున్న అదష్టం ఈ టీంకి దక్కింది.
హైదరాబాద్‌తో మొదలై తెనాలి, విజయవాడ ,పెద్ద కాకాని, ఏలూరు, సాతలూరు, వరంగల్, సాఫ్ట్‌వేర్ కంపెనీ హైదరాబాద్, రవీంద్ర భారతి హైదరాబాద్, నల్గొండ, కాకినాడ, తిరుపతి, ఖమ్మం, వడోదర, గుజరాత్, అనకాపల్లి, విజయనగరం,పెదమేరంగి, తోలేరు, శ్రీకాకుళం, విజయనగరం, పొనుగుపాడు, పెదకంచెర్ల, ఉలిచి, అనంత వరం, చంద్రమాంపల్లి (దివిలి), పాలకోడేరు, తాటిపర్తి, ఒంగోలు, కింతలి (శ్రీకాకుళం), భద్రాచలం, తిరుపతి, నరసరావుపేట, తొర్రూర్, మిర్యాలగూడ, పాలకొల్లు, రావులపాలెం, తాడేపల్లిగూడెం, హరిపాలెం, పెద్దనాపల్లి, రేపల్లె, యడ్లపాడు, బొరివంక (ఇచ్చాపురం దగ్గర), లింగారావుపాలెం, విశాఖపట్నం, వరగాని, మార్టూరు, వినుకొండ, ఉమూయరు, కొంతేరు… ఈ యాభై ఊర్లలో, ఆయా పరిషత్తులలో ప్రదర్శనలు జరిగాయి. 51వ ప్రదర్శన రంగ భూమి, హైదరాబాద్, ఆ తర్వాత మే నెలలో ప్రతి రెండేసి రోజులకు ఒక చోట ప్రదర్శనలు సిద్ధంగా ఉన్నాయి .
ఇక అమ్మ చెప్పిన బొమ్మ నాటిక మొత్తం పలు రకాల కేటగిరీలలో గెలుచుకున్న బహుమతులు 139.
నాటక విజయం : ఏ నాటకమైతే ప్రేక్షకులను కట్టి పడేస్తుందో, ఎక్కువగా భావోద్వేగంతో కదిలిస్తుందో ఆ నాటకం విజయవంతమైనట్లే. తమ వద్దకు వచ్చి ట్రాన్స్ జెండర్స్ పట్ల మా అభిప్రాయం మార్చుకున్నాం అని వచ్చి మరీ చెప్పారని వెంకట గోవాడ సంతోషంగా చెప్తారు. ఇంకా ఈ నాటిక అన్నీ కళాశాలకు చేరాలన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. జ్యోతి తన నటనకు కంటతడి పెట్టి మెచ్చుకుంటూ కొందరు, హర్షిణి నటనకు ఆత్మ విశ్వాసానికి అభినందనలు తెలిపిన వారు కొందరు. తను రచించిన నాటకానికి లభించిన ఆదరణ చూశాక తన బాధ్యత మరింత పెంచిదని అన్నారు
తెలుగు నాటకరంగంలో అమ్మ చెక్కిన బొమ్మ మరింత ఆదరణ పొంది వంద ప్రదర్శనలు త్వరలో పూర్తి చేయాలని అభినందిద్దాం. సమాజంలో మార్పు దిశగా వచ్చే నాటికలను స్వాగతిద్దాం.
డా. సమ్మెట విజయ
9989820215



