Saturday, May 16, 2026
E-PAPER
Homeప్రత్యేకంప్రశ్నర్థకమ‌వుతున్న జాతుల భవిత

ప్రశ్నర్థకమ‌వుతున్న జాతుల భవిత

- Advertisement -

(మార్చి 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం)
భూమ్మీద మనుగడ సాగిస్తున్న సకల జీవజాతుల మనుగడకు జీవవైవిధ్యమే పునాది. అయితే గడిచిన కొన్ని దశాబ్దాలుగా అభివద్ధి పేరుతో జరుగుతున్న ప్రకతి వినాశకర చర్యల వల్ల తిరిగి కోలుకోలేనంత వేగంగా జీవ వైవిధ్యం ధ్యంసమైపోతుంది. ఈ ధ్వంస రచనను ఆపకపోతే రానున్న రోజుల్లో జీవ మనుగడతో పాటు, మానవ మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని జీవ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపం, కాలుష్యం వంటి విపరిణామాల వల్ల అంతరించిపోతున్న జీవవైవిధ్యాన్ని రక్షించుకునే లక్ష్యంతో 2026కి సంబంధించిన జీవవైవిధ్య వేడుకలను ‘ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం, స్ధానిక చర్యలు’ అనే నినాదంతో జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది.

కున్మింగ్‌ మాంట్రియల్‌ గ్లోబల్‌ బైయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌ 23 లక్ష్యాల సాధన దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జీవవైవిధ్య పరిరక్షణ చర్యలను ఏకీకతం చేసి ఒక్కటిగా ఉద్యమించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలను కోరింది. గత కొంత కాలంగా యదేచ్ఛగా సాగుతున్న పర్యావరణ వినాశనానికి, జీవ వైవిధ్య విధ్యంసానికి మానవుడే కారణం. మానవుని చర్యల వల్ల, నిత్యం పర్యావరణంలోకి వెదజల్లబడుతున్న కలుషితాల వల్ల తిరిగి కోలుకునే శక్తిని ప్రకృతి కోల్పోతుంది. ప్రకతి పునర్జీవనశక్తికి, పర్యావరణ విధ్వంసక కలుషితాల సామర్ధ్యానికి మధ్య జరిగే పోరులో ప్రకతి నిరంతరం ఓటమి పాలవుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా విస్తరిస్తున్న పర్యావరణ సంక్షోభం వల్ల పెద్దయెత్తున్న జీవవైవిధ్యం ధ్వంసమైపోతుంది. శరవేగంగా విస్తరిస్తున్న పర్యావరణ సంక్షోభాన్ని నివారించి, పర్యావరణ వ్యవస్థలను తిరిగి పూర్వస్థితికి తీసుకురాకపోతే రానున్న రోజల్లో జీవ వైవిధ్యం మరింత ధ్యంసమయ్యే అవకాశముంది.

అంతరించిపోతున్న జాతులు
భూమ్మీద అన్ని ఆవరణవ్యవస్ధలలోను కలిపి మొత్తం 140 మిలియన్‌ జీవజాతులు నివశిస్తున్నాయని, వాటిలో కేవలం 1.74 మిలియన్‌ జాతులను మాత్రమే మానవుడు గుర్తించటం జరిగిందని గ్లోబల్‌ బయోడైవర్సిటీ ఔట్‌లుక్‌ తాజా నివేదిక తెలియచేస్తుంది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ ఏటా ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులపై తాజాగా విడుదల చేసిన ఒక నివేదికను అనేక చేదు నిజాలను వెల్లడించింది. ఐయుసిఎన్‌ రెడ్‌డేటా బుక్‌ అధ్యయనం ప్రకారం 18వేల జాతులను పరిశీలించగా, వాటిలో 11వేల జీవజాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యం కలిగిన దేశాలలో 7వ స్థానంలో ఉన్న భారతదేశంలో కూడా జీవ వైవిధ్యం వేగంగా ధ్వంసమై పోతుందని అధ్యయనాల వల్ల తెలుస్తుంది. జలాశయాలు అడుగంటి పోవటం, సాగుభూములు తమ సారాన్ని కోల్పోయి ఎడారులుగా మారటం కూడా జీవుల వినాశనానికి ఒక కారణం. గడిచిన దశాబ్దకాలంలో 15 లక్షల హెక్టార్ల సాగుభూమి ఎడారిగా మారిపోయింది.

అడవుల ధ్వంసం
సమస్త జీవరాశికి ప్రాణవాయువులు అందించిన అడవులు నేడు తమ ఆయువును కోల్పోయే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల కూడా ప్రపంచ వ్యాప్తంగా వన్య జీవుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. అత్యంత పురాతనమైన జీవవైవిధ్య కేంద్రాలుగా పరిఢవిల్లిన అరణ్యాలు నేడు జీవరహిత కేంద్రాలుగా మారిపోతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ఏటా వేలాది ఎకరాల్లో అడవులు నరికివేతకు గురవుతున్నాయి. మానవుని ఆహార, ఆవాస అవసరాలతో పాటు, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి నిత్యం వేల ఎకరాల్లో అడవులను ధ్వంసం చేస్తున్నారు. పారిశ్రామికీకరణ, నగరీకరణ, ప్రాజెక్టుల నిర్మాణం, రైల్వే, రోడ్డు నిర్మాణాల వంటి కార్యక్రమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అడవులన్నీ ధ్వంసమైపోతున్నాయి. 1990 నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 420 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు అంతరించిపోయాయని గ్లోబల్‌ ఫారెస్ట్‌ అసెస్‌మెంట్‌ తాజా నివేదిక తెలియచేస్తుంది. మానవుని స్వార్ధపూరిత చర్యల వల్ల ప్రతి సంవత్సరం 10 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు అంతరించిపోతున్నాయి.

జీవుల పాలిట శాపంగా
నిత్యం పర్యావరణంలోకి విడుదలవుతున్న కాలుష్యం వల్ల భూమ్మీద ఉష్ణోగ్రతలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. కాలుష్యం కన్నా పెరుగుతున్న భూతాపమే జీవుల పాలిట శాపంగా మారుతుంది. పారిశ్రామిక విధానాలతో పాటు, ప్రజల జీవన విధానంలో వస్తున్న అనూహ్య మార్పులు కూడా ప్రపంచ మానవాళి నేడు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి ప్రధాన కారణం. సంపన్న దేశాల జీవన విధానం వల్లనే భూతాపానికి కారణమవుతున్న కార్బన్‌ ఉద్గారాల విడుదలకు కారణం. సంపన్న దేశాల నుండి రోజూ పర్యావరణంలోకి విడుదలవుతున్న కర్బన కలుషితాల వల్లే భూమ్మీద ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల ఏటా 27వేలకు పైగా జీవజాతులు అంతరించిపోతున్నాయి. గడిచిన శతాబ్దకాలంలో 75శాతం జన్యు ఆహారపంటలు అంతరించిపోయాయి, వందల ఏండ్ల మానవాళితో పాటు జీవరాశికి పోషకాహారాన్ని అందించిన పంటలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.

చిత్తశుద్ధితో కృషి చేయకపోతే
ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యానికి ప్రధానమైన అడ్డంకిగా పరిణమిస్తున్న భూతాపాన్ని అరికట్టకపోతే జీవ వైవిధ్య విధ్యంసాన్ని అరికట్టలేము. భూ ఉష్ణోగ్రతను పెంచే కర్బన ఉద్గారాలలో 49శాతం ఇంధన వాడకాల వల్ల విడుదలవుతుంటే, 29శాతం పరిశ్రమల ద్వారా, మిగిలిన 27 శాతం వ్యవసాయ రంగంలో ఉత్పన్నమవుతున్న వ్యర్ధాల వల్ల, అడవుల విధ్వంసం వల్ల విడుదలవుతున్నాయని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలుష్య విధ్వంసం ఇలాగే కొనసాగితే రానున్న 20 ఏండ్లలో సుమారు 2 లక్షల 50వేలకు పైగా జీవజాతులు అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా జీవులు అంతరించిపోయే ప్రక్రియ రోజు రోజుకి మరింత వేగవంతమవుతుంది. 80వ దశకంలో వారానికి ఒక జీవి అంతరించిపోతే, 90 దశకం నాటికి రోజుకొక జీవి అంతరించిపోయేదని, ప్రస్తుతం ప్రతి గంటకు పదికి పైగా జీవులు అంతరించి పోతున్నాయని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల నుండి జీవజాతులను రక్షించడానికి సత్వరమే ప్రపంచ దేశాలన్నీ ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి వంటి సంస్ధలు కోరుతున్నప్పటికీ అమెరికా వంటి సంపన్న దేశాలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణ పట్ల అమెరికా ఆది నుండి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది. అమెరికా వంటి అగ్రదేశాలు అవలంభిస్తున్న ఏకపక్ష విధానాలే మిగిలిన దేశాలలోని వన్యప్రాణుల జీవితాల పాలిట శాపాలుగా మారుతున్నాయని, ఆయా దేశాలు తమ ద్వంద్వ వైఖరికి స్వస్తి పలికి పర్యావరణ పరిరక్షణతో పాటు, జీవ సంరక్షణకు మిగిలిన దేశాలతో కలిపి పనిచేయాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్నాయి. భారత్‌ మాత్రం సమయం వచ్చిన ప్రతి సందర్భంలోను పర్యావరణ పరిరక్షణ దిశగా తాను చేపట్టబోయే చర్యల పట్ల స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది. మిగిలిన అభివద్ధి చెందిన దేశాలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ అగ్రదేశాల వైఖరిలో ఏరకమైన మార్పు లేకపోవటం పర్యావరణ పరంగా అతి పెద్ద విషాదం. ఇప్పటికైనా ప్రపంచదేశాలు పర్యావరణ పరిరక్షణకు చిత్తశుద్ధితో కషి చేయకపోతే భూమ్మీద జీవవైవిధ్యం మరింత ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

డా. కె. శశిధర్‌,
94919 91918

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -