అవును. చరిత్ర ఎరుగని మహా పాపం మన దేశానికి పట్టినది. గజనీ మహముద్ (971 – 1030) కాలం నుండి భారతదేశానికి మహా పాపం చుట్టుకుంది. అపార దేశ సంపద దోచుకోబడటమే కాకుండా, చరిత్ర, సంస్కృతులు వెన్నెముక లాంటివి. పునాదుల లాంటివి. అట్టి పునాదుల్ని విదేశీ శక్తులు తమ ఇచ్చ వచ్చినట్టు మార్చివేశాయి. క్రీస్తు పూర్వం (సుమారు 1500) ఉత్తర భారతదేశాన్ని ఆర్యులు అనబడే శ్వేతజాతితెగలు నేటి పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌ల ద్వారా మధ్య ఆసియా నుండి భారత దేశానికి వలసలు వచ్చారని, అంతకు ముందు భారత దేశానికి నాగరికతే లేదని, ఒక సిద్ధాంతం ఇంగ్లీషు వారి పాలన సమయాన ప్రతిపాదించబడినది. వలస వచ్చిన ఈ ఆర్యులు, అంతకు ముందు దేశంలో వుంటున్న (సుమారు 5000 ఏళ్ల క్రితం) హరప్పా, మహెంజోదారో ఆదిమ నాగరికతలని మార్చి వేశారని, ఆర్యుల నాగరికత సంస్కృలు అంతకుముందు వున్న సంస్కృతుల కంటే చాలా వున్నతమని చరిత్రను పాశ్చాత్యులు మార్చి రాశారని విద్యాలంకార పరిశోధన ప్రవీణ డా.చిరువూరి శివరామృష్ణ శర్మ తన ‘చరిత్ర ఎరుగని మహా పాపం మన దేశానికి పట్టినదే (తృతీయ భాగం)’ అన్న తమ పరిశోధన గ్రంథంలో సోదాహరణంగా వివరిస్తున్నారు. ఈ గ్రంథ రచయిత న్యాయ, వైశేషిక వేదాంత శాస్త్ర పండితులు. పిహెచ్‌డి చేసిన బోధకులు. పురాణ గ్రంథ ప్రవచకులు. వేద వాఙ్మయ పండితులు. ఎన్నో ఏళ్ల శోధన అనంతరం ఈ గ్రంథాన్ని వెలువరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రంథ రచయిత ‘భారత జాతి అస్తిత్వ సమరాంగణం’లో యోధుడై నిలిచి, అంతకుముందున్న ఎన్నో సిద్దాంతాలను అప్రమాణికమని సహేతుంకంగా నిర్ణయించారు.
ఈ గ్రంథం (తృతీయ భాగం) లో రచయిత శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ ప్రతిపాదించిన సిద్ధాంతాలు.
- ఒకప్పుడు, సుమారు క్రీ.పూ. 1900 సంవత్సరాలకు పూర్వం ఉత్తర భారత దేశంలో సరస్వతీ నది నేటి గంగ యమునల వలె భూమిపైన ప్రవహిస్తుండేది. ఈ నది తీరాన నాగరికత వర్థిల్లినది. హరప్పా సైట్లు ప్రాచీన సరస్వతి నది ప్రవాహం వెంట వున్నాయి (పే. 74).
- శకుంతల తనయుడి వలన ఈ దేశానికి భారతదేశమన్న పేరు రాలేదు. అతకు ముందు శ్రీరాముని కంటే 33 తరాలకు పూర్వం భరతుడు అనే రాజు వల్ల వచ్చింది.
- భారతదేశానికి వలస వచ్చిన వారికంటే (ఆర్యులు) ముందు నాగరికత వర్థిల్లినది. ఆర్యులు బయట నుండి వచ్చి దండ యాత్ర చేయలేదు (పే.47).
- భారతీయ లిపులకు ‘ప్రణవం’ మూలం (పే.48).
- రామాయణ కాలంలో 4 దంతాల ఏనుగులున్నాయి. (పే.81).
- మహాభారత యుద్ధ సమయాన ఆంధ్రులు కౌరవుల పక్షాన వున్నారు (పే.99).
- క్రైస్తవుల ‘ద గ్రేట్ డెల్యూగ్’ (గొప్ప వరద) కంటే ముందే భారతదేశం వుంది (పే.105).
- భారతదేశం నుండే ఈజిప్టుకు వలస వెళ్లారు. రామేశన్ అన్న వారి రాజుల పేరు భారతదేశపు మూలాలు నుండి వచ్చాయి. (పే.153).
- సంఖ్యా వాచకాలు (ఐరోపా భాషలోని) మన సంస్కృతాన్ని పోలి వున్నాయి (పే.157).
- లిధువేనియన్ భాష సంస్కృతంతో సన్నిహితంగా వుంది (పే.164).శర్మ ప్రతిపాదించటమే కాకుండా ఆధారాలను కూడా పేర్కొన్నారు. మన చరిత్రలోని నిజాలను వెలికితీయటంలో రచయిత పాత్ర ఎంతో ప్రశంసనీయమైనది.
కూర చిదంబరం, 8639338675



