Sunday, May 3, 2026
E-PAPER
Homeజాతీయంబీమా రంగంలోకి 100 శాతం ఎఫ్‌డీఐలు

బీమా రంగంలోకి 100 శాతం ఎఫ్‌డీఐలు

- Advertisement -

నోటిఫై చేసిన కేంద్రం ొ దేశీయ సంస్థల ఉనికికి ముప్పు
న్యూఢిల్లీ : భారత బీమా రంగాన్ని విదేశీ కార్పొరేట్‌ కంపెనీల చేతిలో పెట్టడానికి మోడీ సర్కార్‌ తుది నిర్ణయం తీసుకుంది. దేశీయ బీమా కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ రంగంలో ఉన్న 74 శాతం పరిమితిని ఎత్తివేస్తూ.. విదేశీ ఇన్వెస్టర్లు ఇకపై భారతీయ బీమా సంస్థల్లో పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను పొందేందుకు వీలు కల్పించింది. ‘సబ్‌ కా బీమా – సబ్‌ కి రక్షా’ చట్టం-2025 కింద తీసుకువచ్చిన ఈ మార్పులు దేశీయ బీమా మార్కెట్‌ ముఖచిత్రాన్ని మార్చనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

చెప్పాపెట్టకుండా కొనెయ్యచ్చు.
ఆర్థిక శాఖ నూతన నిబంధనల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేకుండానే ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. బీమా రంగ నియంత్రణ సంస్థ అయిన ఐఆర్‌డీఏఐ పరిశీలన, ఆమోదం తర్వాతే ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆర్థిక శాఖ పేర్కొంటున్నప్పటికీ విదేశీ సంస్థలకు ఇది పెద్ద అడ్డంకి ఏమీ కాదు. బీమా కంపెనీలతో పాటు ఇన్సూరెన్స్‌ బ్రోకర్లు, రీ-ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు వంటి మధ్యవర్తిత్వ సంస్థలకు కూడా ఈ 100 శాతం వెసులుబాటు వర్తిస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో పేరున్న బీమా దిగ్గజాలు నేరుగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఏర్పడింది.ప్రయివేటు బీమా రంగంలో పూర్తి స్థాయి విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించినప్పటికీ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)లో విదేశీ పెట్టుబడుల పరిమితిని కేవలం 20 శాతానికే పరిమితం చేస్తూ ప్రత్యేక నిబంధనను కొనసాగిస్తోంది. ఇతర బీమా కంపెనీలకు వర్తించే 100 శాతం ఎఫ్‌డీఐ నిబంధన ఎల్‌ఐసికి వర్తించదని పేర్కొంది. యాజమాన్య హక్కులు విదేశీయుల చేతికి వెళ్లినప్పటికీ ఆయా కంపెనీల్లో చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేదా సీఈఓ వంటి అత్యున్నత పదవుల్లో కనీసం ఒక్కరైనా నివాస భారతీయ పౌరుడై ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విదేశీ వాటాల మార్పిడిలో జరిగే ఆర్థిక లావాదేవీలు ఆర్బీఐ నిర్దేశించిన ఫెమా నిబంధనలకు లోబడి ఉండాలి. మెజారిటీ విదేశీ వాటాలున్న సంస్థలు తప్పనిసరిగా భారతీయ కంపెనీల చట్టం-2013 కింద రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది.

ప్రధాన ప్రమాదాలు..
బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను కేంద్రం అనుమతించడం దేశీయ కంపెనీల ఉనికిని ముప్పులోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపారమైన మూలధనం, అత్యాధునిక సాంకేతి కత కలిగిన అంతర్జాతీయ దిగ్గజాలు నేరుగా రంగప్రవేశం చేయడం వల్ల చిన్న స్థాయి స్వదేశీ కంపెనీలు తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశీ సంస్థలు మార్కెట్‌ వాటా కోసం ధరల యుద్ధానికి దిగితే, పరిమిత వనరులు న్న స్థానిక సంస్థలు నష్టాల భారంతో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ఈ కీలక రంగంపై దేశీయ పట్టు సడలి, నిర్ణయాధికారాలన్నీ విదేశీ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.అదే విధంగా 100 శాతం విదేశీ యాజమాన్యం వల్ల భారతీయుల వ్యక్తిగత, ఆర్థిక డేటా భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ లాభాలన్నీ విదేశాలకు తరలిపోవడమే కాకుండా.. కీలక పదవుల్లో భారతీయులు ఉండాలనే నిబంధనలు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయే ముప్పు ఉంది. ఎల్‌ఐసీకి రక్షణ కల్పించిన ప్రభుత్వం ప్రయివేటు రంగంలోని భారతీయ కంపెనీలను ప్రపంచ దిగ్గజాల పోటీకి వదిలేయడం వల్ల దీర్ఘకాలంలో దేశీయ బీమా పరిశ్రమ విదేశీ శక్తుల గుత్తాధిపత్యంలోకి వెళ్లే ఆస్కారం ఉంది.

పెన్షన్‌ రంగంలోనూ కీలక సంస్కరణకు సిద్ధం..
పెన్షన్‌ రంగంలోనూ కీలక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) పరిమితిని 100 శాతానికి పెంచాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనతో కూడిన బిల్లును వచ్చే (జులై లేదా ఆగస్టు) పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే మోడీ సర్కార్‌ కు బీమా రంగాన్ని ప్రయివేటు పరం చేస్తున్న తీరుపై పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -