Sunday, May 3, 2026
E-PAPER
Homeజాతీయంకార్పొరేట్ల కోసం అడవులు బలి

కార్పొరేట్ల కోసం అడవులు బలి

- Advertisement -

మోడీ పాలనలో పర్యావరణ వ్యవస్థకు తీవ్ర ముప్పు

లక్షలాది చెట్ల నరికివేతలు, ప్రజల అభిప్రాయాలకు తావు లేదు
వేగవంతమైన అనుమతులు.. అభివృద్ధి పేరిట వినాశనం అదానీ కోసమే
వేల కోట్ల గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్ట్‌!
కేంద్రం విధానాలపై తీవ్ర విమర్శలు

అడవుల నష్టం..
పెరుగుతున్న కాలుష్యం

గత దశాబ్దంలో కోట్లాది చెట్ల
నరికివేతలు జరిగాయి. ఫలితంగా భారత్‌లోని పలు నగరాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరాలుగా మారాయి. వేడి తీవ్రత కూడా పెరిగి కొన్ని నగరాలు ఎడారులను మించిన ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాయి.

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పర్యావరణ పరిక్షణను చిన్న చూపు చూస్తున్నది. కార్పొరేట్ల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. వారి కోసం లక్షలాది చదరపు కిలోమీటర్లలో ఉన్న అడవులను నిర్మూలించేస్తోం ది. అడవుల నరికివేత, ప్రజల అభిప్రాయాలకు చోటు లేకపోవడం, కార్పొరేట్లకు వేగవంతమైన అనుమతుల మంజూరు వంటివి దేశాన్ని కాలుష్యం, ఉష్ణోగ్రతలు, ఆరోగ్య సమస్యల దిశగా నెట్టివేస్తున్నాయని పర్యావరణవేత్తలు, మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రాజెక్టు లు పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల అండమాన్‌ గ్రేట్‌ నికోబార్‌ దీవిలో లక్షలాది చెట్లను నరికివేయడానికి అనుమతులు ఇవ్వడం పెద్ద వివాదంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ సంస్థకు చెందిన టౌన్స్‌షిప్‌మెంట్‌ పోర్ట్‌ నిర్మాణం కీలకంగా ఉంది. కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఇటీవలే ఈ ప్రాంతాన్ని సందర్శించారు. దీంతో ఆయన ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చగా మల్చగలిగారు. ఆయన దీనిని పర్యావరణంపై జరుగుతున్న నేరంగా అభివర్ణించారు.

ఏమిటి ఈ ప్రాజెక్టు?
మోడీ ప్రభుత్వం గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్‌ పోర్ట్‌, ఎయిర్‌పోర్ట్‌, టౌన్‌షిప్‌, విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించనున్నారు. హిందూ మహా సముద్రంలో వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఇది కీలకమైన ప్రాజెక్టు అని కేంద్రం వాదిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.90వేల కోట్లుగా అంచనా.

వేగమే లక్ష్యం.. పర్యవేక్షణ కాదు
2014 తర్వాత పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారింది. అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఒకే రోజులో వందల ఫైళ్లను క్లియర్‌ చేసినట్టు గర్వంగా ప్రకటించారు. 2018 నుంచి 2022 మధ్య అనుమతుల సంఖ్య గణనీయంగా పెరిగి ఆ సంఖ్య వేలల్లోకి చేరింది.

ప్రజాస్వామ్య ప్రక్రియలకు దెబ్బ
పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) విధానంలో ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం ఒక కీలక అంశం. అయితే 2020లో తీసుకొచ్చిన మార్పులతో ఈ ప్రక్రియ బలహీనపడిందని విమర్శలు ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలకు సమయం తగ్గించడం, కొన్ని ప్రాజెక్టులకు మినహాయింపులు ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నారు.

చట్టాలలో మార్పులు.. అడవులకు ప్రమాదం
2023లో వచ్చిన ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ చట్ట సవరణతో అడవుల నిర్వచనం మారింది. దీంతో లక్షల చదరపు కిలోమీటర్లలో ఉన్న అడవులు రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక పర్యావరణ పరిరక్షణకు కీలకమైన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) వంటి సంస్థలు కూడా బలహీనపడినట్టు విమర్శలు ఉన్నాయి. నియామకాలు ఆలస్యం, బడ్జెట్‌ కోతలు వంటి సమస్యలు పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. అభివృద్ధి అవసరం అనేది ఎవరూ ఖండించలేరు. కానీ అది ప్రజల ఆరోగ్యం, పర్యావరణ ఖరీదుపై జరగకూడదని మేధావులు చెప్తున్నారు. కార్పొరేట్ల లాభాల కోసం సహజ వనరులను త్యాగం చేస్తే, దాని మూల్యం చివరికి సామాన్య ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. దేశ అభివృద్ధి అంటే కేవలం మౌలిక వసతులు మాత్రమే కాదనీ, శుభ్రమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన జీవనం కూడా అంతే ముఖ్యమని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పర్యావరణవేత్తలు, మేధావులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -