Saturday, July 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు15న ఉద్యోగాల భర్తీ కోసం మహాధర్నా

15న ఉద్యోగాల భర్తీ కోసం మహాధర్నా

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ పరిధిలో 60 లక్ష‍ల,తెలంగాణలో 2 లక్ష‍ల ఉద్యోగ ఖాళీలు
నిరుద్యోగుల పోరాటానికి అండగా ఉంటాం
6న ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 
వామపక్ష‍ాల ఆధ్వర్యంలో మహా ధర్నా : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ

‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం పరిధిలోని 60 లక్ష‍లు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 2 లక్ష‍ల ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఈ నెల 15న నిరుద్యోగుల పక్ష‍ాన సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఎంబీ భవన్‌‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, టి.జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏండ్ల కాలంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదనీ, ఏటా 2 కోట్ల హామీని గద్దెనెక్కడానికి వాడుకుని బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. ఒక్క రైల్వే శాఖలోనే పది లక్ష‍ల ఖాళీలున్నాయని ఎత్తిచూపారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని మోసం చేస్తేనే నిరుద్యోగులంతా కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌‌రెడ్డి సర్కారు కూడా నిరుద్యోగులకు న్యాయం చేయలేదని విమర్శించారు. తొలి ఏడాదిలో 2 లక్ష‍ల ఉద్యోగాల భర్తీ, జాబ్‌‌క్యాలెండర్‌, నిరుద్యోగ భృతి హామీలను విస్మరించిందని గుర్తుచేశారు.

62 వేల పోస్టులను భర్తీ చేశామని కాంగ్రెస్‌ ‌సర్కారు గొప్పలకు పోతున్నదనీ, వాస్తవానికి 16 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిందనీ, మిగతావన్నీ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లే అని వివరించారు. పోలీసు శాఖలో ఐదు వేల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. నిరుద్యోగుల డిమాండ్‌ ‌మేరకు 20 వేల పోలీసు పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు రోడ్లెక్కుతుంటే అరెస్టులు చేయడం, నిర్బంధించడం తగదన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ‌ద్వారా ఒక్కరి కూడా రుణాలివ్వలేదని చెప్పారు. నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నామనీ, ఆ పోరాటాల్లో ప్రత్యక్ష‍ంగా పాల్గొంటామని ప్రకటించారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్‌ ‌సర్కారు పేదలు వేసుకున్న గుడిసెలను, కట్టుకున్న ఇండ్లను కూల్చేయించడాన్ని తప్పుబట్టారు. వరంగల్‌, హన్మకొండలో రియల్టర్లు వేయి ఎకరాల భూమిని కబ్జాచేస్తే పట్టించుకోని పాలకులు పేదలు వేసుకున్న గుడిసెలను మాత్రం కూల్చడం దారుణమన్నారు. గుడిసెలు వేసుకున్న పేదలకు 120 గజాల స్థలమివ్వాలనీ, పేదలకు ఇండ్ల స్థలమిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని డిమాండ్‌ ‌చేస్తూ ఈ నెల ఆరో తేదీన వామపక్ష‍ పార్టీల ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాకు పేదలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనీ, సర్కారు బడులను కుదించొద్దని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తే వారిపై లాఠీచార్జి చేయడం, అరెస్టు చేయడం వంటి పరిణామాలను ఖండించారు.

ప్రయివేటు, కార్పొరేట్‌ ‌స్కూళ్లల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలనీ, సిబ్బంది కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రించేందుకు ఒక చట్టం తేవాలని డిమాండ్‌ ‌చేశారు. కరీంనగర్‌ ‌జిల్లా కొత్తపల్లిలో దళితులను గుడిలోకి వెళ్లనీయకపోవడం దారుణమన్నారు. ఎంపీ బండి సంజయ్‌ ‌తన నియోజకవర్గంలో దళితుల్ని గుడిలోకి రానివ్వకపోతే ఏం చేస్తున్నారు? దళితులు హిందూవులు కాదా? అని ప్రశ్నించారు. కోరుట్లలో ఇంజినీరింగ్‌ ‌విద్యార్థిని హత్యచేసి నెల దాటినా నిందితులను అరెస్టు చేయకపోయారని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ‌నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.

గత బీఆర్‌ఎస్‌, ఇప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశాయని ప్రశ్నించారు. ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ…ప్రజల మౌళిక సమస్యలను పట్టించుకోకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ‌నేతలు రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయ డ్రామాలకు అడ్డుకట్ట వేయాలనీ, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసి అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేసేది ఎర్రజెండా పార్టీలేనన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందనీ, దీనివల్ల దేశంలోని ఎంతో మంది పేదలకు నష్టం జరుగుతున్నదని చెప్పారు. ఓట్ల కోసం మతం, దేవుడి సెంటిమెంట్‌‌ను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేయడం బీజేపీకి పరిపాటిగా మారిందన్నారు. బీజేపీ మోసాలను యువత గ్రహించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -