కులగణనపై మోసం చేసిన ప్రధాని
రాష్ట్రంలో అడుగుపెట్టడానికి ముందే స్పష్టమైన ప్రకటన చేయాలి : రౌండ్‌టేబుల్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
సకలజనుల పోరాట స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు : ఎమ్మెల్సీ కోదండరామ్
బీజేపీ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదు : వీహెచ్
బీసీల ఆకాంక్షలను కేంద్రం విస్మరణ : మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
10న ప్రధాని మోడీకి నల్లజెండాలతో నిరసన : జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ – బంజారాహిల్స్
చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, మహిళా బిల్లు, సామాజిక న్యాయం వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన తర్వాత మాట మార్చి బీసీ సమాజాన్ని మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు ప్రధాని మోడీ రాకముందే సమగ్ర బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధనకు బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు చేపట్టే నిరసన కార్యక్రమాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సకల జనుల పోరాట స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవు తాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిం చకపోవడం బీసీ సమాజాన్ని అవమానిం చడమేనన్నారు. బీసీ హక్కుల సాధన కోసం సమాజమంతా ఐక్యంగా తిరగబడాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. 12 ఏండ్ల బీజేపీ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదని విమర్శించారు. బీసీలకు సమగ్ర కులగణన, రాజకీయ-సామాజిక న్యాయం సాధించే వరకు తాను పోరాటం కొనసాగిస్తానని అన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహిళా బిల్లులో అన్ని వర్గాల మహిళలకు సముచిత న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచే వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలోని 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 10న తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని మోడీకి రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరా శోభన్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మెన్ గుజ్జ కష్ణ, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భీమణి మంజరి, బీసీ జేఏసీ కో-చైర్మెన్ వీటి మల్లయ్య, ఉప్పరి శేఖర్, కాటేపల్లి వీరస్వామి, గొడుగు మహేష్ యాదవ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు కేంద్రం వ్యతిరేకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



