– జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న రైతులకు జరిగిన ఉపయోగం శూన్యం
– కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయంపై ప్రణాళిక, చిత్తశుద్ధి లేదు
– రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాలు వచ్చాయి
– రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలు కదులుతాయి
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ – బోనకల్ : రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, చేతకాని, దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై ఏమాత్రం ప్రణాళిక లేదని, రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఘాటుగా విమర్శల వర్షం కురిపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురం, రావినూతల సొసైటీ పరిధిలోనే కొనుగోలు చేసి కల్లాలలో నిల్వ ఉన్న మొక్కజొన్న బస్తాలను, కల్లాలలో ఉన్న మొక్కజొన్నలను ఆదివారం పోతినేని సుదర్శన్ రావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోవిందాపురం ఎల్, రావినూతల మొక్కజొన్న రైతులు తమ బాధలను వారికి సవివరంగా వివరించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ మొక్కజొన్నలను కొనుగోలు చేయకుండా తమను కొనుగోలు కేంద్రం అధికారులు, ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు. తామే బస్తాలు తెచ్చుకుంటున్నామని చివరికి లారీలు కూడా తామే తెచ్చుకుంటున్నామని రైతులు వారికి వివరించారు.రైతుల సమస్యలను వారు సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ రైతుల పోరాట ఫలితంగానే బోనకల్ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు. కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారన్నారు. కానీ మొక్కజొన్నలను కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఘాటుగా విమర్శలు వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకొని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం లో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఈ విధంగా ఉండటంతో ప్రతి రైతు కన్నీరు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా నియోజకవర్గాలలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుందన్నారు. రైతులే బస్తాలు కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్నారని, చివరకు లారీలను కూడా రైతులే కిరాయి చెల్లించి తెచ్చుకునే దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని విమర్శించారు. లారీ డ్రైవర్ బస్తా కి రూ. 40 రూపాయలు వసూలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు కళ్ళు లేవా? ఉంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మాట్లాడితే ముఖ్యమంత్రి ఫీచర్ సిటీ అంటున్నారని, రైతుల గురించి పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఊక దంపుడు ఉపన్యాసాలు చేసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలనే ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బోనకల్ మండలంలో కొనుగోలు కేంద్రాల పరిధిలో కల్లాలలో వేలాది బస్తాలు, మొక్కజొన్నలు ఉన్నాయన్నారు. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంటే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అయినా ప్రభుత్వం చలించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరత, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల కొరత, మొక్కజొన్నల కొనుగోళ్ళు పై పరిమితి విధిస్తూ రైతులను ఆర్థికంగా తీవ్రంగా నష్టపరుస్తుందని విమర్శించారు. ఆరు గాలం అనేక కష్టాలు పడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి తెలియజేస్తుందన్నారు. గోడౌన్ల సౌకర్యం కల్పించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వాలకు గతంలో ఏ గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. రోజు రోజుకి వాతావరణంలో వస్తున్న మార్పులకు అన్నదాతలు తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి జిల్లాలో ఉన్నప్పటికీ రైతులకు జరిగిన ఉపయోగం మాత్రం శూన్యం అన్నారు.రైతులందరూ కదిలితేనే బోనకల్ మండలానికి మొక్కజొన్న కనుగోల కేంద్రాలు మంజూరయ్యాయని, మరల రైతులు కదిలితేనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలు కదులుతాయని, రైతుల పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వారి వెంట గోవిందాపురం ఎల్ సర్పంచ్ మంద కరుణ, మాజీ సర్పంచ్ కొమ్ము కమలమ్మ, రైతులు మాదినేని వీరభద్రరావు, జొన్నలగడ్డ సునీత, ఏడునూతల లక్ష్మణరావు, దొండపాటి సత్యనారాయణ, జోనిబోయిన గురవయ్య, ఎర్రగాని నాగరాజు, షేక్ నన్నేసాహెబ్, గుగులోత్ నరేష్, గుడ్డూరి ఉమ, గుడ్డురి వెంకట నరసయ్య, తమ్మారపు లక్ష్మణరావు, కళ్యాణపు శ్రీనివాసరావు, నల్లమోతు నాగేశ్వరరావు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




