Monday, May 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురామగుండం కోల్‌మైన్‌ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగల్‌

రామగుండం కోల్‌మైన్‌ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగల్‌

- Advertisement -

కేంద్ర పర్యావరణశాఖ అనుమతి
ఓపెన్‌ కాస్ట్‌ 2, భూగర్భగనులు 3
మొత్తం బొగ్గు నిల్వలు 314.98 మిలియన్‌ టన్నులు
ఏడాదికి 210 లక్షల టన్నుల ఉత్పత్తి 25 ఏండ్లు కొనసాగనున్న తవ్వకాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామగుండం కోల్‌ మైన్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి శుక్రవారం లేఖ రాసింది. మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయి. 2 ఓపెన్‌ కాస్ట్‌, 3 భూగర్భ గనుల పరిధిలో 314.98 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నా యి. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొం దించారు. ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గు సమీపంలోని ఎన్టీపీసీ రామగుండం తో పాటు ఇతర బొగ్గు ఆధారిత పరి శ్రమలకు ఇంధన ఒప్పందం ప్రకారం సరఫరా చేయనున్నారు.

మూతపడిన జీడీకే-10 ఇంక్లైన్‌, మూతపడనున్న వకీల్‌ పల్లి భూగర్భ గనులను ఓపెన్‌ కాస్ట్‌ గనులుగా మార్చి అక్కడ మిగిలి ఉన్న బొగ్గును సంపూర్ణంగా వెలికి తీస్తారు. అలాగే ఈ గనులకు ఆనుకుని ఉన్న రామగుండం ఓపెన్‌ కాస్ట్‌-1, విస్తరణ ప్రాజెక్ట్‌ ఫేజ్‌ 2, రామగుండం ఓపెన్‌ కాస్ట్‌-2, అడ్రియాల షాఫ్ట్‌ అండర్‌ గ్రౌండ్‌ విస్తరణ అంచుల్లో మిగిలిన బొగ్గును వెలికి తీస్తారు. వీటన్నింటినీ కలిపి రామగుండం కోల్‌ మైన్‌ అనే ప్రాజెక్ట్‌కు సింగరేణి రూపకల్పన చేసింది. సింగరేణి చేపట్టిన ప్రాజెక్ట్‌లకు భిన్నంగా తక్కువ పెట్టుబడులతో, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. గతంలో ఈ విధానం ద్వారా కొత్తగూడెంలోని గౌతమ్‌ ఖని ఓపెన్‌ కాస్ట్‌, వీకే కోల్‌మైన్‌, మణుగూరు ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గును సింగరేణి విజయవంతంగా వెలికి తీసింది. మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేసుకోవడంతోపాటు ఈ గని రామగుండం రీజియన్‌కు మరో 25 సంవత్సరాల జీవిత కాలాన్ని అందించనుంది.

6 వేల మందికి ఉపాధి
రామగుండం కోల్‌ మైన్‌ ప్రాజెక్ట్‌లో దాదాపు 5,403 మంది పర్మనెంట్‌, 600 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఉపాధి లభించనుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్‌కు 26.08 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం సింగరేణి సంస్థ రూ.2,194.05 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వ్యాపారపరంగా కూడా సింగరేణికి ఇది గొప్ప అవకాశం. రామగుండంలోని ఎన్టీపీసీకి సింగరేణి సంస్థ దశాబ్దాల కాలంగా బొగ్గు సరఫరా చేస్తున్నది. పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో తగినంత బొగ్గును ఎన్టీపీసీకి అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రామగుండం కోల్‌ మైన్‌కు అనుమతి రావడం వల్ల ఎన్టీపీసీతో సింగరేణి వ్యాపార బంధం ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగనుంది.

మొత్తం 5 ప్రాజెక్ట్‌లు
రామగుండం కోల్‌ మైన్‌ను 5 ప్రాజెక్ట్‌లుగా చేపట్టాలని సింగరేణి నిర్ణయించింది. జీడీకే-10 ఇంక్లైన్‌ గని అంచుల్లో మిగిలి ఉన్న 56.79 మిలియన్‌ టన్నుల బొగ్గు, వకీల్‌ పల్లి గనిలో మిగిలి ఉన్న 28.99 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీస్తారు. వీటితో పాటు రామగుండం ఓపెన్‌ కాస్ట్‌-1 విస్తరణ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-2కు మధ్య సరిహద్దు ప్రాంతంలో రక్షణ నిమిత్తం వదిలేసిన 25.98 మిలియన్‌ టన్నుల బొగ్గు, ఇంకా ఈ గనులకు పక్కన అటు ఇటు ఉన్న 3.90 మిలియన్‌ టన్నులు, రామగుండం ఓపెన్‌ కాస్ట్‌-2 విస్తరణ ప్రాజెక్ట్‌, అడ్రియాల షాఫ్ట్‌ అండర్‌ గ్రౌండ్‌ విస్తరణ గనుల సరిహద్దుల వద్ద మిగిలి ఉన్న బొగ్గును కూడా ఈ ప్రాజెక్ట్‌ కిందనే తవ్వి తీయాలని సింగరేణి నిర్ణయించింది. కొత్త ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల ద్వారా ఓపెన్‌ కాస్ట్‌ గనుల నుంచి 182.28 మిలియన్‌ టన్నులు, భూగర్భ గనుల ప్రాంతం నుండి 132.70 మిలియన్‌ టన్నుల బొగ్గు వెలికి తీయనున్నారు.

పర్యావరణానికి ముప్పు లేకుండా..
రామగుండం కోల్‌ మైన్‌ ప్రాజెక్ట్‌లో తవ్వే ఓపెన్‌ కాస్ట్‌, భూగర్భ గనుల వల్ల పర్యావరణానికి ముప్పు లేకుండా సింగరేణి ప్రణాళిక సిద్దం చేసింది. ముందుగా మూతపడిన జీడికే-10 ఇంక్లైన్‌ భూగర్భ గనిని ఓపెన్‌ కాస్ట్‌ గనిగా మారుస్తారు. షావెల్‌-డంపర్‌ పద్ధతిలో తవ్వుతూ వెళ్తారు. ఈ క్రమంలో వచ్చే ఓవర్‌ బర్డెన్‌ మట్టిని ప్రస్తుతం ఆర్‌జీఓసీ- ఎక్స్‌ టెన్షన్‌ ఫేజ్‌-2లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో నింపుతూ వస్తారు. ఆ తర్వాత వకీల్‌ పల్లి గనిని ఓపెన్‌ కాస్ట్‌గా మారుస్తారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే ఓవర్‌ బర్డెన్‌ మట్టిని అప్పటికే తవ్వకం పూర్తయిన జీడీకే-10 ఇంక్లైన్‌ క్వారీలో ఏర్పడే ఖాళీ ప్రదేశంలో నింపుతారు. ఈ విధంగా రెండు భూగర్భ గనులను ఓపెన్‌ కాస్ట్‌ గనులుగా మార్చినప్పటికీ ఆ క్వారీలలో అక్కడ ఉత్పత్తి జరిగే ఓవర్‌ బర్డెన్‌ మట్టితో నింపడం పర్యావరణహిత చర్యగా సింగరేణి పేర్కొంది. అలాగే రామగుండం కోల్‌ మైన్‌లో భాగంగా ఉన్న ఇతర ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో కూడా ఇదే పద్దతిలో బొగ్గు తవ్వకాలను కొనసాగిస్తారు. ఈ మొత్తం తవ్వకాన్ని లాంగ్‌ వాల్‌, కంటిన్యూయస్‌ మైనర్‌, బోర్డర్‌ మైనర్స్‌, రోడ్డు హెడర్స్‌ ద్వారా షావెల్‌-డంపర్‌ ప్రక్రియలో నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -